నీటి కేటాయింపుల తీరుపై తెలంగాణ అభ్యంతరం

Telangana Objection Over Water Allocations In Krishna Basin - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కృష్ణా బేసిన్‌లోని శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుల్లో లభ్యతగా ఉన్న నీటిలో తెలంగాణకు కేటాయించిన నీటి వాటాపై రాష్ట్రం అభ్యంతరం తెలిపింది. రాష్ట్రానికి దక్కే వాటాకన్నా తక్కువ నీటి కేటాయింపులు చేసిందని శనివారం కృష్ణా బోర్డుకు లేఖ రాసింది. కృష్ణా బోర్డు తెలంగాణకు 46.90 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్‌కు 33.40 టీఎంసీలు కేటాయించిందని, అయితే న్యాయంగా తెలంగాణకు 51 టీఎంసీల మేర వాటా నీరు దక్కుతుందని తేల్చిచెప్పింది. ఇక బోర్డు సాగర్‌ ఎడమ కాల్వ కింద ఆంధ్రప్రదేశ్‌ అవసరాలకు 3.43 టీఎంసీల నీరు కేటాయించిందని, నిజానికి సాగర్‌ ఎడమ కాల్వ కింద ప్రస్తుత రబీ సీజన్‌లో జోన్‌–1 వరకు మాత్రమే నీటిని అందించాలని తెలంగాణ భావిస్తోందని తెలిపింది. సరిపడేంత నీరు లేక తెలంగాణలోని జోన్‌–2 ఆయకట్టుకు నీరందించే పరిస్థితి లేదని వివరించింది. అలాంటప్పుడు జోన్‌–3లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌  ప్రాంత ఆయకట్టుకు నీరు తీసుకెళ్లడం సాధ్యం కాదని తెలిపింది. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని తదనుగుణంగా  చర్యలు తీసుకోవాలని సూచించింది.
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top