గిరిపల్లెల్లో పులి సంచారం!

Tiger wandering In Gripalli In Adilabad - Sakshi

ఎంపల్లి శివారులో గ్రామస్తులు

గుర్తించిన పులి అడుగు

భయాందోళనలో గిరిజనులు

నార్నూర్‌(ఆసిఫాబాద్‌): వారంరోజులుగా గిరి పల్లెల్లో పులి సంచరిస్తుండడంతో గిరి జనులు భయాందోళనకు గురవుతున్నారు. ఐదురోజుల క్రితం మండలంలోని మల్కుగూడ శివారులో పత్తి ఏరేందుకు వెళ్లిన విజయలక్ష్మి అనే గిరిజన యువతికి పులి కనిపించడంతో తప్పించుకుని ఇంటికి పరుగులు తీసింది. ఈ సంఘటన మరువకముందే ఆదివారం మండలలోని ఎంపల్లి కొలాంగూడ గ్రామ శివారులో పత్తి చేనులోని పత్తి ఏరేందుకు వెళ్లిన గిరిజన మహిళ నీలాబాయితో పాటు మరో ఆరుగురు మహిళలకు పులి కనిపించడంతో ఇళ్లకు పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న ఎస్సై విజయ్‌కుమార్‌ గ్రామానికి చేరుకుని అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.

గిరిజనులు ఎలాంటి భయాందోళనకు గురి కావద్దని సూచించారు. పులి సంచరిస్తున్న ప్రాంతాన్ని ఎఫ్‌ఎస్‌వో ప్రకాష్‌ సందర్శించి పులిని చూసిన గిరిజన మహిళల ద్వారా సమాచారం సేకరించారు. పులి ఆనవాళ్లను పరిశీలిస్తున్నామన్నారు. గిరిజనులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అటవీశాఖ ఆధ్వర్యంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. పులి సంచరిస్తున్న విషయం తెలియడంతో అటవీ ప్రాంతంలో ఉన్న గిరిజనులు కర్రలతో గస్తీ నిర్వహిస్తున్నారు. అటవీశాఖ అధికారులు పులి సంచారంపై ప్రత్యేక నిఘా ఉంచి ప్రాణాలు కాపాడాలని గిరిజనులు కోరుతున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top