రండి బాబూ చేరండి..! | tdp offers for Membership Registration | Sakshi
Sakshi News home page

రండి బాబూ చేరండి..!

Nov 30 2014 2:23 AM | Updated on Sep 2 2017 5:21 PM

రండి బాబూ చేరండి..!

రండి బాబూ చేరండి..!

ఒకప్పుడు తెలుగేదేశం పార్టీకి కంచుకోట అయిన జిల్లాలో ప్రస్తుత పరిస్థితి మునిగిన నావలా తయారైంది.

సాక్షి, మంచిర్యాల: ఒకప్పుడు తెలుగేదేశం పార్టీకి కంచుకోట అయిన జిల్లాలో ప్రస్తుత పరిస్థితి మునిగిన నావలా తయారైంది. తెలంగాణపై చంద్రబాబు వైఖరి నేపథ్యంలో జిల్లాలో సుమారుగా ఆ పార్టీ ఖాళీ అయ్యింది. ఇక.. తాజాగా జిల్లాలో పట్టుకోసం పాకులాడుతోంది. మరో నాలుగేళ్ల వరకు ఎన్నికలు లేవని తెలిసినా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో అన్నివర్గాలనూ ఆకట్టుకోవాలని విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఇందుకు ఆఫర్ల మీద ఆఫర్లను ప్రకటించేసింది.

పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించే కార్యకర్తలకు రూ.2 లక్షల ప్రమాద బీమాతోపాటు వైద్య పరీక్షలకు రూ.50 వేల వరకు రీయింబర్స్‌మెంట్, అంగవైకల్యం, పిల్లల వైద్య సంక్షేమ బీమా ప్రయోజనాలు కల్పిస్తామంటూ ఆ పార్టీ నాయకులు ప్రచారానికి తెరలేపారు. మంచిర్యాలలో ఏకంగా కరపత్రాల పంపిణీ, ఆటోల ద్వారా విసృ్తత ప్రచారం కొనసాగిస్తున్నారు. అయితే.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు వ్యవహరించిన రెండు కళ్ల సిద్ధాంతాన్ని ఇది వరకే  అర్థం చేసుకున్న ప్రజలు ఆ పార్టీ సభ్యత్వాలు తీసుకునేందుకు ముందుకురావడం లేదని ఇతర పార్టీల నేతలు విమర్శిస్తున్నారు. జిల్లాలో నత్తనడకన సాగుతున్న పార్టీ సభ్యత్వ ప్రక్రియే దీనికి నిదర్శనమంటున్నారు. మరోపక్క.. పలు ప్రాంతాల ప్రజలు పార్టీలో చే రుతుంటే.. ముందుండి సభ్యత్వం చేయిస్తున్న ఆ పార్టీ మండల, నియోజకవర్గ నాయకుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అసలు ఈ ఆఫర్లు తదుపరి అమలులోకి వస్తాయా అంటూ గుసగుసలాడుతున్నారు.

నత్తనడకన సభ్యత్వం..!
ఈ నెల మూడో తేదీ నుంచి జిల్లాలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమైంది. వచ్చే నెల ఐదో తేదీ వరకు కొన సాగించాలని టీడీపీ నిర్ణయించింది. పార్టీ సభ్యత్వ నమోదును ఆన్‌లైన్ చేసే బాధ్యతను ‘ఐటీ గ్రిడ్’ అనే సాఫ్ట్‌వేర్ సంస్థకు అప్పగించింది. ఈ సాఫ్ట్‌వేర్ సంస్థ.. కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న యువకులకు శిక్షణ ఇచ్చి మండలానికొకరి చొప్పున జిల్లాకు పంపింది. ప్రస్తుతం అన్ని మండల కేంద్రాల్లో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం కొనసాగుతోంది. పార్టీ అధిష్టానం ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి 4 వేల సభ్యత్వ నమోదు టార్గెట్ పెట్టగా.. ఇప్పటి వరకు ఏ నియోజకవర్గంలోనూ రెండు వేలు దాటలేదు.

మంచిర్యాల నియోజకవర్గంలో రెండు వేల మంది పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. ఎన్నికల ముందు జరిగిన సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో జిల్లాలో పార్టీ సభ్యత్వ నమోదు లక్ష్యం 50 వేలపైనే ఉండేది. కానీ.. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఈసారి కేవలం 25 వే లే చాల నుకున్నారు. అయినా.. 26 రోజుల్లో జిల్లావ్యాప్తంగా 10 వేల మంది మాత్రమే పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. ఈ క్రమంలో పార్టీ సభ్యత్వ నమోదు గడువు ఇంకా పెంచాలని పార్టీ నాయకులు అధిష్టానాన్ని కోరారు. దీంతో అధిష్టానమూ వచ్చే నెలాఖరు వరకు గడువు పెంచే ఆలోచనలో ఉందని మంచిర్యాల నియోజకవర్గ ఇన్‌చార్జి కొండేటి సత్యం చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement