నాలుగంచెల్లో జోనల్‌!

telangana govt thinks about zonal system

మార్పుచేర్పుల దిశగా ప్రభుత్వం కసరత్తు

కొత్తగా మల్టీ జోనల్‌ కేడర్‌కు చోటు

ప్రస్తుతం రాష్ట్ర, జోనల్, జిల్లాస్థాయి విధానం

మల్టీ జోనల్‌ పరిధిలో హైదరాబాద్, సచివాలయం, హెచ్‌వోడీలు

రెండు జోన్ల స్థానంలో ఐదు జోన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు

ఉద్యోగాలన్నీ రాష్ట్రపతి ఉత్తర్వుల పరిధిలోకి తెచ్చే యోచన

డిప్యూటీ సీఎం కడియం నేతృత్వంలో సమావేశమైన కమిటీ

21న మరోమారు భేటీ

సాక్షి, హైదరాబాద్‌: జోనల్‌ వ్యవస్థలో మార్పుచేర్పులు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది. ముందుగా జోన్లను రద్దు చేసి ప్రస్తుతమున్న పోస్టులన్నీ రాష్ట్రస్థాయి, జిల్లాస్థాయి పోస్టులుగా వర్గీకరించాలని నిర్ణయించిన ప్రభుత్వం.. ఇప్పుడు కొత్త జోన్ల ఏర్పాటు దిశగా ప్రతిపాదనలను పరిశీలిస్తోంది. అదే దిశగా కార్యాచరణను చేపట్టాలని, అందుకు వీలుగా రాష్ట్ర పతి ఉత్తర్వుల సవరణలకు అవసరమైన నివేదికను సిద్ధం చేయాలని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీకి బాధ్యతలు అప్పగించింది. ప్రభుత్వ ప్రతిపాదనలు, వివిధ సమస్యలపై కమిటీ చర్చించినట్లు తెలిసింది. ప్రాథమికంగా జరిగిన కసరత్తు మేరకు రాష్ట్రంలో జోన్ల వ్యవస్థ కొత్త రూపును సంతరించుకోనుంది. ప్రస్తుతమున్న 2 జోన్ల స్థానంలో మొత్తం 5 జోన్లు ఏర్పాటయ్యే అవకాశాలున్నాయి. ప్రస్తుతం రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రంలో మూడంచెల జోనల్‌ వ్యవస్థ అమల్లో ఉంది.

రాష్ట్రస్థాయి, జోనల్, జిల్లా స్థాయిగా పరిగణించే ఈ విధానానికి తగినట్లుగా పోస్టులు, ఉద్యోగులున్నారు. కొత్త వ్యవస్థలో ఈ మూడంచెల విధానాన్ని నాలుగంచెలుగా మార్చాలని ప్రభుత్వం యోచిస్తోంది. రాష్ట్రస్థాయి, జోనల్, జిల్లా స్థాయితోపాటు కొత్తగా మల్టీ జోన్లను ఏర్పాటు చేయనుంది. దీంతోపాటు అన్ని ప్రభుత్వ ఉద్యోగాలను రాష్ట్రపతి ఉత్తర్వుల పరిధిలోకి తేవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇటీవల జరిగిన సమావేశంలోనే తన ఆలోచనలను అధికారులతో పంచుకున్నారు. ప్రస్తుతం సెక్రటేరియట్, హెచ్‌వోడీలు, సొసైటీలు, కార్పొరేషన్లు రాష్ట్రపతి ఉత్తర్వుల పరిధిలో లేవు. కొత్త వ్యవస్థలో తీసుకునే నిర్ణయంతో ఇవన్నీ రాష్ట్రపతి ఉత్తర్వుల పరిధిలోకి చేరతాయి. తద్వారా సొసైటీలు, కార్పొరేషన్ల నియామకాలు సైతం తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్‌సీ) పరిధిలోకి తీసుకువచ్చే వీలుంటుంది.

బదిలీలు, పోస్టింగ్‌లకు వెసులుబాటు
కొత్త వ్యవస్థలో భాగంగా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖల్లో ఇకపై ఒకచోటి నుంచి మరొకచోటికి బదిలీలకు, పోస్టింగ్‌లకు వెసులుబాటు కల్పించేందుకు అవకాశం ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొత్తగా ఏర్పాటు చేసే మల్టీ జోనల్‌ పరిధిలో ఏయే ప్రాంతాలుంచాలి, కొత్తగా ఏర్పడే జోన్లలో ఏయే జిల్లాలను దేని పరిధిలో ఉంచాలనే అంశంపై రకరకాల ప్రతిపాదనలున్నాయి. వీటన్నింటినీ కమిటీ పరిశీలనకు స్వీకరించింది. ఈ కసరత్తులో భాగంగా హైదరాబాద్, రాష్ట్ర సచివాలయం, ఇతర హెచ్‌వోడీలను ఒక మల్టీజోన్‌గా పరిగణించే అవకాశాలున్నాయి. మిగతా జిల్లాలను మరో రెండు లేదా ఒక మల్టీ జోన్‌గా చేసే ప్రతిపాదనలున్నాయి.

తొలి భేటీలో ప్రాథమిక చర్చలు
డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అధ్యక్షతన ఏర్పడిన ఉన్నత స్థాయి కమిటీ శుక్రవారం సచివాలయంలో తొలిసారి సమావేశమైంది. పరిపాలన సౌలభ్యానికి వీలుగా 31 జిల్లాలను ఏర్పాటు చేసుకున్న నేపథ్యంలో కొత్త జోనల్‌ విధానం, స్థానికతను నిర్వచించడం, రాష్ట్రపతి నిబంధనల సవరణ, కొత్త రాష్ట్రపతి నిబంధనల రూపకల్పనపైనే ఇందులో చర్చించారు. సీఎం సూచనల మేరకు జిల్లాల్లోని స్థానికులకు ఇబ్బందులు కలగకుండా రాష్ట్ర, మల్టీ జోనల్, జోనల్, జిల్లాస్థాయి పోస్టుల విభజన ఎలా జరగాలి, జిల్లా క్యాడర్‌ ఎలా ఉండాలి.. అనే దానిపై అధికారుల నుంచి కమిటీ ప్రాథమిక సమాచారం తీసుకుంది. త్వరలోనే ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలతో చర్చించి వారి అభిప్రాయాన్ని తీసుకోవాలని తీర్మానించింది.

మంత్రులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, హరీశ్‌ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, ప్రత్యేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు రంజీవ్‌ ఆర్‌ ఆచార్య, ఎస్‌.కె.జోషి, సురేశ్‌ చందా, బి.ఆర్‌.మీనా, అజయ్‌ మిశ్రా, న్యాయ శాఖ కార్యదర్శి వి.నిరంజన్‌ రావు, సాధారణ పరిపాలన విభాగం ముఖ్య కార్యదర్శి అదర్‌ సిన్హా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఉద్యోగులతో పాటు ప్రభుత్వ నియామకాలకు సంబంధించిన అంశం కావటంతో మరిన్ని చర్చ లు, సమావేశాల తర్వాతే నిర్ణయానికి రానున్నారు. ఈ నెల 21న మరోసారి కమిటీ సమావేశం కానుంది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top