ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్ జారీకి ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది.
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్ జారీకి ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది. టెట్ ఫలితాలు వెల్లడించిన వెంటనే నోటిఫికేషన్ జారీ చేస్తామని టీఎస్‌పీఎస్సీ పేర్కొన్నా.. వాటికి సంబంధించిన నిబంధనల రూపకల్పన ఇంకా పూర్తి కాలేదు. దీంతో 8,792 పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ జారీలో ఆలస్యం తప్పేలా లేదు.
పైగా ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి విదేశీ పర్యటనలో ఉండటం కూడా ఇందుకు ఒక కారణంగా మారింది. ఆయన ఈ నెల 10న వచ్చాక అర్హతలు, నిబంధనలను ఖరారు చేసే అవకాశం ఉంది. మరోవైపు ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కంటే ముందుగా ఉపాధ్యాయ బదిలీలు చేయాల్సి ఉంటుంది. సీనియారిటీ కలిగిన టీచర్లకు ప్రాధాన్య పాయింట్లు ఉన్నందున వారికి ముందుగా బదిలీలు చేపట్టాకే కొత్త వారికి పోస్టింగులు ఇచ్చే వీలుంటుంది.