నిధులు కేటాయించకపోతే గాడిదకు వినతిపత్రం

TPCC Working President Ponnam Prabhakar Comments On TRS Government - Sakshi

టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పొన్నం ప్రభాకర్‌

సాక్షి, రాజన్న సిరిసిల్ల జిల్లా: వేములవాడ ఆలయ అభివృద్ధికి ప్రతి ఏడాది వంద కోట్ల రూపాయలు ఇస్తామని గత ఐదేళ్ల క్రితం సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీ ఏమైందని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పొన్నం ప్రభాకర్‌ ప్రశ్నించారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆలయ అభివృద్ధి పేరిట ఉన్న గుడి చెరువు పూడ్చడం తప్ప టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిందేమీలేదని విమర్శించారు. యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిలో దూసుకుపోతుందని, వేములవాడలో మాత్రం ఒక పని కూడా చేయలేదని మండిపడ్డారు. వీటీడీఏ హైదరాబాద్‌ కార్యాలయానికి కూడా దేవస్థానమే డబ్బులు చెల్లిస్తుండగా, యాదాద్రి డెవలప్‌మెంట్‌ అథారిటీకి రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు చెల్లిస్తోందని తెలిపారు.

కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ ఎన్నికై ఏడాది గడుస్తున్నా.. వేములవాడ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రికి ఒక్క లేఖ కూడా రాయలేదని దుయ్యబట్టారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు హోదాలో ఆయన వెంటనే  సీఎం కేసీఆర్‌ను కలవాలని డిమాండ్‌ చేశారు. వేములవాడ ఎమ్మెల్యే రమేష్‌బాబు జర్మనీకే అంకితం అయ్యారని ధ్వజమెత్తారు. వచ్చేనెల లోపు ఆలయ అభివృద్ధికి నిధులు కేటాయించకపోతే గాడిదకు వినతపత్రం ఇస్తామని పొన్నం ప్రభాకర్‌ ఎద్దేవా చేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top