సీఏఏ, ఎన్‌ఆర్‌సీలపై కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు

Telangana Budget Sessions CM KCR Speech On CAA - Sakshi

సీఏఏ, ఎన్‌ఆర్‌సీలపై అనేక అనుమానాలు

వివాదాస్పద చట్టాలపై సభలో చర్చిస్తాం : సీఎం కేసీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ శనివారం సభలో కీలక ప్రసంగం చేశారు. దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన వివాదాస్పద చట్టాలు సీఏఏ, ఎన్‌ఆర్‌సీలపై కేసీఆర్‌ సభలో ప్రస్తావించారు. వీటిపై పౌరులంతా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారని, దేశ వ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. సీఏఏపై అనేక అనుమానాలు ఉన్నాయని, వీటిపై ఓ రోజంతా సభలో చర్చించి తీరుతామని సీఎం అసెంబ్లీలో ప్రసంగించారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తనకే బర్త్‌ సర్టిఫికెట్‌ లేదని, ఇక సామన్య ప్రజలకు ఏం ఉంటుందని కేంద్రాన్ని ప్రశ్నించారు. ఇలాంటి చట్టాలపై దేశ వ్యాప్తంగా సుధీర్ఘ చర్చ జరగాలన్నారు. రాష్ట్రంలోని అన్ని పార్టీలు ఈ చట్టాలపై తమ అభిప్రాయాలను వెల్లడించాలని సీఎం కోరారు.

కాంగ్రెస్‌ సభ్యల సస్పెండ్‌..
ఇక చర్చలో భాగంగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిప్పులు చెరిగారు. శాసనసభలో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చకు సీఎం కేసీఆర్‌ సమాధానం చెబుతున్న సమయంలో కాంగ్రెస్‌ సభ్యులు అడ్డుపడ్డారు. దీంతో కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డిపై సీఎం కేసీఆర్‌ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సభలో ఇష్టమొచ్చినట్లు అరవడం సరికాదు అని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. సభకు ఆటంకం కలిగించే చర్యలను సహించమని కేసీఆర్‌ తేల్చిచెప్పారు. సభలో ఎవరు అరాచకం చేస్తున్నారో స్పష్టంగా కనబడుతుందని సీఎం పేర్కొన్నారు. అసెంబ్లీకి ఒక పద్ధతి ఉంటుందని.. దాని ప్రకారం నడుచుకోవాల్సిన బాధ్యత సభ్యులందరిపై ఉందని హితవు పలికారు. సభలో ఇష్టమొచ్చినట్లు అరిచి, అరాచకం సృష్టిస్తే కుదరదు అని విపక్ష సభ్యులను కేసీఆర్‌ హెచ్చరించారు.

ఏదో ఒక విధంగా బయటకు వెళ్లాలనేది కాంగ్రెస్‌ సభ్యుల గొడవ.. అందుకే అరుస్తున్నారని సీఎం పేర్కొన్నారు. సభకు ఆటంకం కలిగించిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి ప్రశాంత్‌ రెడ్డికి సీఎం సూచించారు. దీంతో ఆరుగురు సభ్యులను సభ నుంచి ఒక రోజు పాటు సస్పెండ్‌ చేశారు. దీనిపై విపక్ష నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సభలో ప్రతిపక్షాన్ని లేకుండా చూడాలని సీఎం ప్రయత్నిస్తున్నాంటూ సీఎల్పీ నేత మల్లుభట్టి విక్రమార్క విమర్శించారు.

ఎన్నిక ఏదైనా.. విజయం మాదే
కాంగ్రెస్‌ సభ్యుల అసత్య ఆరోపణలను ఆపడానికే వారిని సభ నుంచి సస్పెండ్‌ చేశామని సీఎం స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమాన్ని కాంగ్రెస్‌ పార్టీ నీరుకార్చే ప్రయత్నం చేసిందని, ఉద్యమకారులపై కేసుల పెట్టిన చరిత్ర ఆ పార్టీ అని నిప్పులు చెరిగారు. అన్ని పార్టీలను ఏకంచేసిన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించామని అన్నారు. ఏ ఎన్నికలు వచ్చినా.. ప్రజలంతా టీఆర్‌ఎస్‌ పక్షాణే నిలుస్తున్నారని అన్నారు. ప్రతి ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ పార్టీ ఎందుకు ఓడిపోతుందో ఆ పార్టీ నేతలు ఆత్మపరిశీలన చేసుకోవాలని సీఎం హితవుపలికారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top