రేపటి నుంచి టెన్త్‌ పరీక్షలు

Telangana Tenth Class Exams Start Tomorrow - Sakshi

హాజరు కానున్న 5.52 లక్షల మంది విద్యార్థులు

5 నిమిషాలే గ్రేస్‌ పీరియడ్‌

ఆ తరువాత నిమిషం ఆలస్యమైనా అనుమతి నిరాకరణ

పాఠశాల విద్య డైరెక్టర్‌ విజయ్‌కుమార్‌ వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో శనివారం నుంచి వచ్చే నెల 3 వరకు జరగనున్న పదో తరగతి పరీక్షలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 11,023 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన 5,52,302 మంది ఈ పరీక్షలు రాయనున్నారు. వారిలో 5,07,810 మంది రెగ్యులర్‌ విద్యార్థులు ఉండగా 44,492 మంది ప్రైవేటు విద్యార్థులు ఉన్నారు. రెగ్యులర్‌ విద్యార్థుల్లో 2,55,318 మంది బాలురు, 2,52,492 మంది  బాలికలు ఉన్నారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 2,563 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.

5 నిమిషాల గ్రేస్‌ పీరియడ్‌ తర్వాత నో ఎంట్రీ...
పరీక్షలు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:15 గంటలకు వరకు జరుగుతాయి. విద్యార్థులను పరీక్ష సమయం ప్రారంభం (ఉదయం 9:30 గంటలకు) కంటే 45 నిమిషాల ముందు నుంచే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించనున్నారు. పరీక్ష సమయం మొదలైన 5 నిమిషాల వరకే (ఉదయం 9:35 గంటల వరకు) పరీక్ష హాల్లోకి అనుమతించనున్నారు. ఆ తరువాత వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరు. కాంపొజిట్‌ కోర్సు పేపర్‌–1, పేపర్‌–2, ద్వితీయ భాష, ఓఎస్సెస్సీ మెయిన్‌ లాంగ్వేజ్‌ పేపర్‌–1, పేపర్‌–2 పరీక్షలు మాత్రం ఉదయం 9:30 గంటల నుంచి మధాహ్నం 12:45 గంటల వరకు కొనసాగుతాయి. ఎస్సెస్సీ కాంపొజిట్‌ పేపర్‌–2 పరీక్ష ఉదయం 9:30 గంటల నుంచి 10:45 గంటల వరకు, వొకేషనల్‌ థియరీ పరీక్ష ఉదయం 9:30 గంటల నుంచి 11:30 గంటల వరకు ఉంటుంది.

హాల్‌టికెట్లు అందకుంటే డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు...
పరీక్షల ఏర్పాట్లపై గురువారం పాఠశాల విద్య డైరెక్టరేట్‌లో ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ సుధాకర్‌తో కలసి పాఠశాల విద్య డైరెక్టర్‌ విజయ్‌కుమార్‌ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. విద్యార్థులకు ఇప్పటికే హాల్‌టికెట్లు పంపించామని, అందని వారు లేదా పొగొట్టుకున్న వారు తమ వెబ్‌సైట్‌ (https://www. bsetelangana.org/) నుంచి డౌన్‌లోడ్‌ చేసుకొని పరీక్షలకు హాజరుకావచ్చని వెల్లడించారు. పరీక్షలకు సంబంధించి ఏమైనా ఇబ్బందులు తలెత్తితే 24 గంటలు పని చేసేలా ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూంకు (040–23230942) ఫోన్‌ చేసి తెలియజేయాలని సూచించారు.

పెరిగిన కేంద్రాలు.. తగ్గిన స్కూళ్లు
గతేడాది కంటే ఈసారి 21 పరీక్ష కేంద్రాలు పెరిగాయి. గతేడాది 2,542 కేంద్రాలు ఏర్పాటు చేశారు. అయితే పాఠశాలలు మాత్రం 80 తగ్గిపోయాయి. గతేడాది 11,103 స్కూళ్లు మాత్రమే ఉన్నాయి. ఇక విద్యార్థుల సంఖ్య కూడా ఈసారి తగ్గింది. గతేడాది 5,34,726 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. కాగా, పరీక్షలకు హాజరయ్యే రెగ్యులర్‌ విద్యార్థుల్లో 64.57 శాతం మంది ఇంగ్లిషు మీడియం విద్యార్థులే ఉన్నారు.
 

116 కేంద్రాల్లో సీసీ కెమెరాలు...

  • ఈసారి మొత్తంగా రెగ్యులర్‌ విద్యార్థులకు 2,374, ప్రైవేటు విద్యార్థులకు 189 కేంద్రాలను ఏర్పాటు చేశారు.
  • ఈసారి 116 కేంద్రాల్లో సీసీ కెమెరాలను అమర్చారు.
  • ఆకస్మిక తనిఖీల కోసం 4 స్పెషల్‌ ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌లు, 144 ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌లను పంపనున్నారు.
  • పరీక్ష కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్‌ అమల్లో ఉంటుంది. జిరాక్స్‌ కేంద్రాలను మూసి వేయాలి. పరీక్ష సమయంలో ఏమైనా సమస్యలు ఉంటే స్థానిక ఎంఈవో, డీఈవోల ఫోన్‌ నంబర్లు పరీక్ష కేంద్రంలో ఉంటాయి. వాటికి ఫోన్‌ చేసి తెలియజేయాలి. లేదంటే హైదరాబాద్‌ కంట్రోల్‌ రూంకు ఫోన్‌ చేసి చెప్పవచ్చు.
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top