కోమటిరెడ్డి, సంపత్‌ల సభ్యత్వాలు రద్దు

Telangana Assembly Speaker Suspended Several Congress Members - Sakshi

ప్రతిపక్షనేత జానా సహా 11 మందిపై వేటు

తీర్మానాన్ని ఆమోదించిన అసెంబ్లీ

సాక్షి, హైదరాబాద్‌ : బడ్జెట్‌ సమావేశాల తొలిరోజు అసెంబ్లీలో నిరసనకు దిగిన కాంగ్రెస్‌ పార్టీ సభ్యులకు గట్టి షాక్‌ తగిలింది. బడ్జెట్ సమావేశాల తొలిరోజున ఉభయ సభల సంయుక్త సమావేశంలో గవర్నర్ నరసింహన్ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ సభ్యులు పోడియం వద్దకు చేరుకుని నినాదాలతో నిరసనకు దిగారు. అందులో భాగంగా ప్లకార్డులు ప్రదర్శించడమే కాకుండా కాగితాలను చించి పోడియం వైపు విసిరారు. ఆ ప్రయత్నంలో సభ్యుడు కోమటిరెడ్డి వేదికపైకి హెడ్‌సెట్‌ విసిరిన సంగతి తెలిసిందే. మంగళవారం సభ ప్రారంభమైన తర్వాత సోమవారం కాంగ్రెస్ సభ్యులు ప్రవర్తించిన తీరును తప్పుబట్టారు. వాటిని క్షమించరాని ఘటనగా స్పీకర్‌  పేర్కొన్నారు. సభా మర్యాదలు మంటగలిపే చర్యలకు పాల్పడిన కారణంగా కాంగ్రెస్ కు చెందిన మొత్తం 11 మంది సభ్యులపై వేటు వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.  ఈ ఘటనలకు సంబంధించి శాసన మండలిలోనూ ఐదుగురు సభ్యులపై వేటు పడింది.

కోమటిరెడ్డి, సంపత్‌ల సభ్యత్వం రద్దు :  క్రమశిక్షణ చర్య కింద 11 మంది కాంగ్రెస్‌ సభ్యులపై చర్యలు తీసుకుంటున్నట్లు స్పీకర్‌ మధుసూదనాచారి చెప్పారు. ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్  శాసనసభ సభ్యత్వాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. అంతకుముందు సోమవారం ఘటనలను నిరసిస్తూ సంబంధిత సభ్యులపై చర్యలు కోరుతూ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ప్రవేశపెట్టిన తీర్మానానికి సభ ఆమోదం తెలిపింది. కోమటిరెడ్డి, సంపత్ కుమార్ ల సభ్యత్వం రద్దు చేయగా మిగిలిన సభ్యులపై బడ్జెట్‌ సమావేశాలు ముగిసేవరకు సస్పెన్షన్‌ వర్తిస్తుందని స్పీకర్‌ తెలిపారు.

సస్పెండైన ఎమ్మెల్యేలు వీరే : స్పీకర్‌ సస్సెండ్‌ చేసిన కాంగ్రెస్‌ సభ్యుల్లో ప్రతిపక్ష నేత జానారెడ్డి, ఉపనేత జీవన్‌రెడ్డి, టీపీసీసీ చీఫ్‌ ఉత్తం కుమార్‌రెడ్డి, గీతారెడ్డి, చిన్నారెడ్డి, డీకే అరుణ, భట్టి విక్రమార్క, రామ్మోహన్‌రెడ్డి, వంశీచంద్‌రెడ్డి, పద్మావతిరెడ్డిలు ఉన్నారు. మాధవరెడ్డి కాంగ్రెస్‌ అనుబంధ సభ్యుడిగా కొనసాగుతున్నారు.

మండలిలోనూ : సోమవారంనాటి దాడి ఘటనకు సంబంధించి శాసన మండలిలోనూ సస్సెన్షన్‌ నిర్ణయాలు జరిగాయి. మండలిలో కాంగ్రెస్‌ పక్షనేత షబ్బీర్‌ అలీతోపాటు పొంగులేటి సుధాకర్‌రెడ్డి, ఆకుల లలిత, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, దామోదర్‌రెడ్డిలను సస్సెండ్‌ చేస్తున్నట్లు ఉప సభాపతి నేతి విద్యాసాగర్‌  ప్రకటించారు. బడ్జెట్‌ సమావేశాల వరకే వీరిపై సస్పెన్షన్‌ ఉంటుందని పేర్కొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top