గుడిసెలు లేని రాష్ట్రమే లక్ష్యం | target of without huts state:swamy goud | Sakshi
Sakshi News home page

గుడిసెలు లేని రాష్ట్రమే లక్ష్యం

Jul 29 2014 1:10 AM | Updated on Aug 17 2018 2:53 PM

ఏ ఒక్కరూ గుడిసెల్లో నివసించకుండా అందరికీ పక్కా గృహాలు కల్పించాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని, అందుకు అనుగుణంగా ప్రణాళిక తయారు చేయాలని శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ అన్నారు.

 ఆదిలాబాద్ టౌన్/ఆదిలాబాద్ అర్బన్ : ఏ ఒక్కరూ గుడిసెల్లో నివసించకుండా అందరికీ పక్కా గృహాలు కల్పించాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని, అందుకు అనుగుణంగా ప్రణాళిక తయారు చేయాలని శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ అన్నారు. ఇప్పటికీ జిల్లాలో 92వేల మంది గుడిసెల్లో జీవిస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతోందని తెలిపారు. సోమవారం స్థానిక జెడ్పీ సమావేశ మందిరంలో జిల్లా పరిషత్ సరసభ్య సమావేశం జరిగింది.

 జెడ్పీ చైర్‌పర్సన్ వల్లకొండ శోభారాణి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ‘మన జిల్లా-మన ప్రణాళిక’పై చర్చించారు. ముఖ్య అతిథులుగా శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్‌తోపాటు రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వామిగౌడ్ మాట్లాడుతూ గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం అమలు కోసం ప్రభుత్వం మన ఊరు-మన ప్రణాళిక, మన జిల్లా-మన ప్రణాళిక రూపొందించిందని తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో ఉన్న పిల్లల ఆరోగ్య పరిస్థితులు బాగా లేకుంటే వారిని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు చైల్డ్ మొబైల్ కేర్ వ్యాన్‌ను ఏర్పాటు చేస్తే బాగుంటుందని పేర్కొన్నారు.

 జిల్లాను పర్యాటక ప్రాంతంగా మార్చుకుంటే రెండో కాశ్మీర్‌గా రూపొందుతుందని తెలిపారు. ఉచిత నిర్బంధ విద్యను పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కొమురంభీం పోరాట స్మృతిని గుర్తు చేసుకునేందుకు భవనం ఏర్పాటు కోసం ప్రణాళిక రూపొందించుకోవాలని అన్నారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో మరుగుదొడ్లను ఏర్పాటు చేసుకోవాలని, ప్రజాప్రతినిధులు ప్రభుత్వ ఉద్యోగులతో స్నేహభావంతో మెలగాలని తెలిపారు.

 ఆదిలాబాద్, పెద్దపల్లి ఎంపీలు గొడం నగేష్, బాల్క సుమన్, ఎమ్మెల్సీలు, ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు హాజరయ్యారు. జిల్లాతో పాటు ఆయా నియోజకవర్గాల సమస్యలను సమావేశంలో గళమెత్తారు. జిల్లాను అభివృద్ధి పథంలో నడిపేందుకు ప్రణాళికలు రూపొందించి ప్రభుత్వానికి అందించాలని మంత్రికి, జెడ్పీ చైర్ పర్సన్‌కు విన్నవించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement