కరోనా కట్టడి ఇలాగేనా?

Telangana Government Taking Care For Beggars In Telangana - Sakshi

జీహెచ్‌ఎంసీ మైదానంలో యాచకులకు బస

కనీసం మాస్కులు అందించని సిబ్బంది

ఇష్టానుసారం భిక్షాటన చేసిన వైనం

ఇటీవల పరీక్షల్లో వృద్ధురాలికి కరోనా పాజిటివ్‌

మైదానాన్ని కంటైన్మెంట్‌ జోన్‌గా మారుస్తూ అధికారుల హడావుడి

హడలిపోతున్న చుట్టుపక్కల ప్రాంతాల జనం

సాక్షి, హైదరాబాద్‌: కరోనా కట్టడికి ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటోంది. వివిధ విభాగాలు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నాయి. కానీ, కొందరు అధికారులు, సిబ్బంది మాత్రం పరిస్థితిని తేలిగ్గా తీసుకుంటున్నారు. యాచకుల తాత్కాలిక పునరావాసం విషయంలో అధికారులు వ్యవహరించిన తీరే అందుకు నిదర్శనం. యాచకులను తెచ్చి తాత్కాలిక బసలో ఉంచారు. ఆపై పట్టించుకోకపోవడంతో యాచకులంతా ఇష్టానుసారం తిరిగారు. ఉంచింది ఓ మైదానం కావటంతో కొందరు యువకులు అలవాటుగా అక్కడ  జాగింగ్‌ చేశారు. అంతలో యాచకుల్లో ఒకరికి కరోనా పాజిటివ్‌గా తేలటంతో ఆ చుట్టుపక్కల ఉండే వారందరిలో ఇప్పుడు భయం మొదలైంది. జీహెచ్‌ఎంసీ అధికారులు తీరిగ్గా ఇప్పుడు ఆ ప్రాంతాన్ని కంటైన్మెంట్‌ జోన్‌ అంటూ ప్రకటించి హడావుడిగా కట్టడి చర్యలు చేపట్టారు.

అసలేం జరిగిందంటే..
కొద్దిరోజుల క్రితం అత్తాపూర్‌ తదితర ప్రాంతాల్లోని 50 మంది యాచకులను జీహెచ్‌ఎంసీ సమీకరించి విజయనగర్‌ కాలనీలోని మున్సిపల్‌ ఫుట్‌బాల్‌ మైదానంలో ఆశ్రయం కల్పించింది. ఇంతవరకు బాగానే ఉంది. ఆ తర్వాత అక్కడుంచిన యాచకులను అధికారులు గాలికొదిలేశారు. పగటివేళ ఆ యాచకులు సమీపంలోని ప్రాంతాల్లో విచ్చలవిడిగా తిరుగుతూ యాచిస్తూ వచ్చారు. తిరిగి సాయంత్రం మైదానానికి చేరుకునేవారు. జీహెచ్‌ఎంసీ సిబ్బంది భోజన వసతి కల్పించినా, కొందరు సొంతంగా వండుకోవటం ప్రారంభించారు.

రాత్రి పడుకునే సమయంలో తప్ప యాచకులు మిగతా ప్రాంతాల్లో కాలనీలు, బస్తీల్లోనే తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోలేదు. ప్రస్తుత పరిస్థితిలో కచ్చితంగా మాస్కు ధరించాల్సి ఉన్నా, యాచకులకు జీహెచ్‌ఎంసీ సిబ్బంది వాటిని అందించలేదు. దాదాపు యాభై మంది సమీపంలోని ఇళ్ల వద్దకు వెళ్లి భిక్షాటన చేస్తుండటంతో జనం బిత్తరపోయారు. ఒకేసారి ఇంతమంది యాచకులు కొత్తగా కనిపిస్తున్నారంటూ కొంత ఆందోళనకు కూడా గురయ్యారు. ఇక మైదానంలోని బోరు పంపు వద్ద వారు స్నానాలు చేస్తూ, దుస్తులు ఉతుక్కోవటంతో కొన్ని రోజుల పాటు ఆ మురుగునీరు కాలనీలో ఇళ్ల ముందు కాలువకట్టింది. దీనిపై స్థానికులు ఫిర్యాదు కూడా చేశారు.

ఇప్పుడు చేతులు కాలాక..
యాచకుల బృందంలోని ఓ వృద్ధురాలికి కరోనా పాజి టివ్‌ వచ్చింది. దీంతో ఇన్ని రోజులు ఆ బాధితురాలి తోనే కలిసి ఉన్న మిగతావారి పరిస్థితిపై ఉత్కంఠ నెలకొంది. అధికారులు వెంటనే అందరి నమూనాలు సేకరించి పరీక్షకు పంపారు. మైదానంలో రెండు మరుగుదొడ్లే ఉన్నాయి. ఇన్ని రోజులు బాధితురాలు సహా మిగ తా యాచకులు వాటినే వాడారు. కలిసి తిన్నారు, ఒకేచోట పడుకున్నారు. ఆ ప్రాంతాలన్నీ కలియదిరిగారు. యాచకులకు ఆ మైదానాన్ని షెల్టర్‌ చేసి అక్కడే భోజ నాలు అందిస్తున్నప్పుడు వారు వెలుపలికి రాకుండా కట్టడి చేయాల్సింది. అప్పుడే వైద్య పరీక్షలు చేసి ఉం టే, కరోనా బాధితులుంటే వెంటనే తేలేది. కానీ, అదే మీ జరగలేదు.

ఈలోగా, ఇన్ని రోజులపాటు వారు బస్తీలు, కాలనీల్లో తిరగటం, వారు మైదానంలో ఉండగానే అక్కడ కొందరు యువకులు అటవాటు ప్రకారం జాగింగ్‌ చేయటం ఇప్పుడు ఆందోళనకు కారణమైంది. అంతా అయ్యాక శుక్రవారం మైదానానికి రెండు వైపులా కంటైన్మెంట్‌ జోన్‌ అని రాసి ఉన్న హెచ్చరికలను ఏర్పాటు చేశారు. శనివారం జీహెచ్‌ఎంసీ ఎంటమాలజీ సిబ్బంది ట్యాంకర్‌ సాయంతో మైదానం మొత్తం రసాయన జలాలను పిచికారీ చేశారు. ఏంటీ సంగతి అని ఆరాతీస్తే, అప్పుడుగాని మైదానంలో ఉన్న యాచకురాలికి వైరస్‌ సోకిందన్న సంగతి స్థానికులకు తెలియలేదు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top