
'రాజకీయాలను దిగజార్చిన నీచుడు చంద్రబాబు'
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్రంగా మండిపడ్డారు. మంగళవారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్రంగా మండిపడ్డారు. రాజకీయాలను దిగజార్చిన నీచుడు చంద్రబాబు' అంటూ ధ్వజమెత్తారు. మంగళవారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ ఓటుకు నోటు వ్యవహారంలో తాను స్టీఫెన్సన్తో మాట్లాడలేదని, రేవంత్ను పంపలేదని చంద్రబాబు ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. తాను చేసిన తప్పుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలను పణంగా పెట్టాలని చంద్రబాబు చూస్తున్నారని దుయ్యబట్టారు. అలాగే పరిటాల రవి హత్యను కూడా చంద్రబాబు తన రాజకీయాలకు వాడుకున్నారని విమర్శించారు.
పరిటాల హత్య కేసులో దోషి అయిన జేసీ దివాకర్రెడ్డిని తమ పార్టీలో చేర్చుకుని ఎంపీ టికెట్ ఇచ్చారని చెప్పారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై చంద్రబాబు అక్రమ కేసులు పెట్టించారని అన్నారు. మరోపక్క, చంద్రబాబు తనకు గతంలో ఒక్కరూపాయి కూడా ఇవ్వలేదని, ఆ విషయంలో నా పిల్లల మీద ప్రమాణం చేస్తా' అని తలసాని చెప్పారు. తనకు డబ్బులు ఇచ్చినట్లయితే ఆయన కొడుకుపై చంద్రబాబు ప్రమాణం చేస్తారా? అంటూ తలసాని సూటిగా ప్రశ్నించారు.