తాత్కాలిక సచివాలయం@బీఆర్కే భవన్‌

Temporary Secretariat building AT BRK Bhavan - Sakshi

మెజారిటీ శాఖల కార్యాలయాలన్నీ అక్కడికే 

సాంకేతిక, భద్రత కారణాల రీత్యా బీఆర్కే భవన్‌కు మొగ్గు 

7, 8వ అంతస్తులో సీఎంఓ, సీఎస్, జీఏడీ కార్యాలయాలు 

ఇప్పటికే ఆ భవన్‌లోని ప్రస్తుత శాఖల ఖాళీకి ఆదేశం! 

మిగిలిన కార్యాలయాలు గగన్‌విహార్, చంద్రవిహార్‌కు..

అరణ్య భవన్‌కు అటవీ శాఖ..

ఎర్రమంజిల్‌కు ఆర్‌ అండ్‌ బీ, నీటిపారుదల శాఖలు 

ఫైళ్లు, సామగ్రి సర్దిపెట్టుకోవాలని శాఖలకు ఆదేశాలు 

ఏ క్షణంలోనైనా సచివాలయం తరలింపు షురూ 

సాక్షి, హైదరాబాద్‌ : బూర్గుల రామకృష్ణారావు (బీఆర్కే) భవన్‌ తెలంగాణ రాష్ట్ర తాత్కాలిక సచివాలయంగా మారనుంది. సచివాలయంలోని ప్రధాన కార్యాలయాలతో సహా ఎక్కువ శాతం శాఖల కార్యాలయాలు బీఆర్కే భవన్‌కు తరలివెళ్లనున్నాయి. ముఖ్యమంత్రి కార్యాలయం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయం, సాధారణ పరిపాలన శాఖ కార్యాలయాలకు బీఆర్కే భవన్‌ కేరాఫ్‌ అడ్రస్‌గా మారనుంది. పరిపాలన సౌలభ్యం, సాంకేతిక, భద్రత కారణాలరీత్యా సచివాలయంలోని శాఖలన్నీ ఒకే గొడుగు కింద ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. సచివాలయంలోని ఇంటర్నెట్, ఇంట్రానెట్‌ నెట్‌వర్క్‌ కనెక్టివిటీని దగ్గర్లో ఉన్న భవనాలకు అనుసంధానం చేయడం తేలిక కానుంది. ఈ క్రమంలో ప్రస్తుత సచివాలయానికి కూతవేటు దూరంలో ఉన్న బీఆర్కే భవన్‌లో తాత్కాలిక సచివాలయం ఏర్పాటు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. బీఆర్కే భవన్‌లో ప్రస్తుతం ఉన్న వివిధ శాఖల హెచ్‌ఓడీ కార్యాలయాలను ఇతర చోట్లకు తరలించి మొత్తం భవనాన్ని సచివాలయ శాఖల కోసం వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఇక్కడున్న హెచ్‌ఓడీ కార్యాలయాల తరలింపునకు సూచనలు జారీ చేసినట్లు సమాచారం.

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి అధికారుల బృందంతో కలిసి సోమవారం.. బీఆర్కే భవన్‌ను సందర్శించి అక్కడున్న సదుపాయాలను పరిశీలించి చూశారు. ఈ భవనంలోని 8, 9వ అంతస్తుల్లో ముఖ్యమంత్రి చాంబర్, సీఎంఓ అధికారులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయాలు, సాధారణ పరిపాలన శాఖ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. కొత్త సచివాలయ భవన సముదాయం నిర్మించే వరకు రాష్ట్ర పరిపాలన వ్యవహారాలు ఇక్కడే నుంచే జరగనున్నాయి. సచివాలయంలోని శాఖలన్నింటికీ అవసరమైన స్థలం బీఆర్కే భవన్‌లో లేదు. ఈ నేపథ్యంలో కొన్ని సచివాలయ శాఖల కార్యాలయాలను దగ్గరలోని ఆదర్శ్‌నగర్‌ ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు తరలించనున్నారు. ఏపీ ప్రభుత్వం ఇటీవల దాదాపు 50 ఎమ్మెల్యే క్వార్టర్స్‌ భవనాలను తెలంగాణకు అప్పగించింది. వీటిలో కొన్ని శాఖల కార్యాలయాలు ఏర్పాటు చేసే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. సచివాలయ కార్యాలయాల అవసరాలకు తగ్గట్లు బీఆర్కే భవన్‌లో పార్కింగ్‌ సదుపాయం లేదు. దగ్గరలో ఉన్న ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని ఖాళీ స్థలాన్ని తాత్కాలిక సచివాలయం పార్కింగ్‌ అవసరాల కోసం వినియోగించనున్నారు. అటవీశాఖ కార్యాలయాన్ని సమీపంలోని అరణ్య భవన్‌కు, రోడ్లు, భవనాల శాఖ, నీటిపారుదల శాఖ కార్యాలయాలను మాత్రంఎర్రంమంజిల్‌లోని సంబంధిత ఇంజనీర్‌–ఇన్‌–చీఫ్‌ కార్యాలయాలకు తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 
 
యుద్ధప్రాతిపదికన తరలింపు 
ప్రస్తుత సచివాలయం ఉన్న స్థలంలోనే కొత్త సచివాలయ భవన సముదాయాన్ని నిర్మిస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకోసం ప్రస్తుత సచివాలయంలోని భవనాలన్నింటినీ కూల్చివేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో సచివాలయ భవనాల కూల్చివేతకు అనువుగా ఇక్కడి ప్రభుత్వ శాఖల కార్యాలయాలను యుద్దప్రాతిపదికన తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఫైళ్లు, ఇతర సామగ్రిని సర్దుకుని కార్యాలయాల తరలింపునకు సిద్ధంగా ఉండాలని సచివాలయంలోని కొన్ని శాఖలకు సోమవారం మౌఖిక ఆదేశాలందాయి. దీంతో సచివాలయంలోని పలు శాఖల కార్యాలయాల్లో సోమవారం నుంచే ప్యాకింగ్‌ పనులు ప్రారంభమయ్యాయి. 
 
పరిశీలనలో మరో రెండు భవనాలు 
సచివాలయ శాఖల తరలింపు కోసం దగ్గరలోని గగన్‌విహార్, చంద్రవిహార్‌ భవనాల పరిశీలన సైతం జరుగుతోంది. బీఆర్కే భవన్‌లో చోటు లభించని ప్రభుత్వ శాఖల కార్యాలయాలను ఈ రెండు భవనాలకు తరలించే అవకాశాన్ని పరిశీలిస్తోంది. భద్రత, సాంకేతిక కారణాల రీత్యా ఈ భవనాలు అనువుగా ఉన్నాయని అధికారులంటున్నారు. అయితే వీటి విషయంలో ఇంకా ఎలాంటి అధికారిక నిర్ణయం తీసుకోలేదని అధికారవర్గాలు తెలిపాయి. 
 
ఐటీ కీలకం! 
సచివాలయ శాఖల తరలింపులో సాంకేతిక అంశాలు కీలకంగా మారాయి. ప్రధానంగా సచివాలయ కార్యాలయాల మధ్య అంతర్గత సమాచార పంపిణీ నెట్‌వర్క్‌(ఇంట్రానెట్‌)ను కొత్త సచివాలయ శాఖల కార్యాలయాల భవనాలకు అనుసంధానం చేయాల్సి ఉండనుంది. గచ్చిబౌలిలోని స్టేట్‌ డేటా సెంటర్‌ నుంచి ఫైబర్‌ ఆప్టిక్‌ కేబుల్స్‌ ద్వారా సచివాలయం ఇంట్రానెట్‌ అనుసంధానమై ఉంది. ప్రభుత్వ సమాచారాన్ని అత్యంత పకడ్బందీగా ఈ నెట్‌వర్క్‌ కాపాడుతోంది. ఈ ఫైబర్‌ ఆప్టిక్‌ నెట్‌వర్క్‌ను దగ్గరలోని బీఆర్కే భవన్‌తో అనుసంధానం చేయడం సులువు కానుంది. అదే విధంగా సచివాలయంలోని డీ–బ్లాక్‌లో తక్కువ సామర్థ్యంతో మరో డేటా సెంటర్‌ ఉంది. దీన్నిసైతం బీఆర్కే భవన్‌కు తరలించడం సులువు కానుంది. ఇంట్రానెట్‌ నెట్‌వర్క్‌ను సచివాలయానికి దూరంలోని ఇతర భవనాలకు తరలించాల్సి వస్తే సమయంతో పాటు ఖర్చు సైతం భారీగా పెరిగిపోనుంది. సురక్షితమైన ఇంట్రానెట్‌ లేకుండా సచివాలయ శాఖల కార్యాలయాలను నిర్వహిస్తే సైబర్‌ దాడులు జరిపి ప్రభుత్వ రహస్య సమాచారం చేతులు మారే ప్రమాదం ఉంటుంది. ఇంట్రానెట్‌నెట్‌వర్క్‌ ఆధారంగానే ప్రభుత్వ జీవోల వెబ్‌సైట్, మీ–సేవా వెబ్‌సైట్, ఈ–ప్రోక్యూర్‌మెంట్, ధరణి, మా భూమి, ఆరోగ్య శ్రీ, ఈ–ఆఫీస్‌ వంటి కీలక వెబ్‌ అప్లికేషన్ల నిర్వహణ జరుగుతోంది. 
 
ఈఎన్సీలతో సాంకేతిక కమిటీ 
కొత్త సచివాలయం, అసెంబ్లీ భవన సముదాయాల నిర్మాణంపై అధ్యయనం కోసం రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి నేతృత్వంలో ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం సోమవారం ఇక్కడ సమావేశమై చర్చించింది. సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్, అబ్కారీ శాఖ మంత్రి వి. శ్రీనివాస్‌ గౌడ్‌ ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రస్తుత సచివాలయం, అసెంబ్లీ భవనాల్లో ఉన్న సదుపాయాలపై అధ్యయనం కోసం ఇంజనీర్‌–ఇన్‌–చీఫ్‌లతో సాంకేతిక కమిటీని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. రోడ్లు, భవనాల శాఖ ఇంజనీర్‌–ఇన్‌–చీఫ్‌ (భవనాలు) ఐ.గణపతిరెడ్డిని మెంబర్‌ కన్వినర్‌గా, ఆర్‌అండ్‌బీ ఈఎన్‌సీ (రోడ్లు) పి.రవీందర్‌ రావు, నీటిపారుదల, పంచాయతీరాజ్‌శాఖల ఈఎన్‌సీలు సి.మురళీధర్, ఎం.సత్యనారాయణలను సభ్యులుగా నియమించింది. ప్రస్తుత సచివాలయం, అసెంబ్లీ భవనాలకు మెరుగులుదిద్దడం, ఆధునికీకరించడం, అదనపు నిర్మాణాలు జరపడం లేకుంటే కొత్త సచివాలయం, అసెంబ్లీ భవనాల నిర్మాణానికి ఈ కమిటీ సిఫారసులు చేయనుంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top