ఇదో గోకులం | Tribal dumb love in Medak | Sakshi
Sakshi News home page

ఇదో గోకులం

Apr 12 2016 5:09 AM | Updated on Oct 1 2018 2:00 PM

ఇదో గోకులం - Sakshi

ఇదో గోకులం

కరువు కాటుకు పచ్చని పల్లెలు, పాడి పశువులు విలవిల్లాడుతున్నాయి. భగభగ మండుతున్న ప్రచండ భానుడి ప్రభావంతో జలవనరులు ఎడారులయ్యాయి.

మెదక్‌లో గిరిజనుల మూగ ప్రేమ
♦ కరువుతో మొదళ్లకుంట తండావాసుల పోరాటం
♦ మేత కోసం మైళ్లదూరం..
 
 పాపన్నపేట: కరువు కాటుకు పచ్చని పల్లెలు, పాడి పశువులు విలవిల్లాడుతున్నాయి. భగభగ మండుతున్న ప్రచండ భానుడి ప్రభావంతో జలవనరులు ఎడారులయ్యాయి. చెరువులు, కుంటలు ఎండిపోయి నైబారాయి. గుక్కెడు నీటికోసం మనుషులే కాదు.. మూగజీవాలు తహతహలాడుతున్నాయి. అయినా ఆ గిరిపుత్రులు మాత్రం పశు సంపదను బతికించుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. వాటి మేత కోసం కాళ్లు బొబ్బలెక్కుతున్నా లెక్క చేయకుండా మండుటెండల్లో మైళ్ల దూరం అడుగులు వేస్తున్నారు. కరువు కోరలకు తమ కాడెడ్లను బలికాకుండా చూసుకుంటామని ధీమాతో చెబుతున్నారు.

తమ సంకల్పానికి సర్కార్ చేయూతనివ్వాలని వేడుకుంటున్నారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలో మారుమూలనున్న మొదళ్లకుంట ఓ గిరిజన తండా. అక్కడ 50 కుటుంబాలు మాత్రమే నివసిస్తున్నా.. రెండు వేల పశుసంపద వారి సొంతం. మండలంలో మొత్తం ఆరు వేల పశువులుంటే ఈ ఒక్క తండాలోనే 2 వేల పశువులు ఉండటం వారి మూగప్రేమకు నిదర్శనం. పశు సంపదతో వచ్చే ఎరువు వారి ప్రధాన ఆదాయం. సేంద్రియ ఎరువులు వాడాలనుకునే మండలంలోని రైతులంతా ఈ గిరిజన తండాకే వస్తుంటారు. ఉద యం 10గంటల సమయంలో మేత కోసం పశువులు వెళ్తుంటే.. శ్వేత సైన్యమే కదనభూమికి కదులుతున్నట్లు కనిపిస్తుంది.

 తాగునీటికి తండ్లాట
 50 గుడిసెల ఆ తండాలో నాలుగు బోర్లు ఉన్నప్పటికీ ఒక్కటి కూడా పనిచేయడం లేదు. ఇటీవల కొత్తగా ఓ బోరు వేయగా అందులో నీళ్లు పడ్డప్పటికీ మోటారు బిగించకపోవడంతో అది అలంకారప్రాయంగానే మిగిలింది. ప్రస్తుతం సమీపంలోని నర్సింగరావుపల్లి తండాలో ఓ సింగిల్‌ఫేస్ బోరు నుండి వచ్చే నీటితో ఓ మడుగును ఏర్పాటు చేశారు. ఆ రెండు తండాల పశువుల దాహార్తి తీర్చేందుకు ఈ మడుగును ఉపయోగించుకుంటున్నారు. ఇక మేత కోసం ఉదయం 10గంటలకు ఇంటి నుంచి బయల్దేరే వీరు మండుటెండలో మంజీరా చుట్టూ పశువులను తిప్పుతారు.
 
 పశువులను కాపాడుకుంటాం
 ఒక్క గడ్డిమోపు కొనాలంటే రూ.100లు కావాలి. కరువు కాలంలో పశువులకు కొని పెట్టాలంటే మా వల్ల కాదు. పశువులు ఇంటి ముందుంటే లక్ష్మికళ కనిపిస్తుంది. అందుకే పశువులను మాత్రం అమ్మకుండా కాపాడుకుంటాం.      
- తులసీరాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement