అక్రమాలకు చెక్‌ ! | Transport Steering to Viswajith | Sakshi
Sakshi News home page

అక్రమాలకు చెక్‌ !

Jun 5 2019 6:59 AM | Updated on Jun 6 2019 10:28 AM

Transport Steering to Viswajith - Sakshi

జీహెచ్‌ఎంసీలోని రవాణా విభాగంలో ప్రక్షాళనకు అధికారులు నడుం బిగించారు. అతి కీలకమైన ట్రాన్స్‌పోర్టు సెక్షన్‌ బాధ్యతలను ‘విజిలెన్స్‌’ విశ్వజిత్‌కుఅప్పగించారు. ఇప్పటికే పలు విభాగాల్లో సమర్థవంతమైన పనితీరు కనబర్చిన విశ్వజిత్‌ రవాణా రంగంలోనూ వేళ్లూనుకుపోయిన అవినీతిని పెకిలిస్తారని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. చెత్తతరలింపు వాహనాల విషయంలో తప్పుడు లెక్కలు...ఇష్టారాజ్యంగా బిల్లులు చేయడం, అద్దె వాహనాలు, వాహనాల మరమ్మతుల పేరిట జరిగే అవినీతికి అంతేలేదనే ప్రచారం ఇప్పటికే ఉంది. ఈ నేపథ్యంలో విశ్వజిత్‌ నియామకం ప్రాధాన్యంసంతరించుకుంది.

సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీ అంటేనే అవినీతికి మారుపేరని ప్రచారంలో ఉంది. అందులోనూ ముందువరుసలో ఉండేవి టౌన్‌ప్లానింగ్, పన్నులు, రవాణా విభాగాలు. జీహెచ్‌ఎంసీ పరిధిలో ప్రతినిత్యం వెలువడుతున్న దాదాపు 5 వేల మెట్రిక్‌ టన్నుల చెత్తను ఆయా ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్ల నుంచి జవహర్‌ నగర్‌ డంపింగ్‌యార్డుకు తరలించేందుకు జీహెచ్‌ఎంసీ సొంత వాహనాలు కాక వందల సంఖ్యలో అద్దె వాహనాలను వినియోగిస్తున్నారు. వీటిల్లో 25 మెట్రిక్‌ టన్నులు, 6 మెట్రిక్‌టన్నుల చెత్త తరలించే  సామర్ధ్యమున్నవీ ఎన్నో ఉన్నాయి. ఈ విభాగంలో అద్దె వాహనాలు, వాహనాల మరమ్మతుల పేరిట జరిగే అవినీతికి అంతేలేదనే ప్రచారం ఉంది. ఈ పరిస్థితిని నివారించేందుకు పూర్వ కమిషనర్‌ డా.బి.జనార్దన్‌రెడ్డి రవాణా వ్యవహారాలన్నీ జోన్లు, సర్కిళ్లకు అప్పగిస్తూ అధికారాలను  వికేంద్రీకరించారు. తద్వారా అవినీతి ఆగుతుందని భావించారు.

అంతేకాదు.. ఈ ప్రక్రియ ప్రారంభించాక నాలుగైదు నెలల్లోనే ఎంతో దుబారా తగ్గిందని ప్రకటించారు. కానీ.. నిజం ఆలస్యంగా వెలుగు చూసింది.  వాస్తవంగా ఈ విభాగంలో ఖర్చు తగ్గలేదు. గతంతో పోలిస్తే ఇంకా ఎంతో భారీగా పెరిగింది.  జోన్లు, సర్కిళ్లకే అధికారాలను కట్టబెట్డడంతో అక్కడేం జరుగుతుందో ప్రధాన కార్యాలయంలోని వారికి తెలియదు. జవాబుదారీ తనం లేదు. పైనుంచి పర్యవేక్షించేవారు, అజమాయిషీ చేసే వారు లేరు.  ప్రధాన కార్యాలయంలోని సంబంధిత విభాగం అడిషనల్‌ కమిషనర్లు వాటి గురించి పట్టించుకోలేదు. అద్దె వాహనాలు, మరమ్మతులు, ఇంధనం తదితరమైనవన్నీ ఆగమాగం. కాగితాల్లో ఉన్న అద్దె వాహనాలెన్నో.. వాస్తవంగా నడుస్తున్నవెన్నో తెలియవు. అయినప్పటికీ  నిధుల చెల్లింపులు మాత్రం జరిగిపోతూనే ఉన్నాయి. పారిశుధ్యం మెరుగుపడిందా అంటే అదీ లేదు. అధికారాలను జోన్లు, సర్కిళ్లకు అప్పగించాక  ఖర్చు మాత్రం రెండింతలు పెరిగిపోయింది. 

తాజాగా  ‘సాఫ్‌ హైదరాబాద్‌– షాన్‌దార్‌ హైదరాబాద్‌’ కార్యక్రమంలో భాగంగా నగరాన్ని పరిశుభ్ర నగరంగా తీర్చిదిద్దేందుకు కమిషనర్‌ దానకిశోర్‌ ఎన్నో చర్యలు చేపట్టారు. అందులో భాగంగా ఉదయమే కాక  సాయంత్రం కూడా చెత్తను తరలించాలని నిర్ణయించారు. అందుకుగాను అన్ని సర్కిళ్లకు అదనపు వాహనాలు అవసరమని ప్రతిపాదించారు. దాంతోపాటు కాలం చెల్లిన పాతవాహనాల స్థానే అద్దె వాహనాలు తీసుకోవాలని కూడా నిర్ణయించారు. ఇప్పటికే  వాహనాల అద్దెల కోసం దాదాపు 200 వాహనాలకు ఏటా దాదాపు రూ. 90 కోట్లు ఖర్చు చేస్తున్నారు. స్వచ్ఛ నగరం అమలు కోసం అదనంగా మరో 150 వాహనాలను అద్దెకు తీసుకునే యోచనలో ఉన్నారు. వీటికి టెండర్లు ఆహ్వానించేందుకు సిద్ధమయ్యారు.

వీటి కోసం సంవత్సరానికి  దాదాపు రూ.65 కోట్లు  ఖర్చు కాగలదని అంచనా. ఇంత ఖర్చు చేసినా ఫలితం కనిపిస్తుందో లేదో తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ రవాణా విభాగం బాధ్యతల్ని  ఐపీఎస్‌ అధికారి ఈవీడీఎం(ఎన్‌ఫోర్స్‌మెంట్, విజిలెన్స్, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌) డైరెక్టర్‌ విశ్వజిత్‌ కాంపాటికి అప్పగించారు. ప్రస్తుతం ఈ బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఐఏఎస్‌ అధికారి శృతి ఓజాకు రవాణా విభాగంతో పాటు పారిశుధ్యం, ఎంటామాలజీ, స్వీపింగ్‌ మెషిన్లు, చెత్తనుంచి విద్యుత్‌ తదితర బాధ్యతలున్నాయి. రవాణా విభాగంలో ప్రక్షాళన చేపట్టి, అక్రమాలకు అడ్డుకట్ట వేయనిదే  ఎన్ని నిధులు కుమ్మరించినా వృథా అని భావించినట్లున్నారు. ఈవీడీఎం డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన ఏడాదిలోనే విశ్వజిత్‌ విపత్తు సందర్భాల్లో తక్షణ స్పందనతో  సమర్ధుడైన అధికారిగా పేరు తెచ్చుకున్నారు. పారిశుధ్య విభాగంలో నకిలీ వేలిముద్రలతో బోగస్‌ కార్మికుల బాగోతాన్ని బట్టబయలు చేశారు.  ఫుట్‌పాత్‌లపై ఆక్రమణల తొలగింపులోనూ ఒత్తిళ్లకు తలొగ్గకుండా పనిచేశారు. పలుపార్కు స్థలాల కబ్జాలను నిలువరించారు.  ఈ నేపథ్యంలో  రవాణా విభాగంలో అవినీతికి తావులేకుండా ఉండేందుకు ఆ విభాగం బాధ్యతల్ని ఆయనకు అప్పగించినట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement