ఆ లెక్కే వేరబ్బా..!

TDP Candidate Home Guards Corrections Chittoor - Sakshi

‘‘తిరుపతి రవాణా శాఖ కార్యాలయంలో పనిచేసే ఓ హోంగార్డుపై అవినీతి ఆరోపణలు రావడంతో అతన్ని మాతృశాఖకు పంపుతూ ఉప రవాణా కమిషనర్‌ (డీటీసీ) నెల రోజుల క్రితం ఆదేశాలు జారీ చేశారు. కానీ నెలగా ఆయన రవాణా శాఖ చెక్‌పోస్టులో విధులు నిర్వహిస్తున్నాడు. ఇటీవల వేతనాలు చెల్లించే బిల్లులో హోంగార్డు చిత్తూరులో పనిచేస్తుండడాన్ని గుర్తించిన కమిషనర్‌ షాక్‌కు గురయ్యారు.’’

‘‘నిత్యం ఖద్దరు దుస్తుల్లో కనిపించే గంగాధరనెల్లూరుకు చెందిన ఓ టీడీపీ నేత ఇటీవల ఎంపికైన ఓ హోంగార్డుకు చిత్తూరు రవాణా శాఖ కార్యాలయంలో పోస్టింగ్‌ వేయిం చాడు. వాహన తనిఖీ అధికారి(ఎంవీఐ)తో పాటు ఉండే ఆ హోంగార్డు అధికారులు లేని సమయంలో ఎంవీఐ వాహనం తీసుకెళ్లి జాతీయ రహదారుల్లో వాహనాలు ఆపుతూ దోపిడీకి పాల్పడుతున్నాడు. టీడీపీ నేత రెకమెండేషన్‌ కావడంతో అధికారులు ఏమీ చేయలేని పరిస్థితి’’

చిత్తూరు అర్బన్‌: రోడ్లపై నిలబడి ట్రాఫిక్‌ చూడడం, అధికారులకు టీ కాఫీలు తెచ్చివ్వడం, రాత్రి గస్తీలకు వెళ్లడం ఇష్టపడని కొందరు హోంగార్డులు వారి పలుకుబడి ఉపయోగించి జిల్లా రవాణా శాఖలోనే పనిచేయడానికే ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం సామ, భేద, దండోపాయాలను ఉపయోగిస్తున్నారు. అవసరమైన చోట డబ్బు ఇవ్వడం.. డబ్బులు పనిచేయని చోట అధికార పార్టీ నేతల ద్వారా పోస్టింగులు వేయించుకోవడం చేస్తున్నారు. ఇంతగా రవాణా శాఖలో పోస్టింగులు వేయించుకోవడానికి కారణాలు ఏమిటి..? అసలు రవాణా శాఖే కావాలని ఎందుకు పట్టుపడుతున్నారు..? ఇక్కడ హోంగార్డులు చేసే పనులేమిటి..? ఏంచేస్తున్నారో.. మీరే చదవండి.

ఇవీ విధులు..
పోలీసు శాఖలాగే హోంగార్డులకు సైతం పనిగంటల్లో పరిమితి ఉండదు. అయితే శాంతి భద్రతలు, ట్రాఫిక్, ఇతర విభాగాల్లో పనిచేసే హోంగార్డులకు షిప్టు పద్ధతిలో అధికారులు విధులు కేటాయిస్తుం టారు. పోలీసు శాఖలోని హోంగార్డులకు రవాణా శాఖలో విధులు కేటాయించే బాధ్యత చిత్తూరు, తిరుపతిలోని హోంగార్డు విభాగ అధికారులు చూస్తుంటారు. రవాణా శాఖకు అటాచ్‌మెంట్‌ చేసిన హోంగార్డులు డీటీసీ, ఆర్టీఓ, ఎంవీఐ, ఏఎంవీఐ అధికారుల వద్ద పనిచేయాలి. అధికారులు తనిఖీలకు వెళ్లినప్పుడు రాత్రయినా సరే వెళ్లాల్సిందే. నెలమొత్తం పనిచేసిన హోంగార్డు ఎవరి వద్ద పనిచేశారో తెలిపే డ్యూటీ సర్టిఫికెట్‌ను చిత్తూరులోని డీటీసీ కార్యాలయంలో అందజేయాలి.

చేస్తున్న పనులు ఇలా..
జిల్లాలో చిత్తూరు, తిరుపతి రవాణా శాఖ కార్యాలయంతో పాటు ఐదు చోట్ల యూనిట్, ఎంవీఐ కార్యాలయాలు, మూడు చెక్‌పోస్టులున్నాయి. ఇద్దరు ఆర్టీఓలతో పాటు 32 మంది ఎంవీఐల వద్ద 32 మంది హోంగార్డులుగా పనిచేస్తున్నారు. వీరికి ప్రతినెలా డ్యూటీ సర్టిఫికెట్‌ చూసి ఒక్కొక్కరికి నెలకు రూ.18 వేల జీతాన్ని రవాణా శాఖ చెల్లిస్తోంది. రవాణా శాఖలో పనిచేయడానికి చాలామంది హోంగార్డులు డబ్బులిచ్చి పోస్టింగులు వేయించుకుంటున్నారనే విమర్శలున్నాయి. కొందరు ఎంవీఐలు తనిఖీల సమయంలో అవినీతి కార్యకలాపాలకు పాల్పడడాన్ని హోంగార్డులు ప్రత్యక్షంగా చూస్తూ అక్రమ మార్గాల్లో సంపాదనపై దృష్టి పెడుతున్నారు.

చిత్తూరులోని ఓ ఎంవీఐ వద్ద పనిచేసే హోంగార్డు ఎంవీఐ వాహనం తీసుకెళ్లి గ్రానైట్‌ రాళ్లు తీసుకెళ్లే లారీల వద్ద డబ్బు వసూలు చేస్తూ దొరికిపోయినా దీన్ని బయటకు పొక్కనీయకుండా అధికారులు మందలించి సర్దుబాటు చేసేశారు. ఇక కూడళ్లు ఉన్న రోడ్లు, జాతీయ రహదారులు, చెక్‌పోస్టుల్లో ఓవైపు ఎంవీఐలు దందాలు చేస్తుంటే, పక్కనే మరోవైపు హోంగార్డులు మామూళ్లు వసూలు చేస్తుంటారు. ఎన్‌ఆర్‌ పేట, పలమనేరు, రేణిగుంట చెక్‌పోస్టుల్లో ఈ చిత్రాలు నిత్యం కనిపిస్తూనే ఉంటాయి.

కొందరు హోంగార్డుల్లో రోజుకు రూ.10 వేలు సంపాదించే వాళ్లు కూడా ఉన్నారని బహిరంగ ఆరోపణలున్నాయి. ఇంత ఆదాయం వస్తున్న రవాణా శాఖలో పోస్టింగ్‌ కోసం తొలుత రూ.30 వేల నుంచి రూ.50 వేలను ఇవ్వడానికి ఏమాత్రమూ వెనుకాడడం లేదు. హోంగార్డు విభాగంలో పనిచేసే ఒకరిద్దరు అధికారుల నుంచి పర్యవేక్షణ చూసే సిబ్బంది వరకు మామూళ్లు ఇస్తూ ఏళ్ల తరబడిగా రవాణా శాఖలో పాతుకుపోయారు. కొందరు ఎంవీఐలు హోంగార్డులను సొంత పనులకు ఉపయోగించుకుంటుండటంతో అధికా రుల బలహీనతను హోంగార్డులు పసిగట్టేసి సొంతంగా తనిఖీలకు సైతం వెళ్లే స్థాయికి చేరుకున్నారనే ఆరోపణలున్నాయి. 

మార్చమని చెబుతున్నాం..
తిరుపతిలో ఓ హోంగార్డును వద్దని ఆపేస్తే అతను మా చెక్‌పోస్టులోనే పనిచేస్తున్నట్లు గుర్తించాం. జీతం ఆపేసి, అతన్ని వెనక్కు పంపాం. ఆర్నెల్లపాటు హోంగార్డు మా వద్ద పనిచేస్తే బ్యాచ్‌ల వారీగా రొటేట్‌ చేయమని పోలీసులకు రాస్తున్నాం. మా ఎంవీఐలు ఎక్కడైనా హోంగార్డులను మిస్‌యూస్‌ చేస్తుంటే ఫిర్యాదు చేయండి. యాక్షన్‌ తీసుకుంటాం. – సీహెచ్‌.ప్రతాప్, ఉప రవాణా కమిషనర్‌ 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top