పిడుగుపాటుకు ఇద్దరి మృతి

Thunderbolt  Died In Warangal - Sakshi

నెల్లికుదురు(మహబూబాబాద్‌): పిడుగుపాటుకు సోమవారం సాయంత్రం మహబూబాబాద్‌ జిల్లాలో ఇద్దరు మృతిచెందారు. నెల్లికుదురు మండలం బడితండా శివారు సొసైటీతండాకు చెందిన భూక్య రాములు అలియాస్‌ తుకారాం, భార్య బుజ్జి కలిసి తమ వ్యవసాయ భూమిలో కలుపు తీసేందుకు వెళ్లారు. వారి భూమిలోనే బడితండా శివారు తోడ్యా తండాకు చెందిన గుగులోతు లక్పతి వ్యవసాయ పనులకు వచ్చాడు. పని ముగించుకుని సాయంత్రం ఇంటికి వెళ్తుండగా ఒక్కసారిగా మెరుపులు, ఉరుములతో కూడిన వర్షం కురిసింది. దీంతో తుకారాం, బుజ్జి దంపతులతోపాటు లక్పతి పక్కనున్న గుడిసెలోకి వెళ్లారు. 

ఈ సమయంలో ఒక్కసారిగా పిడుగు పడింది. దీంతో రైతు తుకారాం, అతడి భార్య బుజ్జితోపాటు లక్పతి స్పృహ కోల్పోయారు. వర్షం తగ్గిన తర్వాత అటుగా వెళ్తున్న వారు ప్రాథమిక చికిత్స నిమిత్తం చిన్ననాగారంలోని ఆర్‌ఎంపీ వద్దకు తీసుకెళ్లారు. తుకారాం(38) అప్పటికే మృతిచెందాడు. బుజ్జి, లక్పతిని వెంటనే ఆస్పత్రికి తరలించాలని చెప్పడంతో తొర్రూర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఇదిలా ఉండగా వర్షం వల్ల మండలంలోని సీతారాంపురం శివారు రేకులతండాకు చెందిన జాటోతు సోమన్న మరో ముగ్గురు తండా వాసులతో కలిసి రెండు మోటార్‌ సైకిళ్లపై తొర్రూర్‌కు వెళ్లి వెళ్తుండగా వర్షం జోరుగా కురిసింది. మండలంలోని కాచికల్‌ వద్ద చెట్టుకొమ్మలు విరిగి పడగా గాయాలయ్యాయి.

మన్నగూడెంలో మహిళ...
డోర్నకల్‌: మండలంలోని మన్నెగూడెం గ్రామానికి చెందిన దంపతులు బోడ రవి, మంగమ్మ(22) తమ పత్తి పంట వద్ద పనిచేసేందుకు వెళ్లారు. సాయంత్రం వర్షం కురవడంతో రంగమ్మతోపాటు కూలీలందరూ చెట్ల కిందికి వెళ్లారు. వర్షం తగ్గుతున్న క్రమంలో రంగమ్మ పత్తి పంటలో నుంచి రోడ్డుపైకి వస్తుండగా పెద్ద శబ్దంతో ఆమెపై పిడుగు పడింది. దీంతో ఆమె తలకు, చాతికి గాయాలై అక్కడికక్కడే మృతిచెందింది. కొద్ది దూరంలోనే ఉన్న భర్త రవి కళ్ల ముందే భార్య చనిపోవడంతో స్పృహ కోల్పోయాడు.

ముగ్గురికి గాయాలు
నెక్కొండ(నర్సంపేట): వరంగల్‌ రూరల్‌ జిల్లా నెక్కొండ మండలంలో దీక్షకుంట గ్రామానికి చెందిన దంపతులు కూస రాజు, అనితతోపాటు బానోతు గణేష్‌ పిడుగు పాటుతో గాయాలపాలయ్యారు. తమ పొలాల్లో వ్యవసాయ పనులు చేస్తుండగా మెరుపుల కూడిన వర్షం కురిసింది. ఈ క్రమంలో పిడుగు పడింది. దీంతో రాజు, అనితకు తీవ్ర గాయాలయ్యాయి. గణేష్‌కు స్వల్ప గాయాలయ్యాయి. వారిని చికిత్సనిమిత్తం హుటాహుటిన నర్సంపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించినట్లు సర్పంచ్‌ పులి ప్రసాద్‌ తెలిపారు.
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top