నా తెలంగాణ ప్రగతికి చిరునామా

Tamilisai Soundararajan Speech In Assembly Over Telangana Budget - Sakshi

దేశమంతా అబ్బురపడేలా అభివృద్ధి కార్యక్రమాలు

దుర్భర స్థితి నుంచి సర్వతోముఖాభివృద్ధి వైపు పయనం

ప్రజావిశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ పునర్నిర్మాణ యజ్ఞం

ప్రజావసరాలే ప్రాతిపదికగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు

త్వరలోనే 57 ఏళ్లు నిండిన వారందరికీ పెన్షన్లు

రాష్ట్రంలో సరికొత్తగా భూపరిపాలన విధానం

ఉభయ సభలనుద్దేశించి గవర్నర్‌ తమిళిసై ప్రసంగం

సాక్షి, హైదరాబాద్‌: ఆరు దశాబ్దాలపాటు పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రజల అవసరాలే ప్రాతిపదికగా ప్రభుత్వ పాలన కొనసాగుతోందని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ పేర్కొన్నారు. రాష్ట్ర బడ్జెట్‌ సమావేశాల ప్రారంభం సందర్భంగా శుక్రవారం ఉభయ సభలను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. 

వణక్కం.. నమస్కారం 
రాష్ట్ర గవర్నర్‌గా నియమితులయ్యాక మొదటిసారిగా ఉభయసభలకు హాజరైన తమిళిసై.. తమిళంలో వణక్కం అని, తెలుగులో నమస్కారం అని సభ్యులకు అభివాదం చేసి ఆ తరువాత ఆంగ్లంలో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. రాష్ట్రాన్ని సాధించుకున్న అనతికాలంలోనే అనేక రంగాల్లో తెలంగాణ అద్భుత ప్రగతిని సాధించిందన్నారు. రాష్ట్రం ఏర్పడిన నాటి పరిస్థితులతో పోల్చుకుంటే తక్కువ వ్యవధిలో సాధించిన ప్రగతిని చూసి దేశమంతా అబ్బురపడటం గర్వకారణమన్నారు. 2014 జూన్‌ 2 నాటికి ముందున్న దుర్భర పరిస్థితులను దూరం చేసుకుంటూ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి వైపు పయనిస్తోందన్నారు. ఉద్యమ నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు సారథ్యంలో ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం మధ్య సమతౌల్యత పాటిస్తూ ముందుకు సాగుతోందన్నారు. రాష్ట్రంలోని వనరులు, వసతులు, అవసరాలు, అనుకూలతలు, ప్రతికూలతలు, బలాలు, బలహీనతలన్నింటినీ అంచనా వేసుకొని స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికల వంటి మూడంచెల ప్రణాళికలను రూపొందించుకొని రాష్ట్ర పునర్నిర్మాణ యజ్ఞాన్ని ప్రభుత్వం ప్రారంభించిందన్నారు.

అందుకే సందర్భం వచ్చిన ప్రతిసారీ కేసీఆర్‌ ప్రభుత్వాన్ని, పాలనను ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజలు బలపరుస్తున్నారన్నారు. ప్రజలు తమపై పెట్టుకున్న అచంచల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ ఎప్పటికప్పుడు ఉత్పన్నమయ్యే పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వం ముందడుగు వేస్తోందని గవర్నర్‌ స్పష్టం చేశారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించిన నాయకుడే రాష్ట్ర సారథిగా ముందుకు నడిపించడం తెలంగాణకు కలిసొచ్చిన అంశమన్నారు. సమైక్య రాష్ట్రంలో జరిగిన జీవన విధ్వంసం కారణంగా కుదేలైన అన్ని రంగాలకు పునరుత్తేజం కల్పించేందుకు దార్శనిక ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలోని ప్రభుత్వం గడిచిన ఆరేళ్లుగా ప్రణాళికాబద్ధంగా, చిత్తశుద్ధితో చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలిస్తున్నాయన్నారు. ఈ సందర్భంగా గవర్నర్‌ ప్రసంగం ఆమె మాటల్లోనే... 

పేదలకు కనీస జీవన భద్రత కోసం.. 
‘‘పేదలకు కనీస జీవన భద్రత కల్పించాలని ప్రభుత్వం సంక్షేమ రంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చింది. మానవీయ కోణంలో ఆలోచించి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు వారికి భద్రత కల్పించాయి. ఆసరా, వికలాంగుల పెన్షన్లను పెంచడంతో వారు ఎవరిపైనా ఆధారపకుండా సంతోషంగా బతుకుతున్నారు. వృద్ధాప్య పెన్షన్ల అర్హత వయసును 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలోనే వారందరికీ పెన్షన్లు అందుతాయి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేయడానికి ప్రభుత్వం చేతివృత్తులు, కులవృత్తులకు తోడ్పాటు అందిస్తోంది. ప్రభుత్వ ఖర్చుతో నిర్మించే డబుల్‌ బెడ్రూం ఇళ్ల పథకం కేవలం తెలంగాణలోనే అమలవుతోంది. ఈ పథకం క్రింద ఇప్పటివరకు 2,72,763 ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. వాటి నిర్మాణం వేగంగా కొనసాగుతోంది.

అసెంబ్లీ సమావేశాలకు హాజరైన కాంగ్రెస్‌ సభ్యులు భట్టి విక్రమార్క, జీవన్‌రెడ్డి.. బీజేపీ సభ్యులు రాజాసింగ్, రాంచంద్రరావు

పేదలు, వివిధ వర్గాలకు చేయూత..  
ప్రభుత్వ స్థలాల్లో నివసిస్తున్న పేదలకు 125 చదరపు గజాల్లోపు స్థలాలను ప్రభుత్వం ఉచితంగా క్రమబద్ధీకరించింది. ఎస్సీ, ఎస్టీలు తమ ఇళ్లకు ఉపయోగించే విద్యుత్‌ను 101 యూనిట్ల వరకు ఉచితంగా అందిస్తోంది. సింగరేణి కార్మికులకు లాభాల్లో 28 శాతాన్ని బోనస్‌గా ప్రభుత్వం అందిస్తోంది. ఆర్టీసీ కార్మికుల రిటైర్మెంట్‌ వయసును 60 ఏళ్లకు పెంచింది. విద్యుత్‌ సంస్థల్లో పనిచేస్తున్న 22,667 మంది ఆర్టిజన్ల సర్వీసును క్రమబద్ధీకరించింది. 

విద్యుత్‌ రంగంలో అనితర విజయాలు.. 
దేశంలోనే తలసరి విద్యుత్‌ వినియోగం అధికంగా కలిగిన రాష్ట్రంగా తెలంగాణ నిలబడింది. సమైక్య రాష్ట్రంలో 13,162 మెగావాట్ల గరిష్ట డిమాండ్‌ ఏర్పడితే తెలంగాణ రాష్ట్రంలో 13,168 మెగావాట్ల విద్యుత్‌ డిమాండ్‌ ఉంది. దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతులకు 24 గంటలపాటు ఉచిత విద్యుత్‌ను అందిస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలవడం గర్వకారణం. తెలంగాణను మిగులు విద్యుత్‌ రాష్ట్రంగా మార్చేందుకు కొత్త విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాల నిర్మాణం వేగంగా కొనసాగుతోంది. 

గవర్నర్‌ ప్రసంగాన్ని ఆలకిస్తున్న మంత్రులు హరీశ్‌రావు, సత్యవతి రాథోడ్‌

వ్యవసాయ రంగంలో అభివృద్ధి.. 
కోటి ఎకరాలకు సాగునీరు అందించడం లక్ష్యంగా ప్రభుత్వం సమగ్ర జలవిధానాన్ని అమలు చేసింది. పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేయడం ద్వారా 20 లక్షల ఎకరాల ఆయకట్టుకు ప్రభుత్వం నీరందిస్తోంది. ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ఎత్తిపోతల పథకంగా రికార్డు సృష్టించిన కాళేశ్వరం ప్రాజెక్టు త్వరలోనే పూర్తికానుంది. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయి. దేవాదుల ప్రాజెక్టుకు 365 రోజులపాటు నీరందించడానికి సమ్మక్క బ్యారేజీ పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం దుమ్ముగూడెం ఆనకట్ట ప్రాంతంలోనే సీతామరామ ప్రాజెక్టుకు నీరందించడానికి 320 మెగావాట్ల జలవిద్యుత్‌ ఉత్పత్తి సాధించేలా 40 టీఎంసీల సామర్థ్యంతో సీతమ్మ సాగర్‌ బ్యారేజీని మంజూరు చేసింది. రాష్ట్రంలో నీటిపారుదల రంగం పురోగతికి ఈ యాసంగిలో వరిసాగే నిదర్శనం. యాసంగి పంట సాధారణ విస్తీర్ణం 17,08,397 ఎకరాలవగా ఈ యాసంగి సీజన్‌లో వరి పంట సాగు 38,19,419 ఎకరాలకు పెరిగింది. 123.5 శాతం పెరుగుదల నమోదైంది. 

ప్రపంచవ్యాప్త గొప్ప పథకాల్లో రైతు బంధు ఒకటి..  
రైతుబంధు పథకం ఇప్పుడు భారత దేశానికే కాదు, యావత్‌ ప్రపంచానికి ఆదర్శనీయం. ఎకరానికి çరూ. 10 వేల చొప్పున రెండు విడతల్లో రైతుబంధును అందిస్తూ దేశానికి ఓ రోల్‌మోడల్‌గా నిలిచింది. తెలంగాణ స్ఫూర్తితో వివిధ రాష్ట్రాలు రైతుబంధును ఆదర్శంగా తీసుకుంటున్నాయి. వ్యవసాయాభివృద్ధి కోసం ప్రపంచవ్యాప్తంగా అమలవుతున్న గొప్ప పథకాల్లో రైతుబంధు ఒకటని ఐక్యరాజ్యసమితి కీర్తించడం మనకు గర్వకారణం.

శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డితో మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్‌

ఇకపై రైతుబంధు సమితిలు.. 
రైతు సమన్వయ సమితిలను ఇకపై రైతుబంధు సమితిలుగా వ్యవహరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. విత్తనం వేసిన దగ్గర నుంచి మార్కెట్లో పంటకు గిట్టుబాటు ధర వచ్చే వరకు రైతుబంధు సమితిలు కీలక బాధ్యతలు నిర్వహించేలా ప్రభుత్వం త్వరలోనే కార్యాచరణను ప్రారంభించనుంది. 

త్వరలోనే తెలంగాణ హెల్త్‌ ప్రొఫైల్‌.. 
‘కంటి వెలుగు’లో 1.54 కోట్ల మందికి కంటి పరీక్షలు నిర్వహించి 41 లక్షల మందికి కంటి అద్దాలు, మందులను ప్రభుత్వం ఉచితంగా అందించింది. కంటి వెలుగు తరహాలోనే చెవి, ముక్కు, గొంతు, దంత సంబంధ వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహిíßస్తాం. ప్రజలకు అన్ని రకాల పరీక్షలు నిర్వహించి తెలంగాణ హెల్త్‌ ప్రొఫైల్‌ రూపొందిస్తాం. దీనికి సంబంధించిన కార్యాచరణను ప్రభుత్వం త్వరలోనే ప్రభుత్వం ప్రకటిస్తుంది.  

కొత్త విధానాలు–కొత్త చట్టాలు.. 
అధికారులు, ప్రజాప్రతినిధుల్లో జవాబుదారీతనం పెంచడం కోసం, స్థానిక సంస్థలను క్రియాశీలం చేయడం కోసం ప్రభుత్వం కొత్త గ్రామీణ విధానం, కొత్త పట్టణ విధానం తీసుకొచ్చింది. కొత్తగా పంచాయతీ, పురæ చట్టాలను తెచ్చింది. గతంలో ప్రభుత్వానికి, మంత్రులకు ఉండే అధికారాలను తొలగించి కలెక్టర్లకు ఇచ్చింది. అవినీతికి, జాప్యానికి ఏమాత్రం ఆస్కారం లేకుండా కొత్త రెవెన్యూ చట్టాన్ని ప్రభుత్వం రూపొందిస్తోంది. రాష్ట్రంలో కొత్త భూ పరిపాలన విధానానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతోంది. 

రూ. 2.04 లక్షల కోట్ల పెట్టుడులు... 
రాష్ట్రాన్ని పెట్టుబడుల స్వర్గధామంగా మార్చేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తున్నాయి. కేవలం 15 రోజుల్లోనే అన్ని రకాల అనుమతులిచ్చే టీఎస్‌ ఐపాస్‌ సింగిల్‌ విండో విధానం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. ఇప్పటివరకు 12,427 పరిశ్రమలు అనుమతులు పొందగా రూ. 2.04 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి. 14 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయి.  

ఐటీ రంగంలో మేటీ.. 
ఐటీ రంగంలో రాష్ట్రం బలమైన శక్తిగా ఎదిగింది. అంతర్జాతీయ ఐటీ కంపెనీలు వచ్చాయి. 2013–14లో ఐటీ ఎగుమతుల విలువ రూ. 57 వేల కోట్లు కాగా 2018–19 నాటికి రూ. 1.09 లక్షల కోట్లకు చేరింది. గతేడాది ఐటీ ఎగుమతుల వృద్ధిరేటులో దేశ సగటు 8.9 శాతం కాగా తెలంగాణలో 16.89 శాతం కావడం ఐటీ రంగంలో సాధించిన ప్రగతికి సంకేతం. మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా ఐటీæ రంగాన్ని రాష్ట్రంలోని ద్వితీయశ్రేణి నగరాలు, పట్టణాలకు విస్తరింపజేయడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. శాంతిభద్రతల పటిష్టత కోసం అంతర్జాతీయ ప్రమాణాలతో హైదరాబాద్‌లో నిర్మిస్తున్న పోలిస్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ త్వరలోనే ప్రారంభం కానుంది. 

కఠినమైన ఆర్థిక క్రమశిక్షణ..
ఆర్థిక మాంద్యం ప్రభావం రాష్ట్రంపైనా పడింది. అయినప్పటికీ పటిష్టమైన పరిపాలన విధానాలు, కట్టుదిట్టమైన ఆర్థిక క్రమశిక్షణతో తెలంగాణ నిలదొక్కుకోగలుగుతోంది. దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఆదాయ వృద్ధిరేటు తిరోగమనంలో ఉండగా తెలంగాణ ఆ దుస్థితిలో లేదు. ప్రజలకిచ్చిన ప్రధాన హామీలను నెరవేర్చడంతోపాటు ప్రస్తుతం అమలు చేస్తున్న అన్ని పథకాలను యథాతథంగా అమలు చేస్తూ స్వీయ ఆదాయ మార్గాలను పెంపొందించుకుంటూ అత్యంత ఆశావహ దృక్పథంతో ప్రభుత్వం ముందడుగు వేస్తోంది.’’ 

గవర్నర్‌ నోట జై తెలంగాణ నినాదం..
గవర్నర్‌ తమిళిసై తన ప్రసంగం చివరల్లో ఓ కొటేషన్‌ను తమిళంలో చెప్పి దాని అర్థాన్ని ఆంగ్లంలోకి అనువదించారు. ‘‘ఆకలి దప్పులు లేని, అనారోగ్యాలు లేని, శతృత్వం లేని రాజ్యమే గొప్ప రాజ్యం’’అని వివరించారు. అనంతరం జైహింద్, జై తెలంగాణ అంటూ తన ప్రసంగాన్ని ముగించారు.

గవర్నర్‌ ప్రసంగంపై స్పందనలు

  • గవర్నర్‌ ప్రసంగం వాస్తవాలకు దరిదాపుల్లో లేదు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా ప్రస్తావించలేదు. నిరుద్యోగ భృతి–సాగునీటి ప్రాజెక్టులపై క్లారిటీ లేదు. పేదలకిచ్చే డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల పై ఆరేళ్ల నుంచీ ఒకటే మాట చెబుతున్నారు. ఈ ప్రసంగంలో పోడుభూములు, ఎస్సీ–ఎస్టీ నిధులపై అంకెలు చెప్పలేదు. రైతుబంధు–రైతురుణమాఫీ అనేవి ఎన్నికల ఆయుధాలుగా మారాయి. మిషన్‌ భగీరథ నీళ్ల కోసం రూ.50వేల కోట్లు ఖర్చు చేసి ఒక్క ఇంటికి నీళ్లు ఇవ్వలేదు. రాష్ట్రంలో లా అండ్‌ ఆర్డర్‌ సమస్యలు– మహిళల పై దాడుల నివారణ చర్యలు కనిపించలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు లో టెండర్లు పిలవకుండా నామినేషన్‌ పద్దతిలో రూ.4వేల కోట్ల ప్రాజెక్టు ఇవ్వడం పై చర్చ జరపాలి. ఉస్మా నియా యూనివర్సిటీలో ఎదురవుతున్న వివిధ సమస్యల పై చర్చించాలి. ప్రాధాన్యత సంతరించుకున్న ఆయా సమస్యల పరిష్కారంపై చర్చించేందుకు అసెంబ్లీ పనిదినాలు పొడిగించాలి. – సీఎల్పీ నేత భట్టి 
  • అసెంబ్లీలో గవర్నర్‌ ప్రసంగం విన్న తరువాత చాలా బాధ అనిపిం చింది. ఒక అత్యున్నత స్థాయి మహిళ ద్వారా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అబద్ధాలు చెప్పించింది. తెలంగాణలో ఇంకా అన్ని కష్టాలు పోలేదు. ఈ రోజు కొంతమంది నాయకులు తమ ఆత్మగౌరవాన్ని సీఎం కేసీఆర్‌ కాళ్ల దగ్గర పెట్టారు. ఒక దళితుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉండటాన్ని కూడా కేసీఆర్‌ సహించలేకపోతున్నారు. – కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి 
  • బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా ఉభయసభలనుద్దేశించి చేసిన ప్రసంగంలో గవర్నర్‌ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అసత్యాలు పలికించింది. గత ఖరీఫ్‌లో రైతుబంధు అందరికీ అందలేదు, యాసంగి పంటలు చేతికందే సమయమొచ్చినా ఆ సబ్సిడీ చెల్లింపులు చేయలేదు. కందిపంట వేసిన రైతులు కన్నీళ్ల పర్యంతమయ్యారు. గవర్నర్‌ ప్రసంగంలో రూ.లక్ష రుణమాఫీ హామీ అమలు ప్రస్తావనే లేదు. డబుల్‌బెడ్‌రూం ఇళ్లపై ప్రచారం తప్ప, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇళ్లు ఇవ్వలేదు. – చాడ వెంకట్‌రెడ్డి
  • రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న ఉపాధి కల్పన, గృహ నిర్మాణాలు, ఉద్యోగభద్రత, శాంతిభద్రతల సమస్యలు ప్రస్తావించకుండా టీఆర్‌ఎస్‌ ఎన్నికల ప్రణాళికను గవర్నర్‌ ప్రసంగంలో వినిపించారు. ప్రస్తుత రాష్ట్ర పరిస్థితిని ప్రతిబింబించేలా, ప్రగతికి దోహదపడేలా ఈ ప్రసంగం లేదు. దయనీయంగా ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి మాట వరుసకు కూడా ప్రస్తావించలేదు. – తమ్మినేని వీరభద్రం
  • అరిగిపోయిన రికార్డును మరోసారి సభలో వినిపించారు. అన్నిరంగాల్లో ప్రభుత్వం విఫలమైందదని గవర్నర్‌ ప్రసంగంతో రుజువైంది. గవర్నర్‌తో పబ్లిక్‌ డాక్యుమెంట్‌ చదివించారు. ఒక్క అంశం కూడా ప్రభుత్వం రెండవసారి అధికారంలోకి వచ్చిన తరువాతది కాదు. – రాంచంద్రరావు 
  • ఇది కొత్త తరహా బడ్జెట్‌ ఏమీ కాదు. గవర్నర్‌ ప్రసంగంలోని ప్రతి అంశంపైనా మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం. కేసీఆర్‌ ఇచ్చిన హామీలపై ప్రశ్నిస్తాం. సీఏఏ, భైంసా అంశాలపై సభలో చర్చను లేవనెత్తుతా. – రాజాసింగ్‌
  • గవర్నర్‌ తమిళిసై ప్రసంగం తెలంగాణ ఖ్యాతిని చాటింది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అన్ని రంగాల్లో సాధించిన విజయాలను గవర్నర్‌ తన ప్రసంగంలో ప్రస్తావించారు. దేశంలోని మిగతా రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలిచింది. రాష్ట్రం అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలబడింది. వ్యవసాయ, పారిశ్రామిక, ఐటీ రంగాల్లో పురోగతి సాధించింది. – టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు
  • గవర్నర్‌ తమిళిసై ప్రసంగంలో కొత్తదనం లేదు. గత ప్రసంగమే తిరిగి చెప్పించినట్లుంది. కొత్త సీసాలో పాత సారాను తలపిస్తోంది. రైతు సమన్వయ సమితి స్థానంలో రైతు బందు సమితిలు తప్ప కొత్త అంశాలేమీ లేవు.  – టీచర్స్‌ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి
  • తెలంగాణ ప్రభుత్వం జాతీయ జనాభా రిజిస్టర్‌పై (ఎన్‌పీఆర్‌) స్టే విధించాలి. కేరళ మాదిరిగా ఎన్‌పీఆర్‌పై నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది.  గవర్నర్‌ ప్రసంగంలో ఎన్‌పీఆర్‌ ప్రస్తావన ఉంటుందని భావించాం. కానీ, నిరాశపర్చింది. – మజ్లిస్‌ ఎమ్మెల్యేలు 
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top