కరీంనగర్‌: సమఉజ్జీల సమరం

Triangular Fighting In Karimnagar Constituency - Sakshi

అభివృద్ధి, సంక్షేమ మంత్రంతో గంగుల

విజయం తనదే అంటున్న ‘పొన్నం

చాపకింద నీరులా సంజయ్‌  

ఉద్యమాల పురిటిగడ్డ కరీంనగర్‌లో ఏ ఎన్నిక జరిగినా ప్రతిష్టాత్మకమే.! అన్ని పార్టీలకు కీలకమే.! ఇక్కడి ఓటర్లు ప్రతి ఎన్నికల్లో విలక్షణమైన తీర్పునిస్తూ అందరు నాయకుల్ని ఆదరించిన సందర్భాలున్నాయి. జిల్లా కేంద్రంగా రాష్ట్రంలోనే ప్రత్యేకతను సాధించింది కరీంనగర్‌. ఓసీలకు కంచుకోటగా ఉన్న నియోజకవర్గంలో ఈ సారి ముగ్గురు బీసీ అభ్యర్థులు నువ్వా–నేనా అన్నట్లు తలపడుతున్నారు. కాంగ్రెస్, టీఆర్‌ఎస్, బీజేపీ అభ్యర్థులు పొన్నం ప్రభాకర్, గంగుల కమలాకర్, బండి సంజయ్‌లు హోరాహోరీగా పోటీ పడుతున్నారు. నియో జక వర్గంలోని అన్ని గ్రామాల్లో కలియ తిరు గుతూ ప్రత్యర్థుల వైఫల్యాలను ఎండగడుతూ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఎవరికి వారు గెలుపుధీమాతో ఉన్నారు. 

సాక్షి, కరీంనగర్‌: కరీంనగర్‌ ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీచేస్తున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు అందరూ రాష్ట్రస్థాయి నాయకులు కావడంతో ఓటర్లు అసక్తిగా ప్రజాతీర్పు ఎలా ఉండబోతుందోనంటూ ఎక్కడ చూసిన చర్చించుకోవడం వినబడుతోంది. గంగుల కమలాకర్‌ హ్యట్రిక్‌ సాధించాలనే దిశగా తన ప్రచార పర్వాన్ని ఇప్పటికే కొత్తపల్లి, కరీంనగర్‌రూరల్, కరీంనగర్‌ పట్టణంలో ప్రచారాన్ని ఉధృతం చేశారు. కాంగ్రెస్‌ అభ్యర్థి పొన్నం ప్రభాకర్‌ తనదైన శైలిలో ప్రచారపర్వాన్ని కొనసాగిస్తున్నారు. నగరంలో ఆరు రోజుల పాటు పాదయాత్ర జరిపి ప్రజా సమస్యలను అవగతం చేసుకున్నారు. బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌ గతంలో రెండోస్థానంలో నిలిచారు. ఈసారి ఎలాగైన కమలం జెండా ఎగురవేయాలనే లక్ష్యంతో చాపకింద నీరులా పుంజుకుంటున్నారు. 

అభివృద్ధి పనులు...  
పట్టణంలో రహదారుల వెడెల్పు, నూతన రహదారుల నిర్మాణానికి రూ.46 కోట్లు         
విద్యుత్‌ టవర్ల నిర్మాణానికి రూ.22 కోట్లు 
కరీంనగర్‌ పట్టణం నుంచి రేకుర్తి వరకు విద్యుత్‌ టవర్ల తొలగింపుకు రూ.36 కోట్లు 
అంతర్గత రహదారుల అభవృద్ధికి రూ. వంద కోట్లు 
రెండోదఫా అంతర్గత రహదారుల అబివృద్ధికి రూ.147 కోట్లు 
మూడోదఫా అంతర్గత రహదారులలకు రూ. వంద కోట్లు 
బైపాస్‌ రోడ్‌ రేకుర్తి నుంచి తీగలగుట్టపల్లి, దుర్శెడ్‌ ద్వారా మానకొండూర్‌ వరకు 145 కోట్లతో రోడ్డు నిర్మాణం  
సదాశివపల్లె దగ్గర మానేరు వంతెనకై దక్షిణ భారతదేశంలోనే మొదటగా నిర్మిస్తున్న తీగల వంతెనకు 183 కోట్లు  
కమాన్‌ నుంచి హౌసింగ్‌బోర్డు కాలనీ రహదారి నిర్మాణానికి రూ.34 కోట్లు 
33 నూతన రహదారుల నిర్మాణానికి అర్‌అండ్‌బీ శాఖ ద్వారా రూ.504 కోట్లు 
రూ. 4.50 కోట్లతో రైతు బజార్‌ 

ప్రధాన సమస్యలు  
పట్టణంలో 24 గంటల నీటి సరఫరా సమస్య 
అస్తవ్యస్తంగా అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ వ్యవస్థ  
పట్టణంలో పార్కుల సుందరీకరణ 

సిట్టింగ్‌ ఎమ్మెల్యే ప్రొఫైల్‌ 

కరీంనగర్‌ పట్టణంలోని క్రిస్టియ న్‌ కాలనీకి చెందిన గంగుల కమలాకర్‌  బీటెక్‌ (సివిల్‌) పూర్తి చేశారు. 2000 సంవత్సరంలో తెలుగుదేశంపార్టీలో రాజకీయ ప్రవేశం చేశారు. తెలుగు యువత జిల్లా అధ్యక్షుడిగా, తెలుగుదేశంలో పార్టీలో జిల్లాస్థాయి పదవులు చేపట్టారు.  2000– 2009 వరకు రెండుసార్లు కౌన్సిలర్, కార్పొరేటర్‌గా పనిచేశారు. 2009 సంవత్సరంలో మొదటిసారి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి రెండవసారి పోటీ చేసి విజయం సాధించారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి హ్యాట్రిక్‌సాధించాలనే తహతహతో ముందుకు సాగుతున్నారు. 

పొన్నం ప్రభాకర్‌ (కాంగ్రెస్‌) 


మం కమ్మతోటకు చెందిన పొ న్నం ప్రభాకర్‌ 1987– 88 లో ఎస్సారార్‌ డిగ్రీ కళాశాల ప్రెసిడెంట్‌గా రాజకీయ అరంగ్రేటం చేశారు. 1989 నుంచి 2004 వరకు ఎన్‌ఎస్‌యూఐ, యూత్‌ కాంగ్రెస్, పీసీసీ మీడి యా విభాగం, రాష్ట్ర స్థాయి పదవులను చేపట్టారు. 2005– 09 వరకు ఉమ్మడి రాష్ట్రంలో మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌గా వ్యవహరించారు. 2009–2014 వరకు  కరీంనగర్‌ పార్లమెంట్‌ సభ్యులుగా, ఏపీ ఎంపీల ఫోరం కన్వీనర్‌గా పనిచేశారు. ప్రస్తుతం టీపీపీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కొనసాగుతున్నారు. మొదటిసారిగా అసెంబ్లీకి పోటీచేస్తున్న ప్రభాకర్‌ కరీంనగర్‌ ఎంపీగా కొనసాగినకాలంలో చేసిన అభివృద్ధి పనులు తనను గెలుపిస్తాయని ధీమాతో ఉన్నారు.

బండి సంజయ్‌కుమార్‌ (బీజేపీ)


కరీంనగర్‌ పట్టణంలోని జ్యోతినగర్‌కు చెందిన బండి సంజయ్‌కుమార్‌ విద్యార్థి దశ నుం చే ఏబీవీపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్త నుంచి బీజేవైఎం జాతీయ కార్యవర్గ సభ్యుడిగా,  ఏపీ, తమిళనాడు బీజేవైఎం ఇన్‌చార్జిగా కొనసాగారు. కరీంనగర్‌ నగరపాలక సంస్థకు ఒకసా రి కౌన్సిలర్‌గా , రెండుసార్లు కార్పొరేటర్‌గా పనిచేశారు. బీజేపీ నగర అధ్యక్షుడిగా, రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నారు. 2014 శాసనసభకు జరిగిన ఎన్నికల్లో కరీంనగర్‌ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి రెండోస్థానంలో నిలిచారు. మరోసారి పోటీలో నిలిచి బండి సంజయ్‌ తన అదృష్టాన్ని పరిక్షించుకుంటున్నాడు. ప్రధాని మోడీ పథకాలు, హిందుత్వం ఏజెండాగా పనిచేస్తున్నారు. ప్రజల ఆశీస్సులు తనకే ఉన్నాయని... గెలుపుఖాయమని అంటున్నారు. 

కరీంనగర్‌ నియోజకవర్గం వార్తల కోసం​...

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top