జీహెచ్‌ఎంలకు బదిలీ ఉత్తర్వులు జారీ  | Transfer of orders to GHMs | Sakshi
Sakshi News home page

జీహెచ్‌ఎంలకు బదిలీ ఉత్తర్వులు జారీ 

Jul 7 2018 1:28 AM | Updated on Jul 7 2018 1:28 AM

Transfer of orders to GHMs - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గెజిటెడ్‌ ప్రధానోపాధ్యాయులు, గ్రేడ్‌–2 హెచ్‌ఎంల బదిలీల ప్రక్రియ ముగిసింది. బదిలీల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో ఆప్షన్లు ఇచ్చుకున్న జీహెచ్‌ఎంలకు విద్యాశాఖ శుక్రవారం బదిలీ స్థానాలను కేటాయించింది. బదిలీ పొందిన వారు తక్షణమే విధుల నుంచి రిలీవ్‌ అయి, వారికి కేటాయించిన స్థానాల్లో చేరాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈ మేరకు వెబ్‌సైట్‌లో వివరాలను పొందుపర్చింది. రాష్ట్రవ్యాప్తంగా 2,193 మంది జీహెచ్‌ఎంలు బదిలీ కోసం దరఖాస్తు చేసుకోగా.. 2,182 మంది వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకున్నారు. ఈ ప్రక్రియలో 541 మంది తప్పనిసరి బదిలీ కానుంది. విద్యాశాఖ విడుదల చేసిన జీహెచ్‌ఎంల బదిలీ జాబితాలో వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకున్న మొత్తం 2,182 మందికీ బదిలీ కావడం గమనార్హం. దీంతో సగానికి పైగా జీహెచ్‌ఎంలు శుక్రవారమే రిలీవ్‌ కాగా.. అందులో మెజార్టీ టీచర్లు సాయంత్రమే కొత్త స్థానాల్లో జాయిన్‌ అయ్యారు.  

పొరపాటు సరిదిద్ది.. 
జీహెచ్‌ఎంల బదిలీ ప్రక్రియలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఇద్దరికి ఒకే పాఠశాల కేటాయించారు. ఈ పరిస్థితి కరీంనగర్‌ జిల్లాలో చోటుచేసుకుంది. దీంతో ఆ ఉపాధ్యాయులు విద్యాశాఖకు ఫిర్యాదు చేయడంతో సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టింది. జీహెచ్‌ఎం ఖాళీలు సంతృప్తికర స్థాయిలో ఉండటం.. జాబితాలో వరుస క్రమంలోని టీచర్ల మధ్య అంతరం ఉండటంతో వేర్వేరు స్థానాలను కేటాయించారు. ఈ ప్రక్రియలో బదిలీ జాబితాలో పెద్దగా మార్పులు చోటుచేసుకోకపోవడంతో జీహెచ్‌ఎంలంతా ఊపిరి పీల్చుకున్నారు. జీహెచ్‌ఎంలకు బదిలీ స్థానాల కేటాయింపుల్లో తలెత్తిన పొరపాట్లను స్కూల్‌ అసిస్టెంట్‌ (ఎస్‌ఏ), ఎస్జీటీల బదిలీ కేటాయింపుల్లో తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

జాబితాను ఒకటికి రెండు సార్లు పరిశీలించిన తర్వాతే విడుదల చేయాలని విద్యాఖాఖ నిర్ణయించింది. దీంతో శుక్రవారమే స్కూల్‌ అసిస్టెంట్ల బదిలీ జాబితా విడుదల కావాల్సి ఉన్నా.. రాత్రి వరకూ కేటాయింపులు పూర్తి కాలేదు. దీంతో జాబితా విడుదల ఆలస్యమైంది. కేటాయింపులు పూర్తయిన తర్వాత జాబితాను పరిశీలించి విడుదల చేయాలని విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు. స్కూల్‌ అసిస్టెంట్‌ కేటగిరీలో 31,968 మంది బదిలీ కోసం దరఖాస్తు చేసుకోగా.. 31,483 మంది వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకున్నారు. వీరిలో బదిలీ పొందిన టీచర్ల జాబితాను శుక్రవారం అర్ధరాత్రి తర్వాత వెబ్‌సైట్‌లో పెట్టే అవకాశం ఉంది. అదేవిధంగా సెకండరీ గ్రేడ్‌ టీచర్ల కేటగిరీలో 40,729 మంది బదిలీ కోసం దరఖాస్తు చేసుకోగా.. 39,054 మంది వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకున్నారు. వీరి బదిలీ జాబితాను శనివారం విడుదల చేయనున్నట్లు సమాచారం.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement