నా తమ్ముడు సతీష్ పై సీఎం కార్యాలయంలో ఫిర్యాదు చేస్తారా?
మాల.. లం.. అని దూషిస్తూ బెదిరించిన డీఐజీ కోయా ప్రవీణ్
డీజీపీ కార్యాలయంలో టీడీపీ దళిత నేత సుధా మాధవి ఫిర్యాదు
సాక్షి, అమరావతి: ‘వేమన సతీశ్‌కు డబ్బులు ఇచ్చాననే విషయం చెబుతావా.. మాల లం.. మీరు, మీ జాతి బెదిరిస్తే డబ్బులు తిరిగి వస్తాయనుకుంటున్నారా.. నిన్నూ, నీ మొగుడ్నీ, కుటుంబం మొత్తాన్ని ఎన్‌కౌంటర్ చేసి అక్కడే పాతరేస్తాం’ అని కర్నూలు డీఐజీ కోయా ప్రవీణ్ తమను బెదిరించారని టీడీపీ దళిత నేత సుధా మాధవి వెల్లడించారు. పోలీసులు తమను కిడ్నాప్ చేసి, బంధించి, వేధించి.. టీడీపీ ఎన్‌ఆర్‌ఐ విభాగం నేత వేమన సతీశ్‌కు తాము డబ్బులు ఇవ్వలేదని వీడియో రికార్డింగ్ చేయించారని కూడా తెలిపారు.
ఈ మేరకు గురువారం ఆమె డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. డీఐజీ కోయా ప్రవీణ్, రాజంపేట సీఐ నాగార్జున, మహిళా ఎస్సై, ముగ్గురు కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకోవాలని కోరారు. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు టీడీపీ టికెట్ ఇప్పిస్తానని చెప్పి, ఆ పార్టీ ఎన్‌ఆర్‌ఐ విభాగం నేత వేమన సతీశ్ తమ నుంచి రూ.7 కోట్లు తీసుకున్నారని సుధా మాధవి ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే. ఆయనకు నగదు ఇస్తున్న వీడియోలను కూడా విడుదల చేయడం సంచలనంగా మారింది.
ఈ నేపథ్యంలో ప్రభుత్వ పెద్దలు ఆమెను లక్ష్యంగా చేసుకున్నారు. పోలీసులు సుధా మాధవి, ఆమె భర్తను మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయం ఎదురుగా ఉన్న సర్వీస్ రోడ్డులో కిడ్నాప్ చేయడం తీవ్ర కలకలం సృష్టించింది. సుధా మాధవి దంపతులను పోలీసులు అపహరించారని వారి కుమారుడు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. దాంతో పోలీసులు వారిని విడిచిపెట్టారు.
ఈ నేపథ్యంలో తమను డీఐజీ కోయా ప్రవీణ్, సీఐ నాగార్జున తదితరులు ఎలా కిడ్నాప్ చేసి వేధించిందీ వివరిస్తూ సుధా మాధవి డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. అనంతరం ఆమె మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఫిర్యాదులోని అంశాలను వివరించి, పోలీసుల నుంచి తమ ప్రాణాలకు ముప్పు ఉందని వాపోయారు. సుధారాణి ఫిర్యాదులో పేర్కొన్న అంశాలు ఇలా ఉన్నాయి.
టీడీపీ కార్యాలయం ఎదుటే కిడ్నాప్
మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయం ఎదురుగా ఉన్న సర్వీస్ రోడ్డులో మమ్మల్ని కిడ్నాప్ చేశారు. నంబరు లేని వాహనంలో వచ్చిన పోలీసులు నా భర్తను, నన్నూ బలవంతంగా ఎక్కించుకుని తీసుకుపోయారు. అడ్డుకునేందుకు యత్నించిన మా కొడుకు, మనవడిని తీవ్రంగా కొట్టారు. నాకు, నా భర్తకు తుపాకి గురి పెట్టి అరిస్తే కాల్చేస్తామని బెదిరించారు. మా ఇద్దరు పిల్లల్ని కూడా చంపేస్తామన్నారు. రాజంపేట టౌన్ సీఐ నాగార్జున మమ్మల్ని నేరుగా మదనపల్లెకు తీసుకువెళ్లి ఓ గదిలో బంధించారు.
ఎన్‌కౌంటర్లో లేపేస్తాం
సీఐ నాగార్జున, ఓ మహిళా ఎస్సై, నలుగురు కానిస్టేబుళ్లు మమ్మల్ని తీవ్రంగా వేధించారు. మమ్మల్ని కులంపేరుతో బూతులు తిట్టారు. వేమన సతీశ్‌కు రూ.7 కోట్లు ఇవ్వలేదని చెప్పాలని, లేకపోతే ఇక్కడే చంపేసి ఆత్మహత్య చేసుకున్నట్టు కేసు రాస్తామని బెదిరించారు. అనంతరం సీఐ నాగార్జున తన దగ్గర ఉన్న ఓ ఫోన్ నుంచి డీఐజీ కోయా ప్రవీణ్‌కు ఫోన్ చేసి మాట్లాడమని నాకు ఇచ్చారు. అవతలి నుంచి డీఐజీ కోయా ప్రవీణ్ తనను పరిచయం చేసుకుని.. ‘వేమన సతీశ్ నాకు వరుసకు తమ్ముడు అవుతాడు.
అతను రూ.7 కోట్లు తీసుకున్న విషయాన్ని మీరు ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదు చేస్తారా.. మీకు ఎంత ధైర్యం.. అలా ఫిర్యాదు చేసి బతకగలం అనుకుంటున్నారా.. మిమ్మల్ని ఇక్కడే ఎన్‌కౌంటర్ చేస్తే దిక్కూ మొక్కూ ఉండదు.. అయినా మీ ముఖాలకు రూ.7 కోట్లు ఉన్నాయా.. మీరు, మీ జాతి బెదిరిస్తే డబ్బులు తిరిగి వస్తాయనుకుంటున్నారా.. మాల లం.. అని అసభ్యంగా తిడుతూ బెదిరించారు. నిన్నూ, నీ మొగుడిని, మొత్తం కుటుంబాన్ని ఎన్‌కౌంటర్ చేసి అక్కడే పాతరేస్తాం అని హెచ్చరించారు.
మాల, మాదిగలకు రోడ్డెక్కడం అలవాటే
ఆ వెంటనే వేమన సతీశ్ మాతో ఫోన్లో మాట్లాడారు. చూశారా నా పవర్.. రాష్ట్రంలో మీరు కాదు కదా.. మిమ్మల్ని పుట్టించిన వాళ్లు కూడా నా నుంచి డబ్బులు వెనక్కి తీసుకోలేరు. రూ.50 లక్షలు ఇస్తాను తీసుకోండి.. అంతేగానీ సీఎం.. పీఎం.. అంటూ తిరిగితే ఆ డబ్బులు కూడా దొరకవు. మీ మాల, మాదిగ కులాల వారికి ఇలా రోడ్డు ఎక్కడం అలవాటే.. అంటూ చెప్పుకోలేని పరుష పదాలతో తీవ్రంగా దూషించారు.
అనంతరం పోలీసులు మమ్మల్ని తీవ్రంగా కొట్టి, బెదిరించి మాతో బలవంతంగా వీడియో రికార్డింగ్ చేయించారు. వేమన సతీశ్‌కు మేము రూ.7 కోట్లు ఇవ్వలేదని మాతో అబద్ధపు వాంగ్మూలం ఇప్పించారు. పోలీసుల నుంచి మా ప్రాణాలకు ముప్పు ఉంది. మాకు భద్రత కల్పించాలని కోరుతున్నాం. మమ్మల్ని కిడ్నాప్ చేసి వేధించిన డీఐజీ కోయా ప్రవీణ్, సీఐ నాగార్జున, మహిళా ఎస్సై, నలుగురు కానిస్టేబుళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.


