వస్తువులు పెట్టేదెక్కడ! | there is no minimum facilities in residential school | Sakshi
Sakshi News home page

వస్తువులు పెట్టేదెక్కడ!

Nov 18 2014 2:49 AM | Updated on Sep 2 2017 4:38 PM

ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న గిరిజన విద్యార్థులకు అన్ని సౌకర్యాలూ కల్పించి..

ఉట్నూర్  : ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న గిరిజన విద్యార్థులకు అన్ని సౌకర్యాలూ కల్పించి.. వారి విద్యాభివృద్ధికి బాటలు వేస్తున్నామని చెబుతున్న ఐటీడీఏ మాటలు క్షేత్రస్థాయిలో ఎక్కడా రుజువు కావడం లేదు. విద్యా సంవత్సరం ఆరంభమై ఏడు నెలలు గడుస్తున్నా విద్యార్థులకు ఇంతవరకు ట్రంకు పెట్టెలు అందించిన దాఖలాలు లేవు. అదీకాక ప్రభుత్వం బడ్జెట్ విడుదల చేయలేదంటూ అధికారులు చేతులెత్తేస్తున్నారు. దీనిపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆగ్రహం చెందుతున్నారు.

 అవసరం 11,406..
 జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆశ్రమ పాఠశాలల్లో దాదాపు 38,963 మంది గిరిజన విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఈ ఏడాది కొత్తగా చేరిన విద్యార్థులతో పాటు పెట్టెలు తీసుకుని ఐదేళ్లు దాటిన విద్యార్థులకు కొత్త ట్రంక్ పెట్టెలు అందించాల్సి ఉంది. ఇందుకోసం గిరిజన సంక్షేమ శాఖ అధికారులు ఈ విద్యా సంవత్సరంలో సుమారు 11,406 ట్రంకు పెట్టెలు అవసరమని తేల్చి ఒక్కో పెట్టెకు రూ.550 చొప్పున రూ.62 లక్షల 73 వేల 300 అవసరమని ప్రణాళికలు సిద్ధం చేసి ఆగస్టులో ప్రభుత్వానికి నివేదించారు. కానీ.. ఇంతవరకూ ప్రభుత్వం నుంచి గిరిజన సంక్షేమ శాఖకు నిధులు విడుదల కాకపోవడంతో ట్రంకు పెట్టెలకు టెండర్లు నిర్వహించలేదు. బడ్జెట్ వస్తేగానీ టెండర్లు నిర్వహించి పెట్టెలు విద్యార్థులకు అందించలేమని అధికారులు వాపోతున్నారు.

 విద్యార్థుల ఇబ్బందులు..
 గిరిజన సంక్షేమ శాఖ అధీనంలోని 123 ఆశ్రమ పాఠశాలల్లో ఈ ఏడాది దాదాపు 4,500 మంది విద్యార్థులు కొత్తగా చేరారు. వీరందరికీ ఐటీడీఏ ఉచిత భోజన వసతితోపాటు నిత్యావసర వస్తువులు, మౌలిక వసతులు కల్పిస్తోంది. ఏటా ఆశ్రమాల్లో కొత్తగా చేరే విద్యార్థులకు, చేరి ఐదేళ్లు దాటిన విద్యార్థులకు కొత్త ట్రంకు పెట్టెలు అందిస్తోంది. ఈసారి ఇంతవరకూ ఇవ్వకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. పుస్తకాలు, ప్లేట్, గ్లాస్, బట్టలు, పెన్నులు, చద్దర్లు, ఇతర సామగ్రి ఎక్కడ భద్రపరుచుకోవాలో తెలియక బాధలు అనుభవిస్తున్నారు.

ఆర్థికంగా ఉన్న విద్యార్థులు ఇళ్ల ఉంచి పెట్టెలు కొనుగోలు చేసుకున్నారు. కొందరు తోటి విద్యార్థుల పెట్టెల్లో సామగ్రి దాచుకుంటున్నారు. అలా అవకాశం లేని విద్యార్థులేమో దుకాణాల్లో లభించే అట్టపెట్టెలను కొనుగోలు చేసి అందులో సామగ్రి పెడుతున్నారు. పిల్లలకు అన్నిరకాల వసతులు కల్పించాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం చెందుతున్నారు. గిరిజన విద్యార్థులకు మౌలిక సదుపాయాల కల్పనలో ఐటీడీఏ విఫలమవుతోందని గిరిజన సంఘాలు ఆరోపిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement