తెలంగాణలో 29 దాకా లాక్‌డౌన్‌

Telangana Government Extends Lockdown Till May 29 - Sakshi

ఈ సమస్య రేపో, ఎల్లుండో సమసిపోదు.. కరోనాతో కలిసి బతకాల్సిందే: కేసీఆర్‌

కొద్దిరోజులు ఓపిక పడితే అన్నీ సర్దుకుంటాయి 

వైరస్‌ నియంత్రణలో దేశ సగటుకన్నా మెరుగ్గా ఉన్నాం 

చాలా చక్కగా ముందుకెళ్తున్నాం.. ఇది కొనసాగించాలి 

గ్రీన్, ఆరెంజ్‌ జోన్లలో అన్ని షాపులూ తెరుచుకోవచ్చు 

రెడ్‌ జోన్లలో నిర్మాణ, వ్యవసాయ సంబంధిత షాపులకు అనుమతి 

మున్సిపాలిటీల్లో సగం దుకాణాలకు ఓకే 

రాష్ట్రమంతా రాత్రివేళ కర్ఫ్యూ యథాతథం 

జాగ్రత్తలు పాటించి పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తాం 

రిజిస్ట్రేషన్, ఆర్టీఏ కార్యాలయాలు నేటి నుంచి పనిచేస్తాయి 

గ్రీన్‌జోన్లలో ఆటోలు, క్యాబ్‌లకు అనుమతి 

నేను బతికున్నంత వరకూ రైతుబంధు ఆగదు

వలస కార్మికులకు అండగా ఉంటాం 

విలేకరుల సమావేశంలో సీఎం కేసీఆర్‌ స్పష్టీకరణ

ఏడు గంటలపాటు కేబినెట్‌ భేటీ 

రెడ్‌ జోన్‌ జిల్లాలపై 15న సమీక్షించి నిర్ణయం 

రాష్ట్రంలో కొత్తగా 11 పాజిటివ్‌ కేసులు..

43 మంది డిశ్చార్జి 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను ఈ నెల 29 వరకు పొడిగిస్తున్నట్టు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వెల్లడించారు. కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, కావాల్సిందల్లా ప్రజల సహకారమేనని, కొద్ది రోజులు ఓపిక పడితే అన్నీ సర్దుకుంటాయని పేర్కొన్నారు. మంగళవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సుదీర్ఘంగా జరిగిన కేబినెట్‌ సమావేశం అనంతరం మంత్రులు ఈటల రాజేందర్, హరీశ్‌రావు, శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్‌లతో కలిసి ఆయన ప్రగతిభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. సీఎం ఏం చెప్పారో ఆయన మాటల్లోనే... 

 

రెడ్‌జోన్
1. హైదరాబాద్, 2. రంగారెడ్డి, 3. వికారాబాద్, 4. మేడ్చల్‌, 5. సూర్యాపేట, 6. వరంగల్‌ అర్బన్‌

ఆరెంజ్‌ జోన్‌
7. ఆదిలాబాద్, 8. నిర్మల్, 9. ఆసిఫాబాద్, 10. నిజామాబాద్,  11, జగిత్యాల, 12. మంచిర్యాల, 13. కామారెడ్డి, 14. సిరిసిల్ల, 15. మెదక్, 16. సంగారెడ్డి, 17. జయశంకర్‌ భూపాలపల్లి, 18. జనగాం, 19. మహబూబ్‌నగర్, 20. నల్లగొండ,21. ఖమ్మం, 22. జోగులాంబ గద్వాల, 23. కరీంనగర్, 24. నారాయణ్‌పేట్‌

గ్రీన్‌జోన్‌
25. సిద్దిపేట, 26. యాదాద్రి భువనగిరి, 27. వరంగల్‌ రూరల్, 28. మహబూబాబాద్, 29. భద్రాద్రి కొత్తగూడెం, 30. వనపర్తి, 31.నాగర్‌కర్నూల్, 32. పెద్దపల్లి, 33. ములుగు

కరీంనగర్‌ను కాపాడగలిగాం..
ప్రపంచాన్ని అనేక ఇబ్బందులకు, కష్టనష్టాలకు గురిచేస్తున్న కరోనా మనల్ని కూడా పట్టి పీడిస్తోంది. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,096 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇందులో 628 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయి వెళ్లిపోయారు. మంగళవారం మరో 43 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. 11 మందికి కొత్తగా ఈ రోజు పాజిటివ్‌ వచ్చింది. వారందరినీ ఆస్పత్రుల్లో చేర్చారు. మొత్తంగా ఇప్పుడు 439 మంది చికిత్స పొందుతున్నారు. ముందు నుంచీ కరోనా విషయంలో మనం చాలా కఠినంగా, ఒక పకడ్బందీ వ్యూహంతో వ్యవహరించాం. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ కరీంనగర్‌. అప్పుడు దేశంలో ఎవరికీ కంటైన్మెంట్‌ అనేది తెలియదు. ఫస్ట్‌ ఇన్‌ ఇండియా.. కరీంనగర్‌లో సంభవించిన పరిణామాల నేపథ్యంలో ఇండోనేసియా దేశస్తులు 11 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. వారు ఇక్కడ చాలా కాలం ఉన్నారు. దీంతో చాలా పకడ్బందీగా చర్యలు తీసుకున్నాం. ఒక్క చావు లేకుండా కరీంనగర్‌ను కాపాడగలిగాం. ఇందుకు కృషి చేసిన వైద్య మంత్రి ఈటల రాజేందర్, స్థానిక మంత్రి గంగుల కమలాకర్, వైద్య సిబ్బంది, డాక్టర్లు, పోలీసులు అందరికీ ప్రత్యేక అభినందనలు. అక్కడ 100 శాతం సక్సెస్‌ అయ్యాం. దేశానికే పూర్తిగా రోల్‌మోడల్‌ అయ్యాం.

మన నుంచి కేరళ కూడా చాలా ఉదాహరణలు తీసుకుంది. మనం కూడా కరీంనగర్‌ ఘటన తర్వాత చాలా నేర్చుకుని మిగతా ప్రాంతాల్లో అదే పద్ధతిలో ఎలా కట్టుదిట్టం చేయాలన్నది అమలు చేశాం. ఇక కరోనా మరణాల విషయంలో దేశ సగటు 3.37% ఉంటే మన రాష్ట్రంలో 2.64% ఉంది. ఇది దేశ సగటు కన్నా తక్కువ. యాక్టివ్‌ కేసులు దేశ సగటు 69.21 శాతం ఉంటే, రాష్ట్రంలో 42.7% ఉంది. రికవరీ రేటు దేశంలో 27.40% ఉంటే, రాష్ట్రంలో 57.3% ఉంది. ఏ పారామీటర్‌లో చూసుకున్నా మనం దేశసగటు కన్నా మెరుగ్గా ఉన్నాం. చాలా చక్కగా ముందుకు పోతున్నాం. ఇందుకోసం పనిచేసిన నాయకులు, అధికారులు, వైద్యసిబ్బంది, పోలీస్, ఇతరత్రా సిబ్బంది, ప్రత్యేకించి కలెక్టర్లకు హృదయ పూర్వక అభినం దనలు. ఈ కృషి ఇలానే కొనసాగాల్సిన అవసరం ఉంది.  చదవండి: సెప్టెంబర్‌ 1నుంచి ఇంజనీరింగ్‌ క్లాసులు  

మంగళవారం ప్రగతిభవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్‌. చిత్రంలో మంత్రులు కొప్పుల ఈశ్వర్, శ్రీనివాస్‌గౌడ్, హరీశ్‌రావు, ఈటల రాజేందర్, నిరంజన్‌రెడ్డి, గంగుల కమలాకర్, సబితా ఇంద్రారెడ్డి 

స్వీయ నియంత్రణ పాటించాలి.. 
కరోనాపై అంతర్జాతీయ స్థాయిలో రకరకాల విశ్లేషణలున్నాయి. ఫ్లాటరింగ్‌ అంటారు. అంటే కర్వ్‌ కిందికి తగ్గిపోవడం. ఇప్పుడు మనం అదే దశలో ఉన్నాం. దీన్ని జీరోకు తీసుకువచ్చే ప్రయత్నం జరుగుతోంది. దీనికి తోడు ఈరోజు మన జీనోమ్‌ వ్యాలీలోని భారత్‌ బయోటెక్‌ కంపెనీ నుంచి రూ.2 కోట్లు సీఎంఆర్‌ఎఫ్‌ ఇచ్చేందుకు వచ్చారు. వారితో పాటు హైదరాబాద్‌కే చెందిన బయోలాజికల్‌ కంపెనీ ఎండీ మహిమ దాట్ల, శాంతా బయోటెక్‌ వరప్రసాదరెడ్డి.. అందరూ చెప్పారు. చాలా సీరియస్‌గా పరిశోధనలు జరుగుతున్నాయని, ఆగస్టు కల్లా వ్యాక్సిన్‌ వచ్చే అవకాశం ఉందన్నారు. ఆగస్టు, సెప్టెంబర్‌ రెండు దశల్లో వ్యాక్సిన్‌ తెచ్చే ప్రయత్నం జరుగుతోంది. మన దగ్గర నుంచే ఆ వ్యాక్సిన్‌ వస్తే చాలా గొప్పది. ప్రపంచానికే మనం ఆదర్శంగా నిలుస్తాం. కరోనా అనేది కనిపించని శత్రువు. దీనిని ఎదుర్కొనేందుకు స్వీయ నియంత్రణ పాటించాలి. మనం ఎవరో బలవంత పెడితేనో, ఎవరి కోసమో ఈ స్వీయనియంత్రణ పాటిస్తున్నామని అనుకోవద్దు.

ఇప్పటివరకు మనల్ని మనం చాలా బాగా రక్షించుకున్నాం. ఇక ముందు కూడా రక్షించుకోవాలి. అతి శక్తివంతమైన అమెరికాలోనే కుప్పలు కుప్పలుగా కేసులు వస్తున్నాయి. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కూడా ఒక్క రోజులోనే చాలా కేసులు వస్తున్నాయి. ఇప్పుడు మన చేతిలో ఉన్న ఒకే ఒక ఆయుధం లాక్‌డౌన్, భౌతికదూరం పాటించడం. ఇప్పటివరకు ఈ భౌతిక దూరాన్ని పాటిస్తూ విజయం సాధించాం. పంటిబిగువనో, ఒంటిబిగువనో ఇంకొంచెం ముందుకు పోతే తక్కువ నష్టాలతో మన రాష్ట్రం, మన సమాజం బయటపడే అవకాశం ఉంటుంది. ఇప్పటికే కొన్ని వ్యాధులున్న వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. షుగర్, బీపీ, డయాలసిస్, కేన్సర్‌ రోగులు, గుండె జబ్బులున్న వారికి మూడు నెలలకు ఒకేసారి మందులు ఇస్తాం. వారు బయటకు రావద్దు. ఈ రోగులు 40–50 లక్షల మధ్య ఉంటారని అంచనా. వారి కోసం ప్రత్యేకంగా కోటి మాస్కులు తయారు చేయిస్తున్నాం. అవి ఉతుక్కుని వాడుకోవచ్చు.  చదవండి: ప్రయాణ ఖర్చులన్నీ ప్రభుత్వానివే..

కేంద్ర మార్గదర్శకాలు యథాతథంగా అమలు.. 
లాక్‌డౌన్‌పై కేంద్రం ఇటీవల జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాల్సిన అవసరం ఉంది. రెడ్‌జోన్‌లో సూర్యాపేట, వరంగల్‌ అర్బన్, వికారాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాలు.. గ్రీన్‌జోన్‌లో యాదాద్రి భువనగిరి, వరంగల్‌ రూరల్, వనపర్తి, భద్రాద్రి కొత్తగూడెం, సిద్ధిపేట, ములుగు, మహబూబాబాద్, నాగర్‌కర్నూల్, పెద్దపల్లి జిల్లాలు.. ఆరెంజ్‌ జోన్‌లో సంగారెడ్డి, మహబూబ్‌నగగర్, మెదక్, జయశంకర్‌ భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, జగిత్యాల, మంచిర్యాల, నారాయణపేట్, రాజన్న సిరిసిల్ల, నల్లగొండ, నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, జనగామ, ఆసిఫాబాద్, నిర్మల్, గద్వాల జిల్లాలున్నాయి. ఈ వర్గీకరణ ఆధారంగా కేంద్రం కొన్ని సడలింపులిచ్చింది. వాటిని అతిక్రమించడానికి అవకాశం లేదు. అవసరమనుకుంటే అంతకన్నా కఠినంగా పెట్టుకోవచ్చు. భారత ప్రభుత్వం ఆదేశాలు పాటించాల్సిందే. అయితే, ఆరెంజ్‌ జోన్‌ నుంచి ఈ రోజుకే కొన్ని గ్రీన్‌జోన్‌లోకి పోతున్నాయి. కానీ, వాటిని ఓ పద్ధతి ప్రకారం కేంద్రానికి పంపి అధికారికంగా మార్చాల్సి ఉంటుంది.

11 రోజుల్లో 18 జిల్లాలు గ్రీన్‌జోన్‌లోకి పోతాయి. ప్రస్తుతం కంటైన్మెంట్‌ ఏరియాలు 35 ఉన్నాయి. అందులో 19 హైదరాబాద్‌లో, రెడ్‌జోన్లలోని ఇతర జిల్లాల్లో 16 ఉన్నాయి. ఇవి కూడా మంగళవారం నాటికి దాటిపోయి 12 మాత్రం మిగులుతాయి. దినాలు గడిచే కొద్ది ఇంకా తగ్గిపోతాయి. ఇక రెడ్‌జోన్లలో ఉన్న జిల్లాల్లో హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి ఎక్కువ జనసాంద్రత ఉండే జిల్లాలు. ఇక్కడే భయంకరమైన పరిస్థితులున్నాయి. మొత్తం కేసుల్లో 726 కేసులు (66 శాతం) ఇక్కడే ఉన్నాయి. మిగిలిన రాష్ట్రమంతా 34 శాతమే ఉన్నాయి. మరణాల్లో కూడా మొత్తం 29 మంది చనిపోతే 25 మరణాలు రెడ్‌జోన్లలోనే (86శాతం) ఉన్నాయి. తాజా కేసుల్లో కూడా ఈ రోజుతో సహా అన్నీ జీహెచ్‌ఎంసీ కిందనే వస్తున్నాయి. సూర్యాపేట అయిపోయింది. వరంగల్‌ అర్బన్‌ కూడా వెళ్లిపోతుంది. వికారాబాద్‌ కూడా మూడు రోజుల తర్వాత ఫ్రీ అయితది. మిగిలిన మూడు జిల్లాల్లో, జీహెచ్‌ఎంసీ పరిధిలోనే అన్ని కేసులు వస్తున్నాయి. ఈ మూడు జిల్లాల్లో కలిపి కోటికి పైగా జనాభా ఉంటుంది. ఇక్కడ ఉన్న ప్రజలు పూర్తి స్థాయిలో సహకారం అందించాలి. లేదంటే కమ్యూనిటీ స్ప్రెడ్‌ అయ్యే అవకాశం ఉంది. ముంబై వంటి పరిస్థితి వస్తుంది. కానీ, హైదరాబాద్‌ చల్లగుండాలె. అందరూ సహకరిస్తేనే ఇది సాధ్యమవుతుంది.  

దిగుమతులపైనే ఆధారపడ్డాం... 
ప్రపంచవ్యాప్తంగా అనేక అనుభవాలు దృష్టిలో ఉంచుకోవడంతో పాటు యావత్‌ వైద్య ప్రపంచం, గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు వెలిబుస్తున్న అభిప్రాయం మేరకు 70 రోజులైతే చాలా వరకు కంట్రోల్‌లోకి వస్తుంది. అడపాదడపా అక్కడొకటి, అప్పుడొకటి వస్తే కంట్రోల్‌ చేసుకోవచ్చు. కాబట్టి దాన్ని పాటించాలి. రాష్ట్రాన్ని కచ్చితంగా కాపాడే ప్రయత్నం చేయాలి. టీవీ చానెల్‌ సర్వేలు కూడా ఇదే చెబుతున్నాయి. నేను చాలా మందితో మాట్లాడినప్పుడు కూడా ఇదే విషయం చెప్పారు. ఎమ్మెల్యేలు, మంత్రివర్గ సభ్యులు కూడా ఇప్పటికి బాగున్నం.. ఇలానే కొనసాగాలని చెప్పారు. అందుకే మే 29 వరకు రాష్ట్రంలో లాక్‌డౌన్‌ కొనసాగుతుంది. రాత్రి కర్ఫ్యూ యథాతథంగా ఉంటుంది. రాత్రి 7 గంటల తరువాత ఎవరు బయటకు వచ్చినా పోలీసు చర్యలు తీసుకుంటారు. ఇంతకాలం విజయం సాధించాం. ఇప్పుడు దీన్ని అతిక్రమిస్తే దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఉష్ణోగ్రత కూడా బాగా పెరిగిపోయింది. 39, 40 డిగ్రీలకు పోయింది. ఇంకా పెరుగుతుందంటున్నారు. బయటకు వెళ్లద్దు. పరిస్థితి ఇప్పుడు అదుపులో ఉంది. ప్రజలు సహకరించాలి. కొద్దిరోజులు ఓపిక పడితే అన్నీ సర్దుకుంటాయి. చదవండి: సొంతూళ్లకు విద్యార్థులు

వాస్తవానికి, మన దేశానికి ఇటాంటి విపత్తులను ఎదుర్కొనే శక్తి లేదు. ముఖ్యమంత్రుల సమావేశంలోనే కేంద్ర అధికారి ప్రీతిసూడాన్‌ దేశంలో ఉన్న పరిస్థితుల గురించి చెప్పారు. అన్నీ దిగుమతులపైనే ఆధారపడ్డాం. ఎన్‌–95 మాస్కులు, పీపీఈ కిట్ల కోసం దిగుమతుల మీదే ఆధారపడ్డాం. కరోనా ఆరంభంలో ఎన్‌–95 మాస్కులు, పీపీఈతో సహా ఏ రకమైన వైద్య ఉపకరణాలు లేకున్నా అందుబాటులో ఉన్న ఎయిడ్స్‌ కిట్లను వాడుకున్నాం. బెంగుళూరులో 15వేల కిట్లు బుక్‌ చేసినా అందుబాటులోకి రాలేదు. పది లక్షల కిట్లను ఆర్డర్‌ చేస్తే ఇప్పటికే 5.60 లక్షల కిట్లు వచ్చాయి. వైద్య ఉపకరణాలకు మనకు ఎలాంటి కొరత లేదు. ఆస్పత్రులు, పడకలతో సహా 2వేల మంది వైద్యులు, పారామెడికల్‌ సిబ్బందితో పూల్‌ ఏర్పాటు చేశాం. ప్రజలు కొద్దిపాటి సహకారం ఇస్తే కరోనా సంక్షోభం నుంచి బయటపడతాం.  

గృహ నిర్మాణ రంగానికి అనుమతి 
ఆర్థిక రంగాన్ని తిరిగి ప్రారంభించేందుకు కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాలను యధాతథంగా అమలు చేస్తూనే, అవసరమైతే ఇంకొంత కఠినంగా వ్యవహరిస్తాం. రెడ్‌ జోన్‌ పరిధిలో ఉన్న హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, వరంగల్‌ అర్బన్, సూర్యాపేట జిల్లాల్లో ఏ ఒక్క దుకాణం కూడా తెరిచేది లేదు. గృహ నిర్మాణ రంగానికి సంబంధించి సిమెంట్, స్టీలు, హార్డ్‌వేర్, ఎలక్ట్రికల్‌ దుకాణాలతో పాటు వ్యవసాయ రంగానికి సంబంధించి పనిముట్లు, స్పేర్‌ పార్టులు, ట్రాక్టర్లు, విత్తన, ఎరువులు, పురుగు మందులు తదితర దుకాణాలు తెరుస్తాం. అనుకోని పరిస్థితి వస్తే భారతదేశానికి అన్నం పెట్టే శక్తి ఎవరికీ లేదు. ఆహార రంగంలో దేశం సాధించిన స్వావలంబన ఎట్టి పరిస్థితుల్లోనూ కోల్పోకూడదు. 

మే 15న మరోమారు సమీక్ష 
రెడ్‌జోన్‌లోనూ అన్ని రకాల దుకాణాలు తెరవాలని కేంద్రం చెప్పినా హైదరాబాద్‌లో లాక్‌డౌన్‌ మినహా గత్యంతరం లేదు. నిబంధనలు సడలించడంతో ఢిల్లీ, మద్రాసు, బెంగుళూరులో కుప్పలు తెప్పలుగా జనాలు రోడ్ల మీదకు రావడంతో లాఠీచార్జీ జరిగింది. ఆయా నగరాల్లో పరిస్థితిని సమీక్షించి ఈనెల 15న మరోమారు సమీక్షించి నిర్ణయం తీసుకుంటాం. 27 జిల్లాల్లో సడలింపులు ఇస్తూ అన్ని షాపులకు అనుమతి ఇస్తున్నాం. గ్రీన్, ఆరెంజ్‌ జోన్లలో మండల కేంద్రం నుంచి గ్రామ స్థాయి వరకు అన్ని షాపులు తెరుస్తారు. మున్సిపాలిటీల్లో మాత్రం రోజూ 50 శాతం షాపులు మాత్రమే తెరుస్తారు. వీటిని మున్సిపల్‌ కమిషనర్లు లాటరీ విధానంలో నిర్ణయిస్తారు.

భద్రత, భౌతిక దూరం పాటించకుంటే అనుమతులు తక్షణమే రద్దు చేస్తాం. ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు షాపులు తెరిచేందుకు అనుమతి ఉంటుంది. అన్ని జిల్లాల్లోనూ రాత్రి ఏడు గంటల నుంచి మరుసటి రోజు ఉదయం ఆరు గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. ప్రైవేటు కార్యాలయాల్లో మూడింట ఒక వంతు, స్టాంపులు, రిజిస్ట్రేషన్, ప్రభుత్వ కార్యాయాలు వంద శాతం పనిచేస్తాయి. ఇసుక మైనింగ్‌ బుధవారం నుంచే ప్రారంభం అవుతుంది. రెడ్‌జెన్‌తో సహా అంతటా ఆర్టీఏ ఆఫీసులు పనిచేస్తాయి.   చదవండి: వాటిలో మినహా అన్నిజోన్లలో మద్యం విక్రయాలు

మే నెలలో పదో తరగతి పరీక్షలు 
పదో తరగతి పరీక్షలు ఇప్పటి వరకు మూడు పేపర్లు పూర్తి కాగా, మరో ఎనిమిది పేపర్లకు పరీక్షలు జరగాలి. హైకోర్టు నిబంధనలు పాటిస్తూ ప్రస్తుతమున్న 2,500 పరీక్ష కేంద్రాలను అవసరమైతే 5వేలకు పెంచుతాం. ఒక్కో గదిలో 15 నుంచి 20 మంది విద్యార్థుల చొప్పున శానిటైజర్లు, మాస్కులు ఇచ్చి పరీక్షలు పెడతాం. తల్లిదండ్రులు ఆందోళన దృష్టిలో పెట్టుకుని కోర్టు అనుమతి తీసుకోవాలని అడ్వొకేట్‌ జనరల్‌కు చెప్పాం. పిల్లలు వెళ్లడానికి బస్సులు ఏర్పాటుచేస్తాం. ప్రైవేటు వాహనాలు ఉన్నవారికి పాస్‌లు జారీచేస్తాం. మొత్తానికి మే నెలలోనే పరీక్షలు పూర్తి చేస్తాం. ఇంటర్మీడియేట్‌ జవాబు పత్రాల వాల్యూయేషన్‌ కూడా బుధవారం నుంచి ప్రారంభిస్తాం. విద్యాశాఖ మంత్రి, కేబినెట్‌ సబ్‌ కమిటీ, కార్యదర్శి తదితరులు వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించిన మాడ్యూల్‌ను తయారు చేస్తారు. వచ్చే విద్యా సంవత్సరం కొంత ఆలస్యంగా జూన్‌ నెలాఖరు లేదా జూలైలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. చదవండి: జూలై 26న నీట్‌

కరోనాతో కలిసి బతకాల్సిందే... 
కరోనా సమస్య రోజుల్లో పరిష్కారం కాదు. దానితో మనం కలిసి బతకాల్సిందే. ఈ ఆపద నుంచి బయట పడేందుకు శక్తి సంతరించుకోవాలి. యువ, పేద న్యాయవాదులను ఆదుకోవాలనే అడ్వొకేట్‌ జేఏసీ, న్యాయవాదుల వినతి మేరకు రూ.25 కోట్లతో ట్రస్టు ఏర్పాటు చేశాం. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలో ఈ డబ్బులు వితరణ చేస్తాం. రూ.15 కోట్లు తక్షణమే విడుదల చేస్తూ.. మిగతా మొత్తాన్ని దశలవారీగా అవసరాన్ని బట్టి ఇస్తాం. 

వలస కార్మికులను చేరవేస్తాం 
తెలంగాణలో లక్షలాది మంది వలస కార్మికులు పనిచేస్తూ రాష్ట్ర అభివృద్దిలో భాగస్వాములుగా ఉన్నారు. 7.50లక్షల మంది వలస కార్మికులకు వారి సంఖ్య, అవసరాన్ని బట్టి రూ.1500 నగదు, 12 కిలోల చొప్పున బియ్యం ఇచ్చాం. స్వచ్చంద సంస్థలు, నాయకులు కూడా ఆదుకుంటున్నారు. వీరిలో ఉపాధి అవకాశం ఉంటే.. ఇక్కడే ఉంటామని కొందరు చెప్తున్నారు. హౌజింగ్, రియల్‌ ఎస్టేట్, పరిశ్రమలు తిరిగి ప్రారంభం అవుతున్నందున వలస కార్మికులు పనిచేసుకోవచ్చు. స్వస్థలాలకు వెళ్లాలనుకుంటే తెలంగాణ ప్రభుత్వం సిద్దంగా ఉంది. యూపీ, బిహార్‌ ముఖ్యమంత్రులతోపాటు ఇతర రాష్ట్రాల అధికారులతో మాట్లాడాం.

అక్కడకు చేరుకునే వారిని సొంతూళ్లకు చేర్చేందుకు ఆయా ప్రభుత్వాలు ప్రణాళిక రూపొందించుకుంటున్నాయి. ఒకేసారి లక్షలాది మంది వస్తే అక్కడి ప్రభుత్వాలకు కూడా సమస్యే. ఒకేసారి వేలు, లక్షల సంఖ్యలో పంపడం సాధ్యం కాదు. మంగళవారం రాష్ట్రం నుంచి బిహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తర్‌ప్రదేశ్‌కు 11 రైళ్లు పంపించాం. రోజూ 40 రైళ్లు పంపాలనుకున్నా సాధ్యం కాలేదు. రైస్‌ మిల్లుల్లో పనిచేసేందుకు బిహార్‌ నుంచి 20వేల మందికి పైగా రాష్ట్రానికి వస్తున్నారు. తెలంగాణకు వస్తే కడుపు నిండా తిండి దొరుకుతుంది. వలస కార్మికులకు ఏవైనా సమస్యలు ఉంటే 100కు డయల్‌ చేయడంతో పాటు స్థానిక ఎమ్మెల్యేల దృష్టికి తీసుకెళ్లండి. 

సిగ్గు లేకుండా కాంగ్రెస్‌ దీక్షలు 
తెలంగాణలో రైతు రాజ్యం నడుస్తోంది. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రైతులు పండించే పంటను వంద శాతం రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తోంది. దేశంలో కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం పాలిత రాష్ట్రాలు సహా ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా ధాన్యం కొనడంలేదు. పనికిమాలిన, తలమాసిన రాజకీయాల వలలో చిక్కుకుని చిరాకు కలిగిస్తే ధాన్యం కొనలేం. కందులు, శనగలు, జొన్నలు, పొద్దు తిరుగుడు, వరి ధాన్యం, మొక్కజొన్న పంటను ఏ రాష్ట్ర్‌రమూ వంద శాతం కొనలేదు. ఛత్తీస్‌గఢ్‌లో వరి ధాన్యం క్వింటాల్‌ రూ.2,500కి కొంటామని చెప్పి, ప్రస్తుతం రూ.800కి కొంటున్నారు. కాంగ్రెస్‌ అ«ధికారంలో ఉన్న పంజాబ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లో ఎక్కడా ప్రభుత్వం ధాన్యం సేకరించడం లేదు. తెలంగాణలో కాంగ్రెస్‌ నేతలు సిగ్గులేకుండా దీక్షలు చేస్తున్నారు. తాలుగాండ్లు, తలకు మాసినవాళ్లు మాట్లాడుతూ చీప్‌ రాజకీయాలు చేస్తున్నారు. ఎవరైనా పొల్లు పోసి తగలపెడతరా? ఏడు వేల కొనుగోలు కేంద్రాల్లో ఎక్కడైనా జరిగిందా? రైతులు భవిష్యత్తును చెడగొట్టుకోవద్దు.  

నేను బతికి ఉన్నంత వరకు రైతుబంధు 
కేసీఆర్‌ బతికి ఉన్నంత వరకు, టీఆర్‌ఎస్‌ రాష్ట్రంలో అధికారంలో ఉన్నంత వరకు రైతుబంధు పథకం యధాతథంగా కొనసాగుతుంది. వానాకాలం కూడా రూ.7వేల కోట్లు ఇస్తాం. రూ.25వేల రుణాన్ని ఏకకాలంలో మాఫీ చేయడం ద్వారా 5.50లక్షల మంది రైతులకు లాభం జరుగుతుంది. దీనికి సంబంధించి రూ.1,198 కోట్లను బుధవారం విడుదల చేస్తున్నాం. రైతుల ఆర్దిక పరిస్థితి మెరుగయ్యేదాకా ఈ పథకం కొనసాగుతుంది. రైతులకు 24 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్‌ ఇస్తున్నది తెలంగాణ ప్రభుత్వం మాత్రమే. రాష్ట్రంలో చిల్లరగాళ్ల రాజ్యం లేదు. రూ.2,016 పింఛను కూడా పేదలకు ఇస్తాం. పేదలు, రైతు సంక్షేమంలో రాజీ పడేది లేదు. వచ్చే వ్యవసాయ సీజన్‌కు రైతులు సిద్దంగా ఉండాలి. 35లక్షల ఎకరాల్లో సాగుకు అవసరమైన విత్తనాలు సమకూరుస్తాం. గ్రామీణ ప్రాంతాలన్నీ గ్రీన్‌ జోన్‌లో ఉన్నందున వ్యవసాయ మంత్రి, రైతుబంధు అధ్యక్షులు రాష్ట్రంలో ముమ్మరంగా పర్యటిస్తారు. సన్న రకాలకు మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్నందున రైతులు సాగు చేయాలి. ప్రస్తుతం సేకరిస్తున్న ధాన్యానికి సంబంధించిన డబ్బులు రైతుల ఖాతాల్లో వేస్తున్నాం. 

ప్రతిపక్షాలు అభాసుపాలు కావద్దు.. 
ప్రతిపక్షాలకు ఏ అంశం ఎత్తుకోవాలో తెలియదు. ఇంత పాజిటివ్‌గా పనిచేస్తూ వంద శాతం ధాన్యం కొనుగోలు చేస్తున్నా అభినందించకుండా ఇచ్చులు, కచ్చకాయలు అంటున్నారు. నిజమైన రైతులు తాలు అమ్ముతారా? అసంబద్దమైన అంశంపై «ధర్నా చేసేందుకు సిగ్గుండాలి. వాళ్లు ఉచిత వినోదం పంచే బఫూన్లు, జోకర్లు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో పిడుగులు పడుతున్నాయని ఒకాయన అంటున్నడు. ఏ ఇష్యూ ఎత్తుకోవాలో తెలియక ఉన్న గౌరవం, పరపతి పోగొట్టుకుంటున్నారు. ఇష్యూను సెలెక్ట్‌ చేసుకునే తెలివి లేకుంటే ఎట్లా? మరింతగా అభాసుపాలు కావద్దు.  

వీళ్లతో మాట్లాడటం వేస్టాఫ్‌ టైమ్‌ 
కొందరు దరిద్రులు గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఏ ప్రభుత్వమైనా చావులను దాచి పెట్టగలదా? ప్రజలను కాపాడుకునేందుకు ఏం చేయాలో ప్రభుత్వానికి తెలుసు. వైద్య ఆరోగ్య సిబ్బందిని అభినందిచాల్సింది పోయి, అబద్ధాలు ఆడుతున్నారని అనడం దిక్కుమాలిన రాజకీయం. ఎక్కువ టెస్ట్‌లు చేస్తే ఎక్కువ కేసులు వస్తయా? రాజకీయ పార్టీలకు ఆపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదని ఎట్లా అంటారు. ఈ వెధవలకు ఎవరు అపాయింట్‌మెంట్‌ ఇస్తారు. ఒకడు ఎత్తడు.. ఒకడు తవ్వడు.. ఇంకొకడు మోయడు. సిగ్గుమాలిన ముచ్చట. వీళ్లతో మాట్లాడటం వేస్టాఫ్‌ టైమ్‌. వీళ్లు ఒకడు ఇంటి పార్టీ.. మరొకరు పక్కింటి పార్టీ.. ప్రజలు తిరస్కరించారు. నాది తప్పు ఉంటే ప్రజలు శిక్ష విధిస్తారు. అర్దవంతమైన ఆరోపణలు, నిర్మాణాత్మక చర్యలు ఉంటే ఆలోచిస్తాం. గోదావరి జలాలు పంట పొలాలకు వచ్చినప్పుడు.. సాగునీటి ప్రాజెక్టులకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ పార్టీ చేసిన కుట్రలపై డాక్యుమెంటరీ తయారుచేసి ప్రజలకు విడుదల చేస్తాం. 

కాళేశ్వరం చివరి పాయింట్‌కు నీళ్లు 
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా చివరి పాయింట్‌కు నీళ్లు రాబోతున్నయి. వేల చెరువులు మత్తడి దూకుతున్నయి. హుజూరాబాద్, సిద్దిపేటలో రోహిణి కార్తెలో నాట్లు వేయించేందుకు వెళ్తున్నాం. ప్రతిపక్షాలు మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్‌కు పోయి రైతులను తప్పుదోవ పటించాయి. నీళ్లు ఇస్తున్న సందర్భంలో వీళ్ల వ్యవహారాన్ని ప్రజల ముందు పెడతాం. ప్రజలు తిరస్కరిస్తున్నా పద్దతి మార్చుకోవడం లేదు. 

బస్సులు నడపం.. 
రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు సర్వీసులను పునరుద్ధరించడంలేదు. ఒక జిల్లా గ్రీన్‌ జోన్‌లో ఉంటే పొరుగు జిల్లాలు ఆరెంజ్, రెడ్‌జోన్లలో ఉన్నాయి. ఈ పరిస్థితిలో జిల్లాల మధ్య బస్సులు నడపలేం. ఈ నెల 15న నిర్వహించనున్న సమీక్షలో బస్సు సర్వీసులపై నిర్ణయం తీసుకుంటాం. ఆలోగా చాలా ఆరెంజ్‌ జోన్లలోని జిల్లాలు గ్రీన్‌ జోన్లలోకి వస్తాయి. 15 తర్వాత హైదరాబాద్‌లో సైతం కొంత వరకు దుకాణాలను తెరిచేందుకు అనుమతి ఇచ్చే అవకాశముంది. హైదరాబాద్‌లో తాళం తీసేస్తే రోడ్లపై వరదలా వాహనాలు వస్తాయి. గ్రీన్‌ జోన్‌ జిల్లాల్లో ఆటో, క్యాబ్‌లకు.. ఆరెంజ్‌ జోన్‌ జిల్లాల్లో క్యాబ్‌లకు అనుమతిస్తున్నాం.  

రంజాన్‌కు సడలింపులు ఇవ్వలేం..  
ఈ నెల 24న రంజాన్‌ పండుగ జరుపుకోనున్నారు. అయితే, పండుగ అవసరాలకు ప్రత్యేక సడలింపులు ఇవ్వడంలేదు. ఇళ్లలోనే పండుగ నమాజ్‌ చేసుకోవాలి. ఈద్గాకు వెళ్లవద్దు. అలయ్‌ బలయ్‌ ఇవ్వడం, చేతులు కలపడం చేయొద్దు. రంజాన్‌ తోఫాను సైతం ఈసారి ఇవ్వడంలేదు. ఈ విషయంలో ముస్లింలు నన్ను క్షమించాలి. ఇమామ్‌లు, మౌజన్‌లకు మాత్రం ఆర్థిక సహాయం కొనసాగుతుంది.  

విదేశాల నుంచి వస్తే ఇళ్లకు పంపం.. 
విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చే వారిని పెయిడ్‌ క్వారంటైన్‌లో ఉంచాలని కేంద్రం కోరింది. దీనిని దృష్టిలో పెట్టుకుని అత్యవసరమైతేనే విదేశాల నుంచి తిరిగి రావాలి. హోటళ్లు, లాడ్జీల్లో 14 రోజులు ఉండి వీరే అద్దె చెల్లించాల్సి ఉంటుంది. అప్పటి వరకు వారిని ఇళ్లకు పంపించే అవకాశం లేదు. టెస్టుల అనంతరం వ్యాధి లేదని నిర్థారించుకున్నాకే ఇళ్లకు పంపిస్తాం. ఏజెన్సీ జిల్లాల్లో 100 శాతం పోస్టులను గిరిజనులతో భర్తీ చేయాలన్న నిబంధనలను కొట్టివేస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును పునఃసమీంక్షించాలని కోరుతూ త్వరలో పిటిషన్‌ వేస్తాం.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top