200 శాతం పెరగనున్న ఇంజనీరింగ్‌ ఫీజు! | TAFRC Proposals To Hike Telangana Engineering Colleges Fees | Sakshi
Sakshi News home page

200 శాతం పెరగనున్న ఇంజనీరింగ్‌ ఫీజు!

Jun 25 2019 2:04 AM | Updated on Jun 25 2019 2:04 AM

TAFRC Proposals To Hike Telangana Engineering Colleges Fees - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలోని కొన్ని ప్రధాన ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ఫీజుల మోత మోగనుంది. ఏకంగా 200 శాతానికి మించి ఫీజు పెంపును కాలేజీల యాజమాన్యాలు ప్రతిపాదించాయి. టాప్‌ కాలేజీల్లో ఒకటైన చైతన్య భారతి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(సీబీఐటీ) ఏకంగా రూ.3 లక్షల వార్షిక ఫీజును ప్రతిపాదించింది. మిగతా 75 ప్రధాన కాలేజీలు కూడా ఫీజుల పెంపు ప్రతిపాదనలను తెలంగాణ ఫీజులు, ప్రవేశాల నియంత్రణ కమిటీకి (టీఏఎఫ్‌ఆర్‌సీ) అందజేశాయి. ఫీజుల పెంపు కోసం ఇప్పటికే 6 కాలేజీలు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం టీఏఎఫ్‌ఆర్‌సీకి చైర్మన్‌ను నియమించి, కాలేజీలవారీగా ఫీజులను ఖరారు చేసే వరకు యాజమాన్యాలు ప్రతిపాదించిన ఫీజును అమలు చేయాలని, ఫీజులు ఖరారయ్యాక మిగతా మొత్తాన్ని సర్దుబాటు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసినట్లు ఉన్నత విద్యాశాఖ వర్గాలు పేర్కొన్నాయి. దీంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ప్రభుత్వవర్గాలు పడ్డాయి. 

ఫీజు ఖరారు గడువు ముగిసింది
2016లో ఖరారు చేసిన ఫీజుల గడువు 2018–19 విద్యా సంవత్సరంతో ముగిసింది. దీంతో 2019–20 విద్యా సంవత్సరం నుంచి వచ్చే మూడేళ్లపాటు ఫీజులను ఖరారు చేయాల్సి ఉంటుంది. హైకోర్టు రిటైర్డ్‌ జడ్జి నేతృత్వంలోని ఫీజుల కమిటీ ఖరారు చేస్తేనే వాటికి చట్టబద్ధత ఉంటుంది. వరుస ఎన్నికల కారణంగా టీఏఎఫ్‌ఆర్‌సీకి చైర్మన్‌ నియామకం అంశం మరుగున పడిపోయింది. చైర్మన్‌ నియామకం జరిగేలోగా టీఏఎఫ్‌ఆర్‌సీ సభ్య కార్యదర్శి హోదాలో విద్యాశాఖ కార్యదర్శి ఫీజుల ప్రతిపాదనల స్వీకరణకు నోటిఫికేషన్‌ జారీ చేశారు. యాజమాన్య ప్రతిపాదిత ఫీజులను అమలు చేస్తే తల్లిదండ్రుల నుంచి వ్యతిరేకత వ్యక్తమయ్యే పరిస్థితి నెలకొంది. దీంతో ఆ ఉత్తర్వులపై అప్పీల్‌కు వెళ్లాలని ప్రభుత్వం ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చింది. అయితే ఇంకా కోర్టు ఆర్డర్‌ కాపీ అందలేదని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. 



27 నుంచి ఆప్షన్లు ప్రారంభమయ్యేనా? 
ఆయా కాలేజీలన్నింటిలోనూ యాజమాన్య ప్రతిపాదిత ఫీజును అమలు చేయాల్సిన పరిస్థితి వస్తే సాధారణ కాలేజీల్లోనూ భారీగా ఫీజుల పెంపును అమలు చేయాల్సి వస్తుంది. టీఏఎఫ్‌ఆర్‌సీకి చైర్మన్‌ నియామకం తరువాత కొత్త ఫీజులను ఖరారు చేశాక మిగులు ఫీజులను సర్దుబాటు చేయాలని పేర్కొన్నప్పటికీ ముందుగా ప్రతిపాదిత ఫీజును చూసి విద్యార్థులు తీవ్ర ఆందోళనలో పడే ప్రమాదం నెలకొంది. ఇప్పటికే ఇంజనీరింగ్‌లో ప్రవేశాల కౌన్సెలింగ్‌ను ప్రవేశాల కమిటీ ప్రారంభించింది. రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పించింది. ఈ నెల 27వ తేదీ నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్, వెబ్‌ ఆప్షన్లను ప్రారంభించాలని నిర్ణయించింది. కోర్టు ఉత్తర్వులు కాపీ అందనప్పుడు, అప్పీల్‌కు వెళ్లనపుడు 27వ తేదీ నుంచి వెబ్‌ ఆప్షన్లను ప్రారంభిస్తారా? లేదా? అనేది గందరగోళంగా మారింది. వెబ్‌ ఆప్షన్లకు అవకాశం ఇస్తే మాత్రం కచ్చితంగా కాలేజీల వారీగా ఫీజులను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచాల్సి ఉంటుంది. 27వ తేదీలోగా కోర్టు ఉత్తర్వులు అందితే అప్పీల్‌కు వెళ్లే అవకాశం ఉంది. లేదంటే వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియను వాయిదా వేసి, కోర్టు ఉత్తర్వుల కాపీ అందాకే అప్పీల్‌కు వెళ్లాలని, ఆ తరువాతే వెబ్‌ ఆప్షన్లను ప్రారంభించాలని భావిస్తున్నట్లు ఉన్నత విద్యా మండలి అధికారులు పేర్కొంటున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement