కాంగ్రెస్‌ 9.. సీపీఐ 1

Telangana Congress MLA First list Released Today Adilabad - Sakshi

సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్‌: మహాకూటమి సీట్ల కేటాయింపుపై ఓవైపు భాగస్వామ్య పక్షాలు అసంతృప్తితో ఉన్నప్పటికీ అభ్యర్థుల తొలిజాబితాను విడుదల చేయాలని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించింది. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్‌సీ కుంతియా శనివారం హైదరాబాద్‌లో 74 మందితో కూడిన అభ్యర్థుల జాబితాను విడుదల చేయనున్నారు. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, మాజీ ప్రధాని మన్‌మోహన్‌సింగ్‌లతో కూడిన పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) ఆమోదం తెలిపిన ఈ జాబితాలో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా నుంచి ఎనిమిది మంది పేర్లు ఉన్నట్లు అత్యంత విశ్వసనీయ సమచారం. సీపీఐకి కేటాయించిన బెల్లంపల్లి మినహా మిగతా తొమ్మిది స్థానాల నుంచి కాంగ్రెస్‌ పోటీ చేయనుంది.

ఈ సీట్లపై ఢిల్లీలో స్క్రీనింగ్‌ కమిటీ, పీసీసీ కోర్‌ కమిటీ సుధీర్ఘ కసరత్తు జరిపింది. బోథ్‌ సీటు విషయంలో స్క్రీనింగ్‌ కమిటీ సోయం బాపూరావు పట్ల మొగ్గు చూపినా, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడొకరు అభ్యంతరం తెలుపడంతో పెండింగ్‌లో పెట్టినట్లు సమాచారం. ఒకరి కన్నా ఎక్కువ మంది పోటీ పడుతున్న సీట్లలో పలు సమీకరణాలను క్రోఢీకరించి అభ్యర్థులను ఎంపిక చేశారు. అయితే కేంద్ర ఎన్నికల కమిటీ ఆమోదం తెలిపినప్పటికీ... చివరి నిమిషంలో కూడా మార్పులు చోటుచేసుకునే సంస్కృతి ఉన్న కాంగ్రెస్‌లో జాబితా వెల్లడయ్యేంత వరకు ఏమీ చెప్పలేని స్థితి. ఢిల్లీలో గురువారం రాత్రి వరకు చోటుచేసుకున్న పరిణామాలను బట్టి కాంగ్రెస్‌ తొలి జాబితాలో ఎనిమిది మంది పేర్లు ఉంటాయని విశ్వసనీయ సమాచారం. ఎక్కువ మంది సీటును ఆశించిన స్థానాల్లో అనుకూల, ప్రతికూల అంశాలను అంచనా వేస్తూ సీట్లు ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

మంచిర్యాల సీటుపైనే అందరి దృష్టి
మంచిర్యాల నియోజకవర్గం సీటు కోసం మాజీ ఎమ్మెల్సీ కె.ప్రేంసాగర్‌రావు, మాజీ ఎమ్మెల్యే జి.అరవింద్‌రెడ్డి మధ్య హోరాహోరీ పోరు సాగుతున్న విషయం తెలిసిందే. ఈ సీటు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ భట్టి విక్రమార్కకు ప్రతిష్టాత్మకంగా మారింది. డీసీసీ అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ద్వారా అరవింద్‌రెడ్డికి సీటు ఇప్పించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. అయితే ప్రేంసాగర్‌రావుకు పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్లు భట్టి విక్రమార్క, ఎ.రేవంత్‌రెడ్డి, డీకే.అరుణ తదితర నేతలంతా మద్దతుగా నిలిచారు. ఢిల్లీలో ఆశావహులతో సమావేశమైనప్పుడు స్క్రీనింగ్‌ కమిటీ ఛైర్మన్‌ భక్తచరణ్‌దాస్‌ బృందం సైతం ప్రేంసాగర్‌రావు అభ్యర్థిత్వం పట్లనే మొగ్గుచూపినట్లు సమాచారం. తుది జాబితాలో ప్రేంసాగర్‌రావు అభ్యర్థిత్వమే ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
 
చెన్నూరు నుంచి వెంకటేష్‌ నేత

గ్రూప్‌–1 అధికారిగా ఎక్సైజ్‌ శాఖలో డిప్యూటీ కమిషనర్‌గా విధులు నిర్వర్తించిన మంచిర్యాల జిల్లాకు చెందిన బోర్లకుంట వెంకటేష్‌ నేత తన పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు. ఏఐసీసీ ఎస్సీ సెల్‌ జాతీయ అధ్యక్షుడు కొప్పుల రాజు ద్వారా చెన్నూరు సీటు లక్ష్యంగా ఆయన కార్యకలాపాలు నిర్వర్తించారు. ఈ నియోజకవర్గం నుంచి టికెట్టు ఆశించిన  మాజీ మంత్రి బోడ జనార్ధన్‌ కూడా రేవంత్‌రెడ్డితో పాటు తెలుగుదేశం వీడి కాంగ్రెస్‌లో చేరారు. మాజీ ఎమ్మెల్యే సంజీవరావు తదితరులు సైతం టికెట్టు ఆశించినప్పటికీ, చివరికి పోటీ వెంకటేష్‌ నేత, బోడ జనార్ధన్‌ మధ్యనే సాగింది. స్క్రీనింగ్‌ కమిటీ వెంకటేష్‌ నేత వైపు మొగ్గు చూపగా, రేవంత్‌రెడ్డి మాజీ మంత్రి జనార్ధన్‌కే ఇవ్వాలని పట్టుపట్టినట్లు తెలిసింది. వివిధ సమీకరణాలను పరిగణలోకి తీసుకొని వెంకటేష్‌ నేతకే టికెట్టు ఖరారు చేస్తూ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ నిర్ణయం తీసుకుంది. టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసిన జెడ్పీ వైస్‌ చైర్మన్‌ మూల రాజిరెడ్డితో పాటు చెన్నూరు ఎంపీపీ కళావతి, చెన్నూరు, కోటపల్లి మండలాలకు చెందిన టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు శనివారం వెంకటేష్‌నేత ఆధ్వర్యంలో కాంగ్రెస్‌లో చేరనున్నారు.

ముథోల్‌లో రామారావు పటేల్‌ వైపే మొగ్గు
ముథోల్‌లో మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్, ఆయనకు సమీప బంధువైన రామారావు పటేల్‌ మధ్యనే టికెట్టు పోటీ నెలకొంది. అయితే నాలుగేళ్లుగా ప్రజల మధ్య ఉన్న రామారావు పటేల్‌కే హైకమాండ్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఢిల్లీలో స్క్రీనింగ్‌ కమిటీ ముందు నారాయణరావు పటేల్‌ హాజరు కాకపోవడంతో అధిష్టానం రామారావు పటేల్‌ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
 
ఆదిలాబాద్‌లో మహిళా నేతగా సుజాత
ఆదిలాబాద్‌లో మాజీ మంత్రి సి.రామచంద్రారెడ్డి, ఏఐసీసీ సభ్యురాలు గండ్రత్‌ సుజాత మధ్య నెలకొన్న పోరులో స్క్రీనింగ్‌ కమిటీ సుజాత వైపే మొగ్గు చూపింది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి, మంత్రి జోగు రామన్న సామాజిక వర్గానికే చెందిన సుజాత ఆదిలాబాద్‌లో సరైన అభ్యర్థిగా పార్టీ భావించినట్లు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లా నుంచి టీఆర్‌ఎస్‌ తరుపున ఇద్దరు మహిళలు పోటీలో ఉండడం కూడా సుజాతకు అనుకూలించిన అంశంగా మారింది. ఉమ్మడి జిల్లా నుంచి ఒక మహిళా అభ్యర్థికి స్థానం కల్పించిన అంశం ప్రజల్లో సానుకూలతగా ఉంటుందని సీఈసీ భావించినట్లు తెలుస్తోంది.
 
సిర్పూరులో పాల్వాయి హరీష్‌బాబు
సిర్పూరు నియోజకవర్గంలో రేవంత్‌రెడ్డితో పాటు కాంగ్రెస్‌లో చేరిన రావి శ్రీనివాస్, ఎన్నికల ప్రకటన తరువాత కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్న దివంగత ఎమ్మెల్యే పాల్వాయి పురుషోత్తంరావు తనయుడు పాల్వాయి హరీష్‌బాబుల మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పోటీ నెలకొంది. రావి శ్రీనివాస్‌కు టికెట్టు ఇప్పేంచుకు రేవంత్‌రెడ్డి శతవిధాలా ప్రయత్నాలు చేశారు. అయితే స్థానికత అంశం ఇక్కడ ఎక్కువ ప్రభావం చూపినట్లు సమాచారం. తాజా మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సెటిలర్‌ కాగా, ఆయనకు సమీప బంధువు రావి శ్రీనివాస్‌ అవడంతో స్క్రీనింగ్‌ కమిటీ హరీష్‌బాబు వైపు మొగ్గు చూపినట్లు తెలిసింది. గత కొంతకాలంగా నియోజకవర్గంలో హరీష్‌బాబు చేస్తున్న పర్యటనలు కూడా ఆయనకు అనుకూలించాయి. దీంతో హరీష్‌బాబు పేరు తొలిజాబితాలో ఉన్నట్లు తెలిసింది.

ఖానాపూర్‌ సీటు రమేష్‌ రాథోడ్‌కే... 
కాంగ్రెస్‌ టికెట్టు హామీతోనే పార్టీలో చేరిన రమేష్‌ రాథోడ్‌కే ఖానాపూర్‌ సీటును ఖరారు చేశారు. దీం తో గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన హరి నాయక్‌ వర్గం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఈ మేరకు శుక్రవారం గాంధీభవన్‌ ముందు హరినాయక్‌కే టికెట్టు ఇవ్వాలని ఆయన మద్ధతుదారులు పెద్ద ఎత్తున ఆందోళన జరిపారు. 
∙నిర్మల్‌ నుంచి ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఆసిఫాబాద్‌ నుంచి ఆత్రం సక్కు ఇప్పటికే ఖరారైన విషయం తెలిసిందే. వారికే సీఈసీ ఆమోదముద్ర వేసింది. కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ ఖరారు చేసిన 74 మందిలో చివరి నిమిషంలో ఏవైనా మార్పులు జరిగితే తప్ప ఈ పేర్లనే శనివారం ప్రకటించనున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top