ఇక కాంక్రీట్ రోడ్లే! | The concrete road! | Sakshi
Sakshi News home page

ఇక కాంక్రీట్ రోడ్లే!

Apr 7 2015 12:47 AM | Updated on Aug 30 2018 4:49 PM

ఇక కాంక్రీట్ రోడ్లే! - Sakshi

ఇక కాంక్రీట్ రోడ్లే!

అభివృద్ధి చెందిన దేశాల్లో దర్జాగా కనిపించే కాంక్రీట్ రోడ్లు త్వరలో మన రాష్ట్రంలో కూడా కనిపించబోతున్నాయి.

  • కంపెనీల నుంచి తక్కువ ధరకు సిమెంట్
  •  దేశవ్యాప్తంగా ఒప్పందం కుదుర్చుకున్న కేంద్రం
  •  అందులో భాగంగానే రాష్ట్రానికీ రాయితీ సిమెంట్
  •  త్వరలో ఢిల్లీకి ఉన్నతస్థాయి బృందం
  • సాక్షి, హైదరాబాద్: అభివృద్ధి చెందిన దేశాల్లో దర్జాగా కనిపించే కాంక్రీట్ రోడ్లు త్వరలో మన రాష్ట్రంలో కూడా కనిపించబోతున్నాయి. దేశవ్యాప్తంగా కొత్తగా చేపట్టే జాతీయ రహదారులను సిమెంట్‌తో నిర్మించనున్నట్లు కేంద్రం పేర్కొన్న నేపథ్యంలో రాష్ట్ర రహదారుల విషయంలోనూ అదే మార్గాన్ని అనుసరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఇప్పటి వరకు కొన్ని చోట్లే కనిపించిన కాంక్రీట్ రోడ్లు ఇకపై విస్తృతం కానున్నాయి. తారు రోడ్లతో పోల్చితే సిమెంటు రోడ్ల నిర్మాణానికి 15 నుంచి 20 శాతం వరకు అధిక వ్యయమవుతుంది. కానీ నేరుగా సిమెంటు కంపెనీల నుంచే తక్కువ ధరకు సిమెంటును పొందేలా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వ కార్యక్రమాలకు రాయితీ రేట్లకు సిమెంట్‌ను అందించేలా ఆయా కంపెనీలతో కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారుల శాఖ ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకుంది.
     
    రాష్ట్ర రహదారుల నిర్మాణానికి ముందుకొచ్చే రాష్ట్రాలకు కూడా అదే ధరకు సిమెంట్‌ను అందజేస్తామని ఆ శాఖ మంత్రి నితిన్ గడ్కారీ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి స్పందించిన రాష్ర్ట ప్రభుత్వం.. తెలంగాణలో కొత్తగా భారీ స్థాయిలో నిర్మించనున్న రోడ్లలో ముఖ్యమైన వాటిని సిమెంట్ డిజైన్‌లోకి మార్చాలని నిర్ణయించింది. ఇటీవల రాష్ట్రానికి వచ్చిన నితిన్ గడ్కారీతో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భేటీ అయ్యారు. రాష్ర్టంలో నిర్మించనున్న కాంక్రీట్ రోడ్ల వివరాలతో నివేదికను అందజేయాలని కేంద్ర మంత్రి ఈ సందర్భంగా సూచించారు. ప్రస్తుతం రాష్ర్ట యంత్రాంగం ఆ దిశగా కసరత్తు మొదలుపెట్టింది.
     
    ఒక్కో బ్యాగుపై  రూ. 100 ఆదా
     
    రోడ్లు, వంతెనలు నిర్మించే కాంట్రాక్టర్లు, సిమెంటు కంపెనీల మధ్య అనుసంధానం కోసం ఇటీవల కేంద్రం ప్రత్యేకంగా ఓ వెబ్ పోర్టల్‌ను ప్రారంభించింది. సిమెంటు తయారీదారులతో ఇప్పటికే సమావేశం ఏర్పాటు చేసి నేరుగా రోడ్ల నిర్మాణదారులకు సిమెంట్‌ను తక్కువ ధరకు పంపిణీ చేయాలని సూచించింది. దీనికి తయారీదారులు కూడా అంగీకరించారు. అయితే ఒక్కో కంపెనీ ఒక్కో ధరను కోట్ చేయనుంది. ఇలా ఈ ఒప్పందం పరిధిలో దాదాపు 101 కంపెనీలు ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. వెరసి హీనపక్షంగా మార్కెట్ ధర కంటే ప్రతి బస్తాపై రూ.100 వరకు రాయితీ ఉంటుందని అంచనా. ఫలితంగా తారు రోడ్డు నిర్మాణానికయ్యే వ్యయం కంటే సిమెంట్ రోడ్డు నిర్మాణ వ్యయం మరీ ఎక్కువయ్యే అవకాశం లేదు.
     
    ట్రాఫిక్ ఎక్కువగా ఉండే రోడ్లపై ఖర్చు తక్కువే...
     
    రాష్ట్రంలో ట్రాఫిక్ అధికంగా ఉండే ప్రాంతాల్లో నిర్మించే రోడ్లకు తారు పొరలను ఎక్కువగా ఏర్పాటు చేస్తున్నారు. దీనికి వ్యయం అధికంగా ఉంటోం ది. కానీ కాంక్రీట్ రోడ్లకు అదనంగా పొరలు నిర్మించాల్సిన అవసరం ఉండదు. అంటే తారు పొరలు ఎక్కువగా ఏర్పాటు చేయడం వల్ల ఇంచుమించు సిమెంటు రోడ్డు వ్యయానికి సమానంగా ఖర్చవుతోంది. అలాంటి చోట్ల సిమెంటు రోడ్లు నిర్మిస్తే అదనంగా అయ్యే వ్యయం పెద్దగా ఉండదు. దీంతో అలాంటి రోడ్లను అధికారులు గుర్తించే పనిలో పడ్డారు. రాష్ర్టవ్యాప్తంగా ఈ ఆర్థిక సంవత్సరం దాదాపు రూ. 6 వేల కోట్లతో రోడ్లు, వంతెనలను నిర్మించబోతున్నారు. వీటికి వీలైనంత మేర రాయితీ ధరలకు సిమెంటును నేరుగా కంపెనీల నుంచి పొందాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను కేంద్రం నుంచి తెలుసుకునేందుకు త్వరలో ఓ ఉన్నత స్థాయిబృందాన్ని ఢిల్లీకి పంపుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement