
ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలకు నోటీసులు
పార్టీ ఫిరాయింపులకు పాల్పడారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులకు స్పీకర్ ఎస్.మధుసూదనాచారి సోమవారం నోటీసులు జారీ చేశారు.
పార్టీ ఫిరాయించినందుకు తలసాని, తీగల, చల్లాకు నోటీసులు
జారీ చేసిన తెలంగాణ అసెంబ్లీ స్పీకర్
ఇప్పటివరకు ఏడుగురికి...
సాక్షి, హైదరాబాద్: పార్టీ ఫిరాయింపులకు పాల్పడారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులకు స్పీకర్ ఎస్.మధుసూదనాచారి సోమవారం నోటీసులు జారీ చేశారు. దీం తో ఇప్పటిదాకా ఫిరాయింపుల కేసులో నోటీసులు అందుకున్న శాసనసభ్యుల సంఖ్య ఏడుకు పెరిగింది. తాజా నోటీసులు అందుకున్న వారిలో తలసాని శ్రీనివాస్‌యాదవ్ (సనత్‌నగర్), తీగల కృష్ణారెడ్డి (మహేశ్వరం), చల్లా ధర్మారెడ్డి (పరకాల) ఉన్నారు. శాసనసభ బడ్జెట్ సమావేశాల కంటే ముందే వీరు తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు.
బడ్జెట్ సమావేశాల్లో చివరి అంకమైన ద్రవ్యవినిమయ బిల్లు ఆమోదం సమయంలో సభ్యులంతా శాసనసభకు హాజరు కావాలంటూ టీడీపీ విప్ జారీ చేసింది. బిల్లుపై చర్చ అనంతరం ఆ పార్టీ శాసనసభ నుంచి వాకౌట్ చేసింది. వాకౌట్ చేసిన సమయంలో ఈ ముగ్గురు శాసనసభ్యులు తమతో పాటు బయటకు రాకుండా సభలోనే ఉన్నారని, విప్ ధిక్కరించినందుకు వారిపై అనర్హత వేటు వేయాలని తెలుగుదేశం పార్టీ స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది. టీఆర్‌ఎస్‌లో చేరిన సమయంలో కేసీఆర్‌తో వారు దిగిన ఫొటోలను, పత్రికా క్లిప్పింగ్‌లను కూడా ఫిర్యాదులతో జత చేశారు. కాగా, కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్‌కు వలస వెళ్లిన రెడ్యానాయక్ (డోర్నకల్), విఠల్‌రెడ్డి (ముధోల్), కె.కనకయ్య (ఇల్లెందు) ఇప్పటికే నోటీసులు అందుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మదన్‌లాల్ (వైరా)కు కూడా స్పీకర్ నోటీసులు జారీ చేశారు.
వ్యూహాత్మకంగా వలసలకు స్టాప్
వెంట వెంటనే ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకుంటే పార్టీలో తలెత్తే అసంతృప్తి, బయటనుంచి వచ్చే విమర్శలను దృష్టిలో ఉంచుకుని తాత్కాలికంగా వలసలను నిలుపు చేసినట్లు టీఆర్‌ఎస్ వర్గాలు చెపుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాలకు చెందిన ఇద్దరు తెలుగుదేశం శాసనసభ్యులు టీఆర్‌ఎస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని, వీరు కాకుండా నల్లగొండ జిల్లాకు చెందిన ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా తమ పార్టీలో చేరడానికి సుముఖంగా ఉన్నారని ఆ వర్గాలు తెలిపాయి. అయితే, వచ్చే ఏడాది ఆరంభం దాకా వీరిని పార్టీలో చేర్చుకోకుండా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు టీఆర్‌ఎస్ సీనియర్ నేత ఒకరు చెప్పారు.