కొత్త సారథులు.. 

Telangana Congress DCC Presidents Adilabad - Sakshi

సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్‌: సార్వత్రిక ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ అధిష్టానం సంస్థాగతంగా పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు గురువారం నూతన అధ్యక్షులను నియమించింది. ఈ మేరకు పార్టీ అధినేత ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ కొత్త అధ్యక్షులను ప్రకటించారు. కాగా ఉమ్మడి ఆదిలాబాద్‌లో నాలుగు జిల్లాలకు కొత్త ముఖాలను ఎంపిక చేశారు. ఆదిలాబాద్‌ జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా యువ నాయకుడు భార్గవ్‌దేశ్‌పాండే, మంచిర్యాల జిల్లాకు కొక్కిరాల సురేఖ, నిర్మల్‌ జిల్లాకు పవార్‌ రామారావుపటేల్, కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాకు ఎమ్మెల్యే ఆత్రం సక్కును నియమించారు. ఉమ్మడి జిల్లాలో రెండు బలమైన వర్గాలుగా కొనసాగుతున్న ఏఐసీసీ సభ్యుడు ప్రేమ్‌సాగర్‌రావు, ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షుడు మహేశ్వర్‌రెడ్డి అనుచరులకే డీసీసీ అధ్యక్ష పదవులు దక్కాయి.

తూర్పున ‘కొక్కిరాల’ ఆధిపత్యం..
ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో శాసనసభ ఎన్నికల వరకు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అధ్యక్షుడిగా కొనసాగారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన పదవి నుంచి తప్పకున్నారు. అంతకు ముందు నుంచే కొత్త జిల్లాల వారీగా డీసీసీ అధ్యక్షుల   నియామకాలు ఉంటాయని కాంగ్రెస్‌ పెద్దలు చెబుతూ వచ్చారు. ఈ మేరకు గురువారం కొత్త అధ్యక్షుల పేర్లను ప్రకటించారు. ఇందులో తూర్పు ప్రాంతంలోని రెండు జిల్లాల్లో ప్రేమ్‌సాగర్‌రావు తన అధిపత్యం చాటుకోగా, పశ్చిమ ప్రాంతంలోని రెండు జిల్లాల్లో మహేశ్వర్‌రెడ్డి తన వర్గీయులకు అధ్యక్ష స్థానాలను ఇప్పించుకున్నారు.

మంచిర్యాల జిల్లా అధ్యక్షురాలిగా ప్రేమ్‌సాగర్‌రావు సతీమణి కొక్కిరాల సురేఖను నియమించారు. తాజా శాసనసభ ఎన్నికల్లో భర్త ప్రేమ్‌సాగర్‌రావు తరపున ఆమె విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. తన తర్వాత బలమైన లీడర్‌ లేకపోవడం, తన అధిపత్యాన్ని చాటుకోవడంలో భాగంగా ప్రేమ్‌సాగర్‌రావు భార్యకు డీసీసీ అధ్యక్ష పదవిని దక్కించుకున్నారు. ఇక తన అనుచరుడైన ఎమ్మెల్యే ఆత్రం సక్కును కుమురంభీం జిల్లాకు అధ్యక్షుడిగా నియమింపజేశారు. పార్టీ పరంగా తూర్పు జిల్లాల్లో తనకు ఎదురు లేదన్న విషయాన్ని చాటారు.

మాట నెగ్గించుకున్న ఏలేటి..
ఉమ్మడి ఆదిలాబాద్‌ పశ్చిమ ప్రాంతంలో తనకు పార్టీ పరంగా తిరుగు లేదని ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఈ నియామకాలతో చాటారు. శాసనసభ ఎన్నికల్లోనే పలువురు అనుచరులకు పార్టీ టికెట్లు దక్కకపోవడంతో ఆయన నిరాశ వ్యక్తం చేశారు. ఇప్పుడు పార్టీ పరంగా తన వాళ్లకు పదవులు దక్కేలా చేసుకున్నారు. ఆదిలాబాద్‌ జిల్లాలో పలువురు ప్రముఖ నాయకులు ఉన్నçప్పటికీ తన వర్గీయుడిగా కొనసాగుతున్న యువ నాయకుడు భార్గవ్‌దేశ్‌పాండేను డీసీసీ అధ్యక్షుడిగా నియమింపజేసుకున్నారు. తన సొంత జిల్లా నిర్మల్‌లో రామారావుపటేల్‌కు డీసీసీ పదవి దక్కేలా చేశారు. తాజా ఎన్నికల్లో ముథోల్‌ ఎమ్మెల్యేగా రామారావుపటేల్‌ పోటీ చేసి ఓడిపోయారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా భైంసాలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సభను విజయవంతం చేయడంలో  రామారావుపటేల్‌ కీలకంగా వ్యవహరించారు. మొదటి నుంచి ఏలేటి అనుచరుడిగానే ఆయన కొనసాగుతూ వస్తున్నారు. ఈ క్రమంలో పటేల్‌కు అధ్యక్ష పదవి దక్కేలా మహేశ్వర్‌రెడ్డి సఫలీకృతులయ్యారు.

నలుగురూ కొత్త వాళ్లే..
కాంగ్రెస్‌ పార్టీ ఆదిలాబాద్‌తో పాటు మూడు కొత్త జిల్లాలకు కొత్త వాళ్లనే అధ్యక్షులుగా నియమించింది. తాజా ఎన్నికల్లో ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే టికెట్‌ను ఆశించిన భార్గవ్‌దేశ్‌పాండేకు నిరాశ ఎదురైంది. అక్కడ గండ్రత్‌ సుజాతకు ఎమ్మెల్యే టికెట్‌ దక్కింది. దీంతో భార్గవ్‌కు పార్టీ పరంగా ప్రస్తుతం అధ్యక్ష పదవిని ఇచ్చి సమన్యాయం చేశారు. ఎన్‌ఎస్‌యూఐ నుంచి ప్రస్థానం ప్రారంభించి పార్టీ జిల్లా అధ్యక్ష స్థాయి వరకు భార్గవ్‌ ఎదిగారు. సేవా కార్యక్రమాలతో ముథోల్‌ నియోజకవర్గ ప్రజలకు చేరువైన రామారావుపటేల్‌ గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. నియోజకవర్గ బాధ్యతలను చూసుకున్నప్పటికీ పార్టీ పరంగా పదవులను చేపట్టలేదు. ఇప్పుడు ఏకంగా జిల్లా అధ్యక్ష పదవిని పొందారు. మంచిర్యాల అధ్యక్షురాలిగా నియమితులైన సురేఖ పూర్తిగా తన భర్త ప్రేమ్‌సాగర్‌రావు వెంటే ఉంటూ పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్నారు.

తమ ట్రస్టు ఆధ్వర్యంలో ఇఫ్తార్‌ విందులు, బతుకమ్మ చీరల పంపిణీ, తదితర కార్యక్రమాలను నిర్వహించారు. గత ఎన్నికల్లోనూ హస్తం గుర్తును ప్రజల్లోకి   తీసుకెళ్లడంలో విశేషంగా పనిచేశారు. ఇక కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా అధ్యక్షుడిగా నియమితుడైన ఆత్రం సక్కు ప్రేమ్‌సాగర్‌రావుకు ప్రధాన అనుచరుడు. 2009 ఎన్నికల్లో కొక్కిరాల సహకారంతో సక్కు తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తాజా ఎన్నికల్లోనూ ఆయన అండతోనే గెలిచి ఉమ్మడి జిల్లాలోనే పార్టీకి ఏకైక స్థానాన్ని అందించారు. పార్టీ తమను డీసీసీ అధ్యక్షులుగా నియమించడంపై నలుగురూ హర్షం వ్యక్తం చేశారు. తమ జిల్లాల్లో క్షేత్రస్థాయి నుంచి పార్టీకి పూర్వవైభవంగా తీసుకువస్తామని, పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధించేలా కృషి చేస్తామని వారు పేర్కొన్నారు. 

భార్గవ్‌ దేశ్‌పాండే ఇది వరకు చేపట్టిన పదవులు 
ఆదిలాబాద్‌అర్బన్‌: భార్గవ్‌ దేశ్‌పాండే 2006 నుంచి 2008 వరకు దాదాపు రెండేళ్ల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేశారు. అనంతరం ఏఐసీసీ సభ్యులుగా, ఆదిలాబాద్‌ నియోజకవర్గ ఇన్‌చార్జిగా కొనసాగారు. 2014లో ఆదిలాబాద్‌ నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేశారు. 2018 డిసెంబర్‌లో జరిగిన ఎన్నికల్లో టీపీసీసీ కార్యదర్శి గండ్రత్‌ సుజాతకు ఎమ్మెల్యే టికెట్‌ దక్కడంతో పార్టీని గెలిపించుకునేందుకు భార్గవ్‌ దగ్గరుండి సేవలందించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top