ఆత్మహత్యలకు ఫలితాలు కారణం కాదు

Suicides are not the cause of the results - Sakshi

ఇంటర్మీడియట్‌ విద్యార్థుల ఆత్మహత్యలు దురదృష్టకరం

బోర్డు తప్పులు తీవ్రమైనవి కావు: హైకోర్టు తీర్పు

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్‌ ఫలితాలకు విద్యార్థుల ఆత్మహత్యలకు సంబంధం లేదని హైకోర్టు తీర్పు చెప్పింది. ఇంటర్‌ విద్యార్థుల ఆత్మహత్యలపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు డిస్మిస్‌ చేసింది. విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం దురదృష్టకరమేనని, అయితే ఇంటర్‌ ఫలితాలకు వారి ఆత్మహత్యలకు సంబంధం లేదని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.

3.82 లక్షల మంది ఇంటర్‌ పరీక్షల్లో తప్పితే వారందరి జవాబు పత్రాలను ఎలాంటి రుసుము వసూలు చేయకుండా రీవెరిఫికేషన్‌ చేస్తే   1,183 మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారని, ఇది 0.16 శాతమని హైకోర్టు తన తీర్పులో పేర్కొంది. రీవెరిఫికేషన్‌ తర్వాత  460 మంది మాత్రమే తిరిగి దరఖాస్తు చేసుకున్న విషయాన్ని ధర్మాసనం గుర్తు చేసింది. లక్షల సంఖ్యలో విద్యార్థులు పరీక్షలు రాసినప్పుడు ఫెయిల్‌ అయిన విద్యార్థుల పత్రాల్ని రీవెరిఫికేషన్‌లో వెలువడిన ఫలితాల శాతాన్ని బేరీజు వేసి చూస్తే తప్పు జరిగినట్లు పరిగణించాల్సిన స్థాయిలో లేదని ధర్మాసనం తన తీర్పులో వెల్లడించింది.

ఇంటర్‌ పరీక్ష పత్రాల మూల్యాంకనం తప్పుల తడకగా జరగడంతో 16 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, వీరి కుటుంబాలకు రూ.50 లక్షలు చొప్పున ప్రభుత్వం పరిహారం చెల్లించేలా ఉత్తర్వులు ఇవ్వాలని, తప్పులు చేసిన ఇంటర్‌ బోర్డు సిబ్బందిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేసేలా ఆదేశాలివ్వాలని కోరుతూ బాలల హక్కుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పి.అచ్యుత్‌రావు, న్యాయవాది రాపోలు భాస్కర్‌ వేర్వేరుగా దాఖలు చేసిన పిల్స్‌ను ధర్మాసనం తోసిపుచ్చింది.

23 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం బాధాకరమని, అయితే వారి ఆత్మహత్యలకు ఇంటర్‌ ఫలితాలకు సంబంధం లేదని, పిటిషనర్‌ కోరినట్లుగా వారి కుటుంబాలకు రూ.50 లక్షలు చొప్పున ప్రభుత్వం పరిహారం చెల్లించే ఆదేశాలివ్వలేమని ధర్మాసనం తేల్చి చెప్పింది. అదేవిధంగా ఇంటర్‌ బోర్డు అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకునే విషయంలోనూ ఆదేశాలివ్వలేమని పేర్కొంది. ఈ విషయంలో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవచ్చునని తెలిపింది.  ఇరుపక్షాల వాదనల తర్వాత హైకోర్టు రెండు పిల్స్‌ను తోసిపుచ్చింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top