శభాష్‌... రమేష్‌

Ten Lakhs Cash Bag Returned Auto Driver in Hyderabad - Sakshi

ఆటోలో రూ.10 లక్షలు  మర్చిపోయిన ప్యాసింజర్‌

తిరిగి అప్పగించిన డ్రైవర్‌

ఆటోలో మర్చిపోయిన రూ.10 లక్షల నగదు బ్యాగును సంబంధిత వ్యక్తులకు అప్పగించి రమేష్‌ అనే ఆటోడ్రైవర్‌ తన నిజాయతీని చాటుకున్నాడు. పలువురి ప్రశంసలు అందుకున్నాడు. బుధవారం గచ్చిబౌలి పరిధిలోని శ్రీరాంనగర్‌ కాలనీలో ఈ సంఘటన చోటు చేసుకుంది.  

గచ్చిబౌలి: ఆటోలో మరిచిపోయిన పది లక్షల నగదు ఉన్న బ్యాగ్‌ను సంబంధిత వ్యక్తులకు అప్పగించి ఓ ఆటో డ్రైవర్‌ తన నిజాయితీని చాటుకున్నాడు. ఈ ఘటన బుధవారం గచ్చిబౌలి పీఎస్‌ పరిధిలో చోటు చేసుకుంది. గచ్చిబౌలి సీఐ ఆర్‌ శ్రీనివాస్‌ తెలిపిన మేరకు.. సిద్ధిపేటకు చెందిన సోదరులు కొత్తూరు కృష్ణ, ప్రసాద్‌లు కొండాపూర్‌ శ్రీరాంనగర్‌ కాలనీలో భవనం నిర్మిస్తున్నారు. నిర్మాణ ఖర్చులు నిమిత్తం రూ. 10 లక్షల నగదు తీసుకొని ఇద్దరు సిద్దిపేట నుంచి బుధవారం ఉదయం బయలుదేరారు. జూబ్లీ బస్‌ స్టేషన్‌లో దిగి ఆటోలో శ్రీరాంనగర్‌ కాలనీలోని సైట్‌కు మధ్యాహ్నం 1 గంటలకు చేరుకున్నారు. రూ. పది లక్షల నగదు కల్గిన బ్యాగ్‌ను ఆటోలో మరిచిపోయారు. ఆటో డ్రైవర్‌ జర్పుల రమేష్‌ వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయారు.

కొద్ది నిమిషాల తరువాత క్యాష్‌ ఉన్న బ్యాగ్‌ను ఆటోలో మరిచిపోయామని తెలుసుకున్న సోదరులు వెంటనే 100కు ఫోన్‌ చేసి ఆటోలో డబ్బు మరిచిపోయామని చెప్పారు. అప్రమత్తమైన గచ్చిబౌలి పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించి సమీపంలోని ఆటోలను తనిఖీ చేస్తున్నారు. అప్పటికే కొద్ది దూరం వెళ్లిన ఆటో డ్రైవర్‌ రమేష్‌ ఆటోలో మరిచిపోయిన బ్యాగ్‌ను గమనించి తెరచి చూశాడు. అందులో నగదు ఉండటంతో వెంటనే ప్యాసింజర్లను దింపిన సైట్‌ వద్దకు తిరిగి వచ్చాడు. బాధితులతో పాటు పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. మాదాపూర్‌ డీసీపీ వెంకటేశ్వర్‌ సమక్షంలో క్యాష్‌ బ్యాగ్‌ను బాధితులకు అప్పగించారు. నిజాయితీ కల్గిన ఆటో డ్రైవర్‌ను డీసీపీ అభినందించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top