breaking news
tenth exam centers
-
రేపటి నుంచి టెన్త్ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో శనివారం నుంచి వచ్చే నెల 3 వరకు జరగనున్న పదో తరగతి పరీక్షలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 11,023 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన 5,52,302 మంది ఈ పరీక్షలు రాయనున్నారు. వారిలో 5,07,810 మంది రెగ్యులర్ విద్యార్థులు ఉండగా 44,492 మంది ప్రైవేటు విద్యార్థులు ఉన్నారు. రెగ్యులర్ విద్యార్థుల్లో 2,55,318 మంది బాలురు, 2,52,492 మంది బాలికలు ఉన్నారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 2,563 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. 5 నిమిషాల గ్రేస్ పీరియడ్ తర్వాత నో ఎంట్రీ... పరీక్షలు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:15 గంటలకు వరకు జరుగుతాయి. విద్యార్థులను పరీక్ష సమయం ప్రారంభం (ఉదయం 9:30 గంటలకు) కంటే 45 నిమిషాల ముందు నుంచే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించనున్నారు. పరీక్ష సమయం మొదలైన 5 నిమిషాల వరకే (ఉదయం 9:35 గంటల వరకు) పరీక్ష హాల్లోకి అనుమతించనున్నారు. ఆ తరువాత వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరు. కాంపొజిట్ కోర్సు పేపర్–1, పేపర్–2, ద్వితీయ భాష, ఓఎస్సెస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్–1, పేపర్–2 పరీక్షలు మాత్రం ఉదయం 9:30 గంటల నుంచి మధాహ్నం 12:45 గంటల వరకు కొనసాగుతాయి. ఎస్సెస్సీ కాంపొజిట్ పేపర్–2 పరీక్ష ఉదయం 9:30 గంటల నుంచి 10:45 గంటల వరకు, వొకేషనల్ థియరీ పరీక్ష ఉదయం 9:30 గంటల నుంచి 11:30 గంటల వరకు ఉంటుంది. హాల్‌టికెట్లు అందకుంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు... పరీక్షల ఏర్పాట్లపై గురువారం పాఠశాల విద్య డైరెక్టరేట్‌లో ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ సుధాకర్‌తో కలసి పాఠశాల విద్య డైరెక్టర్ విజయ్‌కుమార్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. విద్యార్థులకు ఇప్పటికే హాల్‌టికెట్లు పంపించామని, అందని వారు లేదా పొగొట్టుకున్న వారు తమ వెబ్సైట్ (https://www. bsetelangana.org/) నుంచి డౌన్లోడ్ చేసుకొని పరీక్షలకు హాజరుకావచ్చని వెల్లడించారు. పరీక్షలకు సంబంధించి ఏమైనా ఇబ్బందులు తలెత్తితే 24 గంటలు పని చేసేలా ఏర్పాటు చేసిన కంట్రోల్ రూంకు (040–23230942) ఫోన్ చేసి తెలియజేయాలని సూచించారు. పెరిగిన కేంద్రాలు.. తగ్గిన స్కూళ్లు గతేడాది కంటే ఈసారి 21 పరీక్ష కేంద్రాలు పెరిగాయి. గతేడాది 2,542 కేంద్రాలు ఏర్పాటు చేశారు. అయితే పాఠశాలలు మాత్రం 80 తగ్గిపోయాయి. గతేడాది 11,103 స్కూళ్లు మాత్రమే ఉన్నాయి. ఇక విద్యార్థుల సంఖ్య కూడా ఈసారి తగ్గింది. గతేడాది 5,34,726 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. కాగా, పరీక్షలకు హాజరయ్యే రెగ్యులర్ విద్యార్థుల్లో 64.57 శాతం మంది ఇంగ్లిషు మీడియం విద్యార్థులే ఉన్నారు. 116 కేంద్రాల్లో సీసీ కెమెరాలు... ఈసారి మొత్తంగా రెగ్యులర్ విద్యార్థులకు 2,374, ప్రైవేటు విద్యార్థులకు 189 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈసారి 116 కేంద్రాల్లో సీసీ కెమెరాలను అమర్చారు. ఆకస్మిక తనిఖీల కోసం 4 స్పెషల్ ఫ్లైయింగ్ స్క్వాడ్లు, 144 ఫ్లైయింగ్ స్క్వాడ్లను పంపనున్నారు. పరీక్ష కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. జిరాక్స్ కేంద్రాలను మూసి వేయాలి. పరీక్ష సమయంలో ఏమైనా సమస్యలు ఉంటే స్థానిక ఎంఈవో, డీఈవోల ఫోన్ నంబర్లు పరీక్ష కేంద్రంలో ఉంటాయి. వాటికి ఫోన్ చేసి తెలియజేయాలి. లేదంటే హైదరాబాద్ కంట్రోల్ రూంకు ఫోన్ చేసి చెప్పవచ్చు. -
నిఘా కళ్లు కప్పేశారు !
కాశినాయనణ: పదవ తరగతి పబ్లిక్ పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయకుండా కార్పొరేట్, ప్రైవేటు విద్యాసంస్థలు చేసిన ప్రయత్నాలు ఫలించినట్లైంది. శుక్రవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పదవ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. పదవ తరగతి పరీక్షల్లో అత్యధిక ఉత్తీర్ణత శాతం పెంచేందుకు అడ్డదారులు తొక్కే కొన్ని కార్పొరేట్, ప్రైవేటు స్కూల్ల యాజమాన్యాలు చేస్తున్న మాస్‌కాపీయింగ్ విధానాన్ని అడ్డుకునేందుకు అన్ని పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే పరీక్ష కేంద్రాల్లో సీసీకెమెరాలను ఏర్పాటు చేయలేదు. జిల్లాలో 164 పరీక్షా కేంద్రాల్లో 35,992 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. అయితే 5 కేంద్రాల్లో మాత్రమే సీసీకెమెరాలను ఏర్పాటు చేసినట్లు విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. ఫలించిన ప్రైవేటు స్కూల్ యాజమాన్యాల హవా? : కొన్నేళ్లుగా జిల్లాలో పదవ తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాల్లో ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల విద్యార్థులదే హవా. దీనికి ఆయా స్కూళ్లలో విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం ఒక ఎత్తు అయితే పరీక్ష కేంద్రాల్లో ఇన్విజిలేటర్లు, నిర్వాహకులను మేనేజ్ చేయడం మరొక ఎత్తు. పరీక్షల్లో విద్యార్థులు అడ్డదారులు తొక్కేందుకు పరీక్ష కేంద్రాల వద్ద సిబ్బందిని, కొంత మంది అధికారులను లోబరుచుకోవడానికి పెద్ద మొత్తంలో విద్యార్థుల నుంచి సొమ్ములు వసూలు చేసిన ఘటనలు అనేకం. మాస్‌కాపీయింగ్ వల్లే కొన్ని పాఠశాలల్లో ఎక్కువ ఉత్తీర్ణత సాధిస్తున్నారని అనేక పర్యాయాలు జిల్లా విద్యాశాఖాధికారులకు ఫిర్యాదులు కూడా వెళ్లాయి. అయితే కొంత మంది అవినీతి అధికారులను మేనేజ్ చేసి తమ విధానాలను కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ సంవత్సరం అన్ని పరీక్ష కేంద్రాల్లో సీసీకెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. అయితే ఏ పరీక్ష కేంద్రంలో కూడా సీసీకెమెరాలను ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు. మొత్తం మీద ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్ల యాజమాన్యాల ప్రయత్నం ఫలించిందని చెప్పవచ్చు.