రెడ్‌జోన్లపై అసంతృప్తి

Telangana Government Unhappy With Central Red Zones List - Sakshi

రాష్ట్ర యంత్రాంగాన్ని సంప్రదించకుండానే కేంద్రం ప్రకటన

వికారాబాద్, సూర్యాపేట జిల్లాల్లో కేసులు ఉన్నా పట్టించుకోని వైనం

సాక్షి, హైదరాబాద్‌: కేంద్రం ప్రకటించిన రెడ్‌జోన్‌ జిల్లాలపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అసంతృప్తితో ఉంది. రెడ్‌జోన్లను నిర్ధారించడంలో శాస్త్రీయత లేదని, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని కనీసం సంప్రదించలేదన్న చర్చ జరుగుతోంది. అయితే వాటితో సంబంధం లేకుండా రాష్ట్రంలో కంటై న్మెంట్‌ ప్రాంతాల్లోనే ప్రత్యేక చర్యలు చేపడతామని వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. కరీంనగర్‌ జిల్లాలో ఇటీవల కేసులు పెరగకున్నా దాన్ని రెడ్‌జోన్‌గా కేంద్రం ఎందుకు ప్రకటించిందో అర్థం కావట్లేదని ఓ కీలక అధికారి వ్యాఖ్యానించారు. వికారాబాద్‌ జిల్లాలో ఇటీవల కేసుల సంఖ్య భారీగా పెరిగిందని, రాష్ట్రంలో మూడో స్థానంలో ఉంటే, ఆరెంజ్‌ జోన్‌లో ఉంచడమేంటని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సూర్యాపేటలోనూ కేసుల సంఖ్య పెరుగుతోంది. అందువల్ల కేంద్రం ప్రకటించిన రెడ్‌జోన్లు, ఆరెంజ్‌ జోన్లతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 159 కంటైన్మెంట్‌ ప్రాంతాలపైనే దృష్టి సారిస్తామని ఓ కీలకాధికారి తెలిపారు. వీటిని కేసుల సంఖ్య, తీవ్రత ఆధారంగా అత్యంత శాస్త్రీయంగా ప్రకటించామని అధికారులు చెబుతున్నారు.

కేంద్ర సాయమేదీ? 
రాష్ట్రంలో 8 జిల్లాలను లార్జ్‌ ఔట్‌బ్రేక్‌ హాట్‌స్పాట్లు (రెడ్‌జోన్లు)గా కేంద్రం ప్రకటించింది. హైదరాబాద్, నిజామాబాద్, వరంగల్‌ అర్బన్, రంగారెడ్డి, జోగుళాంబ గద్వాల, మేడ్చల్, కరీంనగర్, నిర్మల్‌ ఉన్నాయి. రెడ్‌ జోన్‌ (హాట్‌స్పాట్‌ క్లస్టర్‌)గా నల్లగొండ జిల్లాను ఎంపిక చేశారు. కేసులు నమోదైన మిగిలిన జిల్లాలను ఆరెంజ్‌ జోన్లుగా ప్రకటించింది. అంటే 8 జిల్లాల్లో తీవ్రమైన కేసులున్నట్లు కేంద్ర సర్కారు గుర్తించింది. అయితే వీటిని గుర్తించే విషయంలో తమను పరిగణనలోకి తీసుకోలేదని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. కేంద్రం ప్రకటించిన రెడ్‌జోన్‌ జిల్లాల ప్రకారం కాకుండా, మనం ఏర్పాటు చేసుకున్న కంటైన్మెంట్‌ ఏరియాలను దిగ్బంధం చేసి, మిగిలిన ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ కఠినంగా అమలు చేస్తే సరిపోతుందని కరోనా నియంత్రణ రాష్ట్ర ఉన్నతస్థాయి కమిటీ సభ్యుడు ఒకరు వ్యాఖ్యానించారు. అంతేకాదు కేంద్రం నుంచి రాష్ట్రానికి సాయం రావట్లేదని కూడా వ్యాఖ్యానించారు. ‘కిట్లు అడిగాం. కానీ 10 శాతం వరకు మాత్రమే వచ్చాయి. ఇక ఆర్థికసాయం అంటూ ఏమీ లేదు‘అని పేర్కొన్నారు. ఆర్థకి సాయం లేనప్పుడు రెడ్‌జోన్లు ప్రకటిస్తే వచ్చే ప్రయోజనమేంటని ప్రశ్నించారు. దీనివల్ల వైరస్‌ను పారదోలలేమని అంటున్నారు.

మార్గదర్శకాలపైనా చర్చ..
లాక్‌ డౌన్‌ విషయంలో కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాలపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. వివిధ దేశాలు ఆర్థిక గడ్డు పరిస్థితి నుంచి బయటపడేందుకు ప్యాకేజీలు ప్రకటిస్తుంటే, ఆ దిశగా కేంద్రం నుంచి ఎటువంటి ప్రకటనా జారీ కాలేదని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధానికి కఠినంగా తీసుకుంటున్న చర్యలను నీరు గారుస్తున్నట్లు ఉన్నాయని పలువురు అధికారులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రం కఠినంగా లాక్‌ డౌన్‌ ను అమలుచేస్తుంటే కేంద్రం మాత్రం కొన్ని మినహాయింపులు ఇవ్వడంపై విమర్శలు వస్తున్నాయి. కేంద్రం ప్రకటించిన మార్గదర్శకాలతో పలు రంగాల్లో లాక్‌ డౌన్‌ ఎత్తివేసినట్లవుతుందని పేర్కొంటున్నాయి. అలా జరిగితే వైరస్‌ను ఎదుర్కోవడం కష్టమవుతుందని, ఇప్పటివరకు చేసిన కఠోర శ్రమ వృథా అవుతుందని అధికార వర్గాలు అంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం లాక్‌ డౌన్‌ను ముందుగా ప్రకటించినట్లు ఈ నెల 30 వరకు కఠినంగా కొనసాగించాలని యోచిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. లాక్‌ డౌన్‌ నిబంధనలను సడలించడం ద్వారా ఆర్థిక కార్యకలాపాలకు పాక్షికంగా ద్వారాలు తెరవడం వల్ల జనం ఇళ్ల నుంచి బయటకు వస్తారని, అప్పుడు మే 3 వరకు లాక్‌ డౌన్‌ ఉన్నా లాభం ఉండదని చెబుతున్నారు. కేంద్రం రెడ్‌జోన్ల ప్రకటన, జాతీయ స్థాయి మార్గదర్శకాలపై రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారుల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top