ప్రపంచానికే తెలంగాణ ఆదర్శం

Telangana Is A Role Model To World Says Pocharam Srinivas Reddy - Sakshi

‘ఇస్టా’ సదస్సులో  స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి

త్వరలోనే ప్రపంచంలో అగ్రగామిగా నిలుస్తామని ఆశాభావం

కేసీఆర్‌ చేపట్టిన వినూత్న పథకాల వల్లే సాధ్యమైంది: నిరంజన్‌ రెడ్డి

విత్తన రైతులకు గుర్తింపు కార్డులు ఇస్తాం: పార్థసారథి

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ వ్యవసాయ విధానాలు ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని రాష్ట్ర శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి కొనియాడారు. ప్రపంచంలోని 20 అత్యుత్తమ పథకాలలో రైతుబంధు, రైతుబీమాలను కూడా ఐక్యరాజ్యసమితి గుర్తించిందని ఆయన పేర్కొన్నారు. రైతుల పట్ల కేసీఆర్‌ నిబద్ధత, చిత్తశుద్ధి మూలంగా ఇలాంటి పథకాలు సాధ్యమయ్యాయని ఆయన అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ విత్తన పరీక్షల సంఘం (ఇస్టా) సదస్సులో భాగంగా రెండో రోజు గురువారం హైటెక్స్‌లో జరిగిన విత్తన రైతుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. రైతుబంధు, రైతుబీమా పథకాలు మాత్రమే కాకుండా కల్యాణలక్ష్మి, మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ వంటి ప్రతి పథకమూ ఇతర రాష్ట్రాలకు, దేశాలకు ఆదర్శనీయమన్నారు.

రైతు చనిపోయిన వారం రోజులలో రూ.5 లక్షలు సాయం ఆ బాధిత కుటుంబానికి చేరడం మామూలు విషయం కాదన్నారు. తెలంగాణ విత్తనరంగం గత ఐదేళ్లలో దేశంలో అగ్రస్థానంలో నిలిచిందని, దీనికి కేసీఆర్‌ మార్గదర్శనమే కారణమని ఆయనన్నారు. ఇస్టా సదస్సు మూలంగా భవిష్యత్‌లో ప్రపంచంలో ప్రముఖ స్థానానికి తెలంగాణ చేరుకుంటుందన్న నమ్మకం ఉందన్నారు. సమావేశంలో కర్ణాటక వ్యవసాయశాఖ మంత్రి శివశంకర్‌ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి, వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి పార్థసారథి, తెలంగాణ రైతు సమన్వయ సమితి అధ్యక్షులు గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఇస్టా అధ్యక్షులు క్రెగ్‌ మెక్‌ గ్రిల్, వ్యవసాయశాఖ కమిషనర్‌ రాహుల్‌ బొజ్జ, తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ డైరెక్టర్‌ కేశవులు తదితరులు పాల్గొన్నారు.  

విత్తన పంట పండాలి : నిరంజన్‌రెడ్డి  
విత్తన ఉత్పత్తికి తెలంగాణలో శ్రేష్టమయిన వాతావరణం ఉందని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. తెలంగాణలో విత్తనాల పంట పండాలని, ఆ విత్తనాలు ప్రపంచ పంటలకు ఆధారం కావాలన్నారు. పంట కాలనీల తరహాలో విత్తన పంట కాలనీలను ఏర్పాటు చేయగలిగితే తెలంగాణ ప్రపంచ విత్తన భాండాగారంగా ఎదగడం పెద్ద విషయం కాదన్నది ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలోచన అని అన్నారు. పెరిగిన ఆయకట్టు ప్రాంతాలలో రైతుల ఆదాయాలు కూడా పెరిగాయని, వ్యవసాయ అనుబంధ రంగాలు కలిసి పనిచేయాలన్నారు. పంటల వైవిధ్యీకరణ (డైవర్సిఫికేషన్‌)తో లాభాలు వస్తాయన్నారు. విత్తన పంటల సాగే దానికి ప్రత్యామ్నాయమని, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా పంటలు సాగుచేయాలని నిరంజన్‌రెడ్డి సూచించారు. హైదరాబాద్‌ శివారు ప్రాంతాలు ఒకప్పుడు ద్రాక్ష సాగుకు ప్రసిద్ధి అని, ప్రపంచవ్యాప్తంగా ఎగుమతులు జరిగేవన్నారు. ఇప్పుడు కాలక్రమంలో ద్రాక్ష పంటలు కనుమరుగయ్యాయన్నారు. మహారాష్ట్ర ద్రాక్ష రైతులు మేలైన సాగు విధానాలు అవలంబిస్తూ విదేశాలకు ద్రాక్ష ఎగుమతులు చేస్తున్నారన్నారు. తెలంగాణ రైతులు ద్రాక్ష సాగు తిరిగి చేపట్టి పూర్వవైభవం సాధించాలని కోరారు.  

విత్తన రైతులకు గుర్తింపుకార్డులు: పార్థసారథి
విత్తనరంగాన్ని మరింత బలోపేతం చేసే ప్రక్రియలో భాగంగా తెలంగాణ విత్తన రైతులకు త్వరలోనే గుర్తింపు కార్డులు అందజేస్తామని రాష్ట్ర వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి తెలిపారు. భవిష్యత్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టబోయే విత్తన పంట సబ్సిడీలు, ఇతర పథకాలలో గుర్తింపు కార్డులు ప్రధాన భూమిక పోషిస్తాయన్నారు. విత్తన రైతులకు సాంకేతిక శిక్షణ అందిస్తామన్నారు. నర్సరీ చట్టం ద్వారా కూరగాయ పంటలలో కల్తీకి అడ్డుకట్ట వేయగలిగామని తెలిపారు. విత్తన వ్యాపారంలో కల్తీ పెరుగుతున్న నేప థ్యంలో విత్తనం ఎక్కడ పండించారు? ఆ భౌగోళిక ప్రాంతం, ఉత్పత్తిదారుని వివరాలతో కూడిన సమగ్ర సమాచారం విత్తన ప్యాకెట్లపై ఉండేలా బార్‌ కోడింగ్‌ విధానం అమల్లోకి రాబోతుందని తెలిపారు.  

రైతుబంధును అమలు చేస్తాం: కర్ణాటక వ్యవసాయమంత్రి
తెలంగాణలో అమలుచేస్తున్న రైతుబంధు పథకాన్ని త్వరలోనే కర్ణాటక రాష్ట్రంలో అమలు చేస్తామని, తెలంగాణలో రైతులకు భరోసానిచ్చేందుకు ప్రభుత్వం అమలుచేస్తున్న వ్యవసాయ పథకాలు ఎంతో బాగున్నాయని కర్ణాటక వ్యవసాయశాఖ మంత్రి శివశంకర్‌రెడ్డి అన్నారు. అంతర్జాతీయ విత్తన సదస్సులో భాగంగా విత్తన రైతుల సమావేశానికి గౌరవ అతిథిగా హాజరైన ఆయన రైతులను ఉద్దేశించి పూర్తిగా తెలుగులో ప్రసంగించి అందరినీ ఆశ్చర్యపరిచారు. రైతులు డిమాండ్‌ను బట్టి పంటలను సాగుచేయాలని, సేంద్రియ తరహాలో పంటలను సాగుచేస్తే మార్కెట్లో ఆదరణ ఉంటుందని, ఎక్కువ ధర వస్తుందని రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షులు గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రం దేశానికి అవసరం అయిన 65 శాతం విత్తనాలు అందిస్తుందని, విత్తన పంటల సాగులో రైతు సమన్వయ సమితులు కీలకంగా పనిచేస్తాయని వెల్లడించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top