
నిర్మల్‌టౌన్: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు అందరికీ ఆదర్శప్రాయుడని, ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఆశయాలను కొనసాగిద్దామని రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని శాంతినగర్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన పీవీ నరసింహారావు విగ్రహాన్ని సోమవారం మంత్రి ఆవిష్కరించారు.
అంతకుముందు నిర్మల్‌కి విచ్చేసిన రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.కేశవరావుకు స్థానిక ఫారెస్ట్ గెస్ట్‌హౌస్‌లో మంత్రి పూలమొక్క అందజేసి స్వాగతం పలికారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ పీవీ హయాంలో 1991 నుంచి 1996 వరకు పార్లమెంట్ సభ్యుడిగా ఉండటం తన అదృష్టమన్నారు. తెలంగాణ బిడ్డ పీవీ ప్రధానమంత్రి అవుతున్నారనే ఉద్దేశంతో తనతోసహా ఏడుగురు టీడీపీ ఎంపీలం ఆయనకు మద్దతు తెలిపామని చెప్పారు.
పీవీ చాణక్యనీతితో దేశాన్ని బ్రహ్మాండంగా పాలించి ప్రజల మన్ననలు పొందారని గుర్తుచేశారు. కేశవరావు మాట్లాడుతూ పీవీతో తనకున్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకున్నారు. ఉపాధ్యాయులు, మేధావులు విద్యార్థులకు, పిల్లలకు చిన్నప్పటి నుంచే ప్రముఖుల జీవిత చరిత్ర తెలియజేయాలని సూచించారు.