నెలకు రెండు వేలు కొత్త రేషన్‌ కార్డులు

Telangana Government New Ration Cards Apply Online - Sakshi

ఇందూరు(నిజామాబాద్‌ అర్బన్‌): జిల్లాలో రేషన్‌ కార్డుల సంఖ్య నెలనెలకు పెరుగుతోంది. కొత్త కార్డుల మంజూరు, పాత కార్డుల్లో పేర్లను కలిపేందుకు ప్రభుత్వం అనుమతించడంతో పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయి. వీటిని పరిశీలిస్తున్న అధికారులు అర్హులకు కార్డులు మంజూరు చేస్తున్నారు. గత నాలుగు నెలల్లో జిల్లా 8 వేలకు పైగా కొత్త కార్డులు మంజూరయ్యాయి. జనవరిలో జిల్లాలో 3,81,083 రేషన్‌ కార్డులు ఉండగా, ఇందులో 12,71,610 మంది లబ్ధిదారులకు రేషన్‌ అందించారు. అప్పుడు నెలకు 8 వేల మెట్రిక్‌ టన్నులుగా బియ్యం కోటా అవసరమఅయ్యేది. అయితే, ప్రస్తుతం మే నెల లో రేషన్‌ కార్డుల సంఖ్య 3,89,827కు చేరింది. 13,01,616 మంది లబ్ధిదారులకు రూ.1కి కిలో చొప్పున రేషన్‌ అందించడానికి జిల్లాకు 8,185 మెట్రిక్‌ టన్నుల బియ్యం కోటా అవసరం అవుతోంది. గత జనవరి నుంచి మే నెల వరకు 8,744 కొత్త రేషన్‌ కార్డులు మంజూరు కాగా, అదనం గా 185 మెట్రిక్‌ టన్నుల బియ్యం నెల వారీ కోటాలో పెరిగింది. ఈ లెక్కల ప్రకారం నెలకు రెండు వేల చొప్పున కొత్త రేషన్‌ కార్డులు పెరిగాయి.

మరింత పెరగనున్న సంఖ్య
అర్హులైన వారిందరికీ రేషన్‌ కార్డులు మంజూరు చేయనున్నట్లు సివిల్‌ సప్లయి కమిషనర్‌ అకున్‌ సబర్వాల్‌ ప్రకటించారు. ఇప్పటికే కొత్త రేషన్‌ కార్డుల కోసం జిల్లాలో చాలా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటితో పాటు ఉన్న కార్డుల్లో కుటుంబ సభ్యుల కొత్త పేర్లను చేర్చేందు కు కూడా దరఖాస్తులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరో మూడు, నాలుగు నెల ల్లో జిల్లాలో రేషన్‌ కార్డుల సంఖ్య నాలుగు లక్షలకు చేరే అవకాశం కనిపిస్తోంది.

అర్హులైన వారందరికీ మంజూరు..
రేషన్‌ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకున్న అర్హులందరికీ నిబంధనల ప్రకారం మంజూరు చేస్తున్నాం. అంతకు ముందు మండలాల నుంచి తహసీల్దార్లు సమ్మతి తెలిపి డీఎస్‌వో కార్యాలయానికి ఆన్‌లైన్‌లో పంపుతారు. వాటిని మేము కూడా పరిశీలించి అర్హులని తేలితే మంజూరు చేస్తున్నాం. గడిచిన నాలుగు నెలల్లో 8 వేలకు పైగా కొత్త రేషన్‌ కార్డులు మంజూరయ్యాయి. వీటి సంఖ్య ఇది వరకంటే బాగా పెరిగింది.     – కృష్ణప్రసాద్, డీఎస్‌వో, నిజామాబాద్‌ 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top