రాజ్యాంగ స్ఫూర్తికి పునరంకితం కావాలి 

Telangana Formation Day Celebration In Telangana High Court - Sakshi

హైకోర్టు తాత్కాలిక సీజేఐ 

సాక్షి, హైదరాబాద్‌ : రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడేందుకు న్యాయమూర్తులు, న్యాయవాదులందరూ పునరంకితం కావాలని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్ర సింగ్‌ చౌహాన్‌ పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భంగా ఆదివారం ఉదయం హైకోర్టు ఆవరణలో  జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం  మాట్లాడుతూ రాజ్యాంగ స్ఫూర్తిని ప్రజలవద్దకు తీసుకెళ్లే బాధ్యత మనందరిపై ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు జస్టిస్‌ వి.రామసుబ్రహ్మణ్యన్, జస్టిస్‌ పి.నవీన్‌రావు, జస్టిస్‌ షమీమ్‌ అక్తర్, జస్టిస్‌ టి.అమర్‌నాథ్‌గౌడ్, విశ్రాంత న్యాయమూర్తులు జస్టిస్‌ వి.ఈశ్వరయ్య, జస్టిస్‌ చంద్రయ్య, బార్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ ఎ.నర్సింహారెడ్డి, అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ జె.రామచంద్రరావు పాల్గొన్నారు.  

వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో జరిగిన తెలంగాణ అవతరణ వేడుకల్లో  గట్టు శ్రీకాంత్‌రెడ్డి, కొండా రాఘవరెడ్డి తదితరులు

అభివృద్ధి, సంక్షేమం దిశగా ముందడుగు వేయాలి: గట్టు  
హైదరాబాద్‌: అభివృద్ధి, సంక్షేమం దిశగా రాష్ట్రం ముందడుగువేయాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి ఆకాంక్షించారు. లోటస్‌ పాండ్‌లోని పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకల్లో జాతీయజెండాను ఆవిష్కరించి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. అమరుల ఆకాంక్షలు నెరవేరాలని, ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయాలని కోరారు.  కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు డాక్టర్‌ ప్రఫుల్లారెడ్డి, కొండా రాఘవరెడ్డి, బి.సంజీవరావు, మహిళావిభాగం అధ్యక్షురాలు అమృతాసాగర్, ఎస్సీసెల్‌ అధ్యక్షుడు నాగదేశి రవికుమార్‌ పాల్గొన్నారు. 

ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్‌లో ..
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఆదివారం ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌. రమణ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అమరుల త్యాగాల ఫలితంగా తప్పనిసరి పరిస్థితుల్లో నాటి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వాల్సి వచ్చిందన్నారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ కలలుగన్నట్లు కాకుండా రాష్ట్రంలో కేసీఆర్‌ ఇష్టం వచ్చినట్లు పాలన సాగిస్తుండడం దురదృష్టకరమన్నారు. కార్యక్రమంలో టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, ముఖ్యనేతలు కె. దయాకర్‌రెడ్డి, అరవింద్‌కుమార్‌గౌడ్, బండ్రు శోభారాణి తదితరులు పాల్గొన్నారు.   

అసెంబ్లీ ఆవరణలో..
సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు ఆదివారం  శాసనసభ ఆవరణలో ఘనంగా జరిగాయి.   ఈ సందర్భంగా స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు.  అనంతరం జాతిపిత మహాత్మాగాంధీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. 

బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో..
సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ లక్ష్యాలు నెరవేరలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాలన సాగుతోందని, కుటుంబ కబంద హస్తాల్లో, అవినీతిలో కూరుకుపోయిన రాష్ట్రానికి విముక్తి కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో భాగంగా ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఉద్యమ సమయంలో తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహిస్తామని చెప్పిన కేసీఆర్‌ ఇప్పుడు మజ్లిస్‌ పార్టీ ఒత్తిడితో నిర్వహించడం లేదని ఆరోపించారు.
 

డీజీపీ కార్యాలయంలో..
సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ డీజీపీ కార్యాలయంలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి.  రాష్ట్ర స్థాయి పోలీసు నియామక బోర్డు చైర్మన్‌ వి.వి.శ్రీనివాసరావు జాతీయ జెండా ఎగురవేశారు. కార్యక్రమంలో సీఐడీ ఎస్పీ సుమతి, డీఎస్పీ వేణుగోపాల్, చీఫ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ యోగేశ్వర్‌రావు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top