నేడు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం

Telangana MLAs Sworn In Today - Sakshi

సాక్షి, వనపర్తి : కొందరు పాతవారు.. మరికొందరు కొత్త వారు.. ఇలా వారంతా అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగారు.. వీరిలో కొందరే విజేతలుగా నిలిచారు.. వారందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చేసింది! ఎమ్మెల్యేగా ఎన్నికైన 38వ రోజున ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా చార్మినార్‌ ఎమ్మెల్యే ముంతాజ్‌ అహ్మద్‌ఖాన్‌ బుధవారం ప్రమాణ స్వీకారం చేసిన విషయం విదితమే. ఈ మేరకు గురువారం నుంచి అసెంబ్లీ తొలి విడత సమావేశాలు జరగనుండగా మొదటి రోజు ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి 37 రోజులు గడుస్తుండగా.. ఇప్పటికే ముహూర్త బలం బాగా లేకపోవడంతో ప్రమాణ స్వీకారాన్ని వాయిదా వేస్తూ వచ్చినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా నెల గడిచాక ప్రమాణ స్వీకారం చేసే ఘడియలు వచ్చేశాయి.
 
ఉమ్మడి జిల్లాలో హవా 
ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఈసారి ఎన్నికల సందర్భంగా టీఆర్‌ఎస్‌ గాలి వీచింది. 2014 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు 13 అసెంబ్లీ స్థానాల్లో ఆరు స్థానాలు దక్కాయి. అయితే, అనంతరం జరిగిన రాజకీయ సమీకరణాల్లో భాగంగా టీడీపీ(నారాయణపేట) నుంచి గెలిచిన ఎస్‌.రాజేందర్‌రెడ్డి, కాంగ్రెస్‌(మక్తల్‌) నుంచి గెలిచిన చిట్టెం రాంమోహన్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరారు. దీంతో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల సంఖ్య ఎనిమిదికి చేరింది. కానీ తాజా ఎన్నికల్లో మాత్రం 13కు 12 స్థానాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులే ఎమ్మెల్యేలుగా ఎన్నికవడం విశేషం. ఇక కొల్లాపూర్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి, మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు ఓటమి పాలు కావడం గులాబీ శ్రేణులను నిరాశకు గురిచేసింది.

ఎమ్మెల్యే వీరే 
ఉమ్మడి పాలమూరు జిల్లాలో 13 స్థానాలకు ఎన్నికలు జరగగా 12 స్థానాల్లో టీఆర్‌ఎస్, ఒక స్థానంలో కాంగ్రెస్‌ అభ్యర్థి గెలుపొందారు. కొడంగల్‌ నుంచి పట్నం నరేందర్‌రెడ్డి, మహబూబ్‌నగర్‌ నుంచి వి.శ్రీనివాస్‌గౌడ్, జడ్చర్ల నుంచి సి.లక్ష్మారెడ్డి, కల్వకుర్తి నుంచి జైపాల్‌యాదవ్, అచ్చంపేట నుంచి గువ్వల బాలరాజు. నారాయణపేట నుంచి రాజేందర్‌రెడ్డి, మక్తల్‌ నుంచి చిట్టెం రాంమోహన్‌రెడ్డి, నాగర్‌ కర్నూల్‌ నుంచి మర్రి జనార్దన్‌రెడ్డి, దేవరకద్ర నుంచి ఆల వెంకటేశ్వర రెడ్డి, వనపర్తి నుంచి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, అలంపూర్‌ నుంచి అబ్రహం, గద్వాల నుంచి బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి గెలుపొందారు. ఇక కొల్లాపూర్‌ స్థానం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్ధి బీరం హర్షవర్దన్‌రెడ్డి గెలిచారు. వీరందరూ గురువారం అసెంబ్లీలో ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

తొలిసారి అసెంబ్లీలోకి... 
ఎన్నో ఏళ్లుగా రాజకీయాల్లో కొనసాగుతున్న పలువురిని పదవులు ఊరిస్తుంటాయి. ఇలాంటి వారిలో కొందరు ఈసారి ఎమ్మెల్యేగా గెలిచారు. వనపర్తి నుంచి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి , గద్వాల నుంచి గెలిచిన బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, కొల్లాపూర్‌ నుంచి గెలిచిన హర్షవర్దన్‌రెడ్డి ఇలా గెలుపొంది తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టనున్నారు. అలాగే, ఎమ్మెల్సీగా ఉన్న పట్నం నరేందర్‌రెడ్డి ఈసారి ఎమ్మెల్యేగా గెలిచారు. వీరేకాకుండా అలంపూర్‌ నుంచి అబ్రహం, కల్వకుర్తి నుంచి గెలిచిన జైపాల్‌యాదవ్‌ గతంలో ఎమ్మెల్యేలుగా కొనసాగారు. మధ్యలో కొంత విరామం తర్వాత మళ్లీ వీరిద్దరు ఈసారి గెలవడం విశేషం. అంటే మొత్తంగా ఉమ్మడి జిల్లా నుంచి నలుగురు తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టనున్నారు.

కాగా, ఉమ్మడి జిల్లా నుంచి గెలిచిన పలువురు ఈసారి 50 వేలకు పైగా మెజార్టీ సాధించారు. మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌ 57,775, నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి 54,354, వనపర్తి ఎమ్మెల్యే సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి 51,685 ఓట్ల మెజార్టీతో విజయబావుటా ఎగురవేశారు. ఇక రాజకీయ ఉద్దండులైన డీకే.అరుణ, చిన్నారెడ్డి, నాగం జనార్దన్‌రెడ్డి, టీపీపీసీ వర్కింగ్‌ ప్రసిడెండ్‌ రేవంత్‌రెడ్డి ఈ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. వీరందరు కూడా కాంగ్రెస్‌ నుంచే పోటీకి దిగడం గమనార్హం.

మంత్రి పదవి ఎవరికో... 
శాసనసభ గురువారం కొలువు దీరనుండగా అదే రోజు స్పీకర్‌ ఎన్నికకు నోటిఫికేషన్‌ జారీ చేయడంతో పాటు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఆ తర్వాత గవర్నర్‌ ప్రసంగం, బీఏసీ సమావేశాలు ఉండడంతో మంత్రి వర్గ విస్తరణపై స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. అయితే, మొదటి విడతలో మొత్తం కేవలం ఎనిమిది మందికే మంత్రి వర్గంలో చోటు కల్పిస్తారని తెలుస్తోంది. దీంతో ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి ఒకరికి మాత్రమే మంత్రి పదవి దక్కొచ్చని సమాచారం.

సీఎం కేసీఆర్‌ మొదటి కేబినెట్‌లో మంత్రిగా పనిచేసిన సి.లక్ష్మారెడ్డి, రాష్ట్ర ప్రణాళిళా సంఘం ఉపాధ్యక్షుడిగా గా పనిచేసిన సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డిలో ఒకరికే మంత్రివర్గంలో స్థానం దక్కే అవకాశాలు కనిసిస్తున్నాయి. వీరిద్దరు కూడా టీఆర్‌ఎస్‌ స్థాపించినప్పటి నుంచి కేసీఆర్‌ వెంట నడుస్తున్నారు. ఇక సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకుంటే బీసీ సామాజిక వర్గానికి చెందిన మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌ పేరు పరిశీలనలోకి రానుంది. దీంతో చివరి వరకు మంత్రి వర్గంలో స్థానంపై ఉత్కంఠత కొనసాగక తప్పదని తెలుస్తోంది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top