కాంగ్రెస్‌లో కొనసాగుతున‍్న కుమ్ములాట పరంపర!

Ticket Classes In Congress - Sakshi

జిల్లాలోని సీట్లపై తేలని పొత్తుల లెక్కలు

ఢిల్లీ, హైదరాబాద్‌ చుట్టూ ఆశావహుల ప్రదక్షిణలు

కాంగ్రెస్‌ కూటమిలో రగులుకుంటున్న అసమ్మతులు

చంద్రబాబుతో అంటకాగడంతో తీవ్ర వ్యతిరేకత   

సాక్షి, కొత్తగూడెం:  కాంగ్రెస్‌ కూటమి సీట్ల సర్దుబాట్లు, అభ్యర్థుల ప్రకటన అంశాలపై రెండు నెలలుగా అదుగో.. ఇదుగో అంటూ వార్తలు వచ్చి నప్పటికీ నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం వరకు పీటముడి వీడడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా పరిస్థితి అలా ఉంటే.. జిల్లాలో మాత్రం మరింత గందరగోళంగా మారింది. పినపాక మినహా మిగిలిన నాలుగు సీట్ల విషయమై ఇప్పటికీ గుంజాటన కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో సీట్ల లెక్కలు, అభ్యర్థుల ప్రకటనపై స్పష్టత లేకపోవడంతో అసమ్మతులు రగులుతున్నాయి.

 కాంగ్రెస్‌ పార్టీ చంద్రబాబుతో అంటకాగడంతో ఇప్పటికే వివిధ వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మరోవైపు కూటమి పార్టీల మధ్య.. ముఖ్యంగా కాంగ్రెస్‌ – సీపీఐ మధ్య పొత్తులా, కత్తులా అనేలా పరిస్థితి నెలకొంది. కొత్తగూడెం సీటు విషయంలో నెలకొన్న పీటముడి మరింత బిగుసుకుంది. ఈ క్రమంలో టికెట్ల వ్యవహారం మరింత వెనక్కు వెళుతుండడంతో ఆయా పార్టీల శ్రేణుల్లో.. ప్రధానంగా కాంగ్రెస్‌ కార్యకర్తల్లో ఆగ్రహం పెల్లుబుకుతోంది. మహాకూటమి శ్రేణుల్లో మహా ఉత్కంఠ నెలకొనగా, ఆశావహులు మాత్రం ఢిల్లీ, హైదరాబాద్‌ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.

 చివరకు పరిస్థితి ఎలా మారిందంటే నామినేషన్ల చివరి రోజైన ఈనెల 19 వరకు కూడా జిల్లాలోని అభ్యర్థుల ప్రకటనను సశేషంగానే  ఉంచుతారేమోననే సందేహం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఈ ‘అతి’ జాగ్రత్త కాస్తా ‘హస్త’వ్యస్తంగా మారుతుందేమోనని కాంగ్రెస్‌ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ విషయంలో రెండు నెలల క్రితం ఉన్న సానుకూలత.. చివరికి ప్రతికూలంగా మారుతుందని వివిధ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో కార్యకర్తల్లో అయోమయం నెలకొంది.
 
ఇల్లెందు ఎవరికి దక్కేనో?
ఇల్లెందు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ టికెట్‌ కోసం భారీగా దరఖాస్తులు వెళ్లాయి. వీరిలో చీమల వెంకటేశ్వర్లు, హరిప్రియ, డాక్టర్‌ రామచంద్రనాయక్, దళ్‌సింగ్, ఊకె అబ్బయ్య హోరాహోరీ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ టికెట్‌ను బంజారాలకు ఇవ్వాలనే డిమాండ్‌ ఉంది. తాజాగా రేవంత్‌రెడ్డి వర్గీయురాలైన హరిప్రియ అనుచరులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి, ఆమెకు టికెట్‌ ఇవ్వకుంటే స్వతంత్రంగా బరిలోకి దింపుతామని ప్రకటించారు.

 మాజీ ఎమ్మెల్యే ఊకె అబ్బయ్య సైతం ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవలే పార్టీలో చేరిన అబ్బయ్య అనూహ్యంగా టికెట్‌ రేసులోకి వచ్చారు. చీమల వెంకటేశ్వర్లు మొదటి నుంచి కాంగ్రెస్‌ పార్టీలో ఉండడంతో తనకు టికెట్‌ ఇవ్వడమే న్యాయమని, కచ్చితంగా విజయం సాధిస్తానని చెబుతున్నారు. మరోవైపు దళ్‌సింగ్, రామచంద్రనాయక్‌ సైతం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ఈ స్థానంలో నామినేషన్ల చివరి రోజు వరకు అభ్యర్థిని ప్రకటించే అవకాశం లేదని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. అభ్యర్థి ప్రకటన తర్వాత ఇక్కడ అసమ్మతి భారీగానే ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

 ఇక్కడ ఆవిడేనా? 
అశ్వారావుపేట నుంచి కాంగ్రెస్‌ టికెట్‌ కోసం పలువురు పోటీపడుతున్నప్పటికీ.. మొదటి నుంచి అనేక కార్యక్రమాలు చేస్తున్న టీపీసీసీ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి సున్నం నాగమణి రేసులో ముందున్నారు. అయితే ఈ సీటు పొత్తుల్లో టీడీపీకి వచ్చే అవకాశం ఉండడంతో నాగమణి వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్‌కు బలమైన కేడర్‌ ఉందని, టీడీపీ కేడర్‌ మొత్తం తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్‌లో చేరిపోయిందని, కనుక నాగమణికే టికెట్‌ ఇవ్వాలనే డిమాండ్‌ వినిపిస్తోంది. ఒకవేళ టీడీపీకి ఇస్తే ఆ పార్టీ అభ్యర్థిని ఓడిస్తామని బహిరంగంగానే చెబుతున్నారు.

కొత్తగూడెంలో కుమ్ములాట?   
కొత్తగూడెం సీటుపై కాంగ్రెస్‌–సీపీఐ మధ్య చిక్కుముడి ఇంకా సాగుతూనే ఉంది. ఈ సీటు విషయంలో రెండు పార్టీల మధ్య పొత్తులు విచ్ఛిన్నమయ్యే స్థాయిలో గుంజాటన నడుస్తోంది. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఇక్కడి నుంచి పోటీకి సిద్ధంగా ఉన్నారు. పొత్తుల్లో భాగంగా సీటు ఇవ్వకపోయినా పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కూనంనేనికి కొత్తగూడెం టికెట్‌ ఇవ్వకుంటే ఆత్మహత్య చేసుకుంటానని ఈ నెల 8న పాల్వంచలో ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా కార్యదర్శి ఉప్పుశెట్టి రాహుల్‌ గృహనిర్భంధం చేసుకున్నాడు.సీపీఐ నాయకులు రంగంలోకి దిగి రాహుల్‌ను బుజ్జగించారు.

 మరోవైపు కాంగ్రెస్‌ నుంచి వనమా వెంకటేశ్వరరావు, ఎడవల్లి కృష్ణ మధ్య గట్టి పోటీ ఉండడంతో పార్టీ అధిష్టానం ఇద్దరినీ ఢిల్లీకి పిలిపించింది. వనమా పలువురు పార్టీ పెద్దల సహకారంతో టికెట్‌ రేసులో ముందంజలో ఉండగా, ఎడవల్లి కృష్ణకు టికెట్‌ ఇప్పించేందుకు రేణుకాచౌదరి గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కొత్తగూడెం నుంచి వనమాకే టికెట్‌ వస్తుందని వార్తలు రాగా, ఇప్పుడు ఎడవల్లికే టికెట్‌ అనే వార్తలు వస్తున్నాయి. ఎడవల్లికి టికెట్‌ కోసం రేణుక అధిష్టానంతో అమీతుమీ తేల్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

రెవంత్‌రెడ్డి నడిపించగలడా?
భద్రాచలం నుంచి కాంగ్రెస్‌కు బలమైన అభ్యర్థి లేరు. టికెట్‌ కోసం ప్రయత్నిస్తున్న కృష్ణమోహన్, కృష్ణప్రసాద్‌ ఇద్దరూ కొత్తవారే. అయితే ఇక్కడ నుంచి రేవంత్‌రెడ్డి వర్గీయురాలైన ములుగు మాజీ ఎమ్మెల్యే సీతక్కను దింపేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, సీతక్క ములుగు టికెటే కావాలని పట్టుబడుతున్నారు. దీంతో ములుగు మరో మాజీ ఎమ్మెల్యే పొడెం వీరయ్యను ఇక్కడికి పంపించాలనుకోగా, ఆయన కూడా ములుగు కోసమే పట్టుబడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఈ స్థానాన్ని సీపీఐకి ఇచ్చేందుకు సైతం కాంగ్రెస్‌ ఆలోచిస్తున్నట్లు సమాచారం.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top