అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అనే నేను..! 

Telangana New Cabinet Ministers 2019 - Sakshi

సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్‌: తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నిర్మల్‌ శాసనసభ్యుడు అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి(ఐకే రెడ్డి) మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో జరిగిన మంత్రివర్గ విస్తరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమక్షంలో గవర్నర్‌ నరసింహన్‌ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. మంత్రిగా ఐకే రెడ్డి దైవసాక్షిగా ప్రమాణం చేశారు. 2014లో తెలంగాణ తొలి ప్రభుత్వంలో న్యాయ, దేవాదాయ, గృహ నిర్మాణ శాఖలను నిర్వహించిన అల్లోల రెండోసారి మంత్రిగా సంతకం చేశారు. కాగా, రాజ్‌భవన్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన మాజీ మంత్రి జోగు రామన్నతోపాటు ఇతర ఎమ్మెల్యేలు హాజరై మంత్రిగా ప్రమాణం చేసిన ఐకే రెడ్డికి అభినందనలు తెలిపారు.
 
ఉమ్మడి జిల్లా నుంచి ఒక్కరే!

పరిమిత సంఖ్యలో 10 మందితో జరిగిన  మంత్రివర్గ విస్తరణలో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా నుంచి సీనియర్‌ రాజకీయ వేత్త, విద్యావంతుడైన అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డికి మాత్రమే అవకాశం దక్కింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అత్యంత విశ్వాసపాత్రుడుగా వ్యవహరించిన ఐకే రెడ్డి గత ఎన్నికల్లో నియోజకవర్గంలో నెలకొన్న ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఘన విజయం సాధించారు. ఆయనకు మంత్రి పదవి ఖాయమని ప్రచారం జరిగినా, సోమవారం వరకు ఉత్కంఠత కొనసాగింది.

చివరికి అనుభవానికి, విధేయతకు ముఖ్యమంత్రి ప్రాధాన్యత ఇచ్చి ఉమ్మడి జిల్లా నుంచి మంత్రిగా మరోసారి అవకాశం కల్పించారు. జిల్లా నుంచి గత ప్రభుత్వంలో బీసీ సంక్షేమం, అటవీ శాఖలకు మంత్రిగా పనిచేసిన ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగు రామన్నకు పరిమిత మంత్రివర్గంలో స్థానం దక్కలేదు. అలాగే కొత్తగా మంత్రి పదవిని ఆశించిన ఎమ్మెల్యేలు బాల్క సుమన్‌(చెన్నూరు), రేఖానాయక్‌(ఖానాపూర్‌), కోనేరు కోనప్ప(సిర్పూరులకు కూడా నిరాశే ఎదురైంది. పార్లమెంటు ఎన్నికల అనంతరం మరో ఆరుగురిని కేబినెట్‌లోకి తీసుకునే అవకాశం ఉన్నందున, అప్పటికి తమకు చాన్స్‌ రావచ్చని ఆశావహులు భావిస్తున్నారు.

అభివృద్ధి, సంక్షేమంపై ప్రజల ఆశలు
మంత్రిగా రెండోసారి నియమితులైన అల్లోల్ల ఇంద్రకరణ్‌రెడ్డికి సమర్థవంతమైన నాయకుడిగా పేరుంది. సుధీర్ఘ రాజకీయ అనుభవం కలిగున్న ఆయన 70 ఏళ్ల వయస్సులో సైతం చురుగ్గా వ్యవహరిస్తూ నిర్ణయాలు తీసుకోవడంలో దిట్ట. ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లా నుంచి రెండోసారి మంత్రిగా బాధ్యతలు చేపడుతున్న ఆయనకు సవాళ్లు స్వాగతం పలుకనున్నాయి. టీఆర్‌ఎస్‌ తొలి ప్రభుత్వంలో ప్రారంభించిన అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పటికీ పూర్తికాలేదు. మిషన్‌ భగీరథ పనులు ఇంకా సాగుతూనే.. ఉన్నాయి. డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం పనులు నాలుగు జిల్లాల్లో పెండింగ్‌లోనే ఉన్నాయి.

సాగునీటి సమస్యలు కొలిక్కి రావడం లేదు. చిన్న, మధ్య తరహా నీటి ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో సేవలు అందించడం లేదు. ఏజెన్సీ ప్రాంతాల్లో రెవెన్యూ వివాదాలు పరిష్కారానికి నోచుకోలేదు. 1/70 చట్టం పరిధిలో ఉన్న మండలాలు, గ్రామాల్లో గిరిజనులు, గిరిజనేతరులకు భూముల పట్టాల పంపిణీపై ఇబ్బందులు ఉన్నాయి. గత ఎన్నికల ప్రచారంలో ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ విషయాలను ప్రస్తావిస్తూ, గెలిచిన నెలరోజుల్లోనే ప్రభుత్వ యంత్రాంగంతో ఆదిలాబాద్‌కు వచ్చి నాలుగు రోజులు అక్కడే ఉండి సమస్యలు పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి రాకపోయినా, మంత్రిగా ఐకే రెడ్డి ఈ అటవీ భూముల సమస్యలను పరిష్కరించాలని ప్రజలు ఆశిస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top