ముందస్తు పై అంతుచిక్కని కోమటిరెడ్డి వ్యూహం

Telangana Early Elections To Nalgonda Politics - Sakshi

సాక్షిప్రతినిధి, నల్లగొండ : సీఎల్పీ ఉపనేత, నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ముందస్తు ఎన్నికల వైపు వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే రెండుసార్లు ఆయా మండలాల్లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన బుధవారం చడీ చప్పుడు లేకుండా ముఖ్య కార్యకర్తలను పిలిపించుకుని ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ విషయం మీడియాకు లీక్‌ కాకుండా జాగ్రత్తపడ్డారు. ప్రభుత్వాన్ని రద్దు చేస్తూ అధికార టీఆర్‌ఎస్‌ గురువారం నిర్ణయం తీసుకోనుందన్న వార్తల నేపథ్యంలో కోమటిరెడ్డి ఒకింత ముందుగానే తన అనుచరులు, ముఖ్య కార్యకర్తలతో భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. కోమటిరెడ్డి సోదరులు టీఆర్‌ఎస్‌లో చేరుతారని ఒకవైపు ప్రచారం ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలోనే ఆయన ముఖ్య కార్యకర్తల సమావేశంలో దక్షిణ తెలంగాణలో నల్లగొండ కేంద్రంగా ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించి వారిని ఆశ్చర్యంలో ముంచెత్తార న్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఈ సమావేశంలో ఆయన ఎమ్మెల్యేగా నాలుగు టర్మ్‌ల పనిని, ఇక ముందు చేయాల్సిన నల్లగొండ అభివృద్ధి గురించి మాట్లాడారని పార్టీ వర్గాల సమాచారం. తొలిసారి ఎమ్మెల్యేగా ప్రతిపక్షంలో కూర్చున్నానని, ఆ తర్వాత కాంగ్రెస్‌ అధికారంలోకి రావడంతో దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్న హయాంలో జిల్లా అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు సాధించానని, ఆ తర్వాత కాంగ్రెస్‌ ప్రభుత్వంలోనే ఉన్నా, పార్టీ నాయకత్వం శీతకన్నుతో అభివృద్ధి నిధులు రాలేదని, ఆ తర్వాత 2014 ఎన్నికల్లో గెలిచినా ప్రతిపక్షంలో ఉండిపోవడంతో అనుకున్నంత మేర అభివృద్ధి చేయలేకపోయాయని ఆవేదన చెందారని చెబుతున్నారు. ఈసారి ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిపించాలని, వచ్చే ప్రభుత్వంలో కీలక స్థానంలో ఉంటానని, నల్లగొండ అభివృద్ధిని పది తరాలు గుర్తుంచుకునేలా చేస్తానని కార్యకర్తలకు మనోధైర్యం ఇచ్చారని సమాచారం.

అంతుబట్టని వ్యూహం
కోమటిరెడ్డి అనుచరులు ఒకింత అయోమయంలోనే ఉన్నారని అంటున్నారు. పార్టీ మారుతారంటూ జరుగుతున్న సమాచారంపై కార్యకర్తలకు ఆయన కొంత స్పష్టత ఇచ్చినట్లు చెబుతున్నారు. అయితే, నల్లగొండలో రాహుల్‌ గాంధీ బహిరంగ సభ ఉంటుందని చెప్పడంతో అసలు కోమటిరెడ్డి పార్టీ మారుతున్నారా? లేక కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్నారా? అన్న ప్రశ్నలపై పార్టీ కేడర్‌లో తర్జనభర్జన జరిగిందని సమాచారం. గత ఎన్నికల్లో తప్పుడు ప్రచారాలతో ఇండిపెండెంట్‌ అభ్యర్థి ఆడిన రాజకీయ డ్రామాతో తక్కువ మెజారిటీ ఇచ్చారని, ఈసారి ఘన విజయం అందించాలని కార్యకర్తలకు సూచించారని వినికిడి. మొత్తంగా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఎన్నికల వ్యూహం ఏమిటో తమకు అంతుబట్టలేదని కొందరు కార్యకర్తలు అభిప్రాయ పడ్డారు.

ఈ సమావేశంలో నకిరేకల్‌ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, కాంగ్రెస్‌ నల్లగొండ పట్టణ అధ్యక్షుడు గుమ్ముల మోహన్‌రెడ్డి, కనగల్‌ జెడ్పీటీసీ సభ్యుడు శ్రీనివాస్, కనగల్, నల్లగొండ, తిప్పర్తి మండలాల పార్టీ అధ్యక్షులు, ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారని పార్టీ వర్గాలు చెప్పాయి. కాగా, నిత్యం పార్టీ కండువాతో కనిపించే కోమటిరెడ్డి ఈ ప్రత్యేక భేటీలో కండువా ధరించలేదు. దీంతోపాటు సమావేశానికి హాజరైన ఏ కార్యకర్త, నాయకుడి మెడలోనూ పార్టీ కండువా లేకపోవడం కొసమెరుపు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top