పాసవుతామా..!

Telangana Assembly Elections TRS MLAS  Ranga Reddy - Sakshi

జనామోదం ఉన్నవారికే టికెట్లు ఇస్తామని టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ చేసిన ప్రకటన ఆ పార్టీ ఎమ్మెల్యేలలో గుబులు రేకెత్తిస్తోంది. 2014లో అధికారం చేపట్టనప్పటి నుంచి ఇప్పటివరకు తొమ్మిదిసార్లు సర్వే నిర్వహించిన ముఖ్యమంత్రి.. శాసనసభ్యుల పనితీరుపై ప్రజాభిప్రాయాన్ని సేకరించారు. సర్వే ఫలితాలను ఎమ్మెల్యేలకు వివరిస్తూ పనితీరులో వెనుకబడ్డవారికి క్లాస్‌ తీసుకుంటున్నారు. అలాగే పాస్‌మార్కులకు దగ్గరగా ఉన్నవారికి పలు సూచనలు చేస్తున్నారు.  ఏయే నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి ఏమిటి? శాసనసభ్యుడి పనితీరు పట్ల ప్రజాభిప్రాయం ఎలా ఉంది? ప్రభుత్వ పాలన, సంక్షేమ, అభివృద్ధి పథకాలపై ప్రజానాడి ఎలా ఉంది? అనేది విశ్లేషించనున్నారు. దీనికి అనుగుణంగా లభించే మార్కుల మేరకు అభ్యర్థిత్వాలు ఖరారయ్యే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ఎమ్మెల్యేల పనితీరుపై, ఆయా నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్నారు. సామాజికవర్గాల వారీగా ప్రజల మనోగతం తెలుసుకుంటున్న ముఖ్యమంత్రి.. ప్రైవేటు ఏజెన్సీల నుంచే కాకుండా నిఘా వర్గాలు ఇచ్చే సమాచారాన్ని కూడా క్రోడీకరించుకుంటున్నారు. దీనికి అనుగుణంగానే మూడు నెలలకోసారి శాసనసభాపక్ష సమావేశం నిర్వహిస్తూ సర్వే ఫలితాలను వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలోనే 2019 ఎన్నికల జట్టు కూర్పుపై కసరత్తు చేస్తున్న గులాబీ అధిష్టానం  చివరి సర్వేను వారం రోజుల్లో ప్రకటించే దిశగా ఆలోచన చేస్తోంది. వాస్తవానికి ఈ నెల 17న ఎంపీ, ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించి ప్రోగ్రెస్‌ రిపోర్టును విడుదల చేయాలని నిర్ణయించింది. అయితే, మాజీ ప్రధాని అటల్‌ బిహారి వాజ్‌పేయి మరణంతో ఈ సమావేశాన్ని రద్దుచేసింది.

 
‘ముందస్తు’ సంకేతాలతో.. 
షెడ్యూల్‌ కంటే ముందుగానేఎన్నికలకు వెళ్లాలని సీఎం కేసీఆర్‌ యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల జరిగిన విలేకర్ల సమావేశంలో ఈ తరహా సంకేతాలివ్వడం.. సెప్టెంబర్‌ నెలలోనే 80శాతం టికెట్లను ప్రకటిస్తామనడంతో పొలిటికల్‌ హీట్‌ పెరిగింది. అంతేగాకుండా సెప్టెంబర్‌ 2న ప్రగతి నివేదన సభ నిర్వహించాలని నిర్ణయించడం.. 25 లక్షల మందితో ఈ సభ జరపాలని భావిస్తుండడం చూస్తే ఈ బహిరంగ సభలోనే ఎన్నికల శంఖారావం పూరించనున్నట్లు తెలుస్తోంది. ఇదే సభలో మెజార్టీ టికెట్లను ప్రకటిస్తామని చేసిన ప్రకటన అధికార పార్టీలో ఉత్కంఠను రేకెత్తిస్తోంది. డిసెంబర్‌లోపు శాసనసభ ఎన్నికలను పూర్తిచేయడమే లక్ష్యంగా పావులు కదుపుతుండడం.. నియోజకవర్గాలకే పరిమితం కావాలని ఎమ్మెల్యేలకు సూచిస్తుండడంతో గులాబీ దళంలో ఆసక్తి రేపుతోంది. ఈ నేపథ్యంలో పెండింగ్‌ పనులను పూర్తిచేసేందుకు ప్రజాప్రతినిధులు యంత్రాంగంపై ఒత్తిడి పెంచారు. ఎన్నికల క్షేత్రంలోకి వెళ్లనున్నందున ప్రజావ్యతిరేకత రాకుండా జాగ్రత్త పడుతున్నారు.

ఫైనల్‌ సర్వే ఇదే..? 
త్వరలో జరుగనున్న శాసనసభాపక్ష సమావేశంలో సర్వే వివరాలను ముఖ్యమంత్రి వెల్లడించే అవకాశముంది. ముందస్తు ఎన్నికలకు వెళ్లిన పక్షంలో ఇదే సర్వే కానుంది. ఇప్పటికే వివిధ మార్గాల ద్వారా ప్రజాభిప్రాయం సేకరించిన ముఖ్యమంత్రి.. ఫలితాలను మదింపు చేశారు. దీనికి అనుగుణంగా ఆయా నియోజకవర్గాల రాజకీయ భవిష్యత్తును నిర్దేశించనున్నారు. ఈ సర్వేలో మెరుగైన ఫలితాలు కనబరిచిన వారి టికెట్లకు ఢోకాలేకున్నా వెనుకబడ్డవారికి రిక్తహస్తమే మిగలనుంది. సర్వే నివేదిక ఆధారంగా ఏయే నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి బాగుంది? శాసనసభ్యుడి పనితీరు పట్ల ప్రజాభిప్రాయం ఎలా ఉంది? ప్రభుత్వ పాలన ముఖ్యమంత్రి సంక్షేమ, అభివృద్ధి పథకాలపై ప్రజా నాడి ఎలా ఉంది? అనేది విశ్లేషించనున్నారు.

దీనికి అనుగుణంగా లభించే మార్కుల మేరకు అభ్యర్థిత్వాలు ఖరారయ్యే ఛాన్స్‌ ఉందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ పాస్‌ మార్కులు కూడా లభించని శాసనసభ్యులకు టికెట్టు ఎందుకు నిరాకరించదలిచామో విడమరిచి చెప్పే అవకాశంలేకపోలేదని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో 11 మంది ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. వీరి అభ్యర్థిత్వాలపై మరో నెల రోజుల్లో క్లారిటీ రానుంది. ఈ వారంలో జరిగే ఎల్‌పీ మీటింగ్‌ వచ్చే ఎన్నికలకు నాంది పలికే అవకాశం కనిపిస్తోంది. ఎందుకు ముందుగా రణక్షేత్రంలోకి వెలుతున్నామనే అంశంపై కూడా స్పష్టత ఇచ్చే వీలుంది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top