మీ ఓటుతో ప్రేమను చూపండి

Students Should Love When They Vote - Sakshi

నాగర్‌కర్నూల్‌: పిల్లల భవిష్యత్‌కు సంకల్పంతో ఓటుహక్కు వినియోగించుకోవాలని కలెక్టర్‌ ఈ.శ్రీధర్‌ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో ‘మీ ఓటుతో మీ ప్రేమను చూపండి’ అనే సంకల్ప కరపత్రాన్ని కలెక్టర్‌ విడుదల చేసి మాట్లాడారు. సంకల్ప పత్రాలను జిల్లాలోని అన్ని పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అందజేయాలని అన్నారు. కుటుంబ సభ్యులు ఓటు ద్వారా ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు తమ ఓటును ప్రజాస్వామ్యబద్ధంగా వినియోగించుకునేలా సంకల్ప పత్రాలను తల్లిదండ్రులకు అందించి కుటుంబ సభ్యులకు ఓటు విశిష్టత తెలియపర్చాలని అన్నారు.

దీనికోసం సంకల్ప పత్రాలను అన్ని పాఠశాలలకు పంపిణీ చేసి ప్రతి విద్యార్థికి అందేలా చూడాలని డీఈఓ గోవిందరాజులును ఆదేశించారు. కార్యక్రమంలో జేసీ శ్రీనివాస్‌రెడ్డి, డీఆర్వో మధుసూదన్‌నాయక్, డీఈఓ గోవిందరాజులు, ఐసీడీఎస్‌ పీడీ ప్రజ్వల, జిల్లా అధికారులు అనిల్‌ప్రకాష్, మోహన్‌రెడ్డి, సుధాకర్, సాయిసుమన్, జయంత్‌కుమార్‌రెడ్డి, కృష్ణారెడ్డి, రవీందర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

బాలల వెట్టి చాకిరిని అరికట్టాలి

 జిల్లాలో బాలల వెట్టి చాకిరిని అరికట్టాలని కలెక్టర్‌ ఈ.శ్రీధర్‌ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లో బాండెడ్‌ లేబర్‌ విజిలెన్స్, చైల్డ్‌ లేబర్‌ టాస్క్‌ఫోర్స్‌ సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. బడిఈడు పిల్లలను పనిలో చేర్చుకుని వెట్టి చాకిరి చేయిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఆరేళ్లలోపు పిల్లలను అంగన్‌వాడీలో, 18 ఏళ్లలోపు పిల్లలు బడిలో ఉండేవిధంగా చూడాలన్నారు. పిల్లలను ఎక్కడైనా పనిలో పెట్టుకున్నట్లు కనిపిస్తే 1098కు సమాచారం అందజేయాలని తెలిపారు. హోటళ్లు, కిరాణషాపులు, రాత్రిళ్లు ఇటుక బట్టీల వద్ద పిల్లలను పనిలో ఉంచుకుంటే యజమానికి జరిమానా విధించడమే కాక జైలుశిక్ష వేయడం జరుగుతుందని హెచ్చరించారు. ఇతర రాష్ట్రాలకు లేబర్‌ను తరలించే దళారులు, గుంపు మేస్త్రీలకు భారీ జరిమానా విధించాలని అన్నారు.

ఎన్జీఓలు, ఇతర సంఘాలు సమాచారాన్ని సంబంధిత అధికారులకు అందించాలని కోరారు. లేబర్‌ను ఇతర రాష్ట్రాలకు తరలించాలంటే సంబంధిత తహసీల్దార్‌ కార్యాలయంలో కార్మికుల వివరాలు తెలిపి సర్టిఫికేట్‌ పొందాలన్నారు. జిల్లాలో ఇంకా బాండెడ్‌ లేబర్‌ ఎక్కడైనా ఉంటే వారిని గుర్తించి తగిన ఆర్థిక, సామాజిక సహకారం అందించాలని అధికారులకు సూచించారు. జిల్లాలో బాండెడ్‌ లేబర్, చైల్డ్‌ లేబర్‌ లేకుండా చేసేందుకు సంబంధిత శాఖలు కృషిచేయాలని తెలిపారు. సమావేశంలో జేసీ శ్రీనివాస్‌రెడ్డి, డీఆర్వో మధుసూదన్‌నాయక్, జిల్లా అధికారులు సాయిసుమన్, రవీందర్‌రెడ్డి, ప్రజ్వల, గోవిందరాజులు, సుధాకర్, జయంత్‌కుమార్, అనిల్‌ ప్రకాశ్, మధు, పలు ఫౌండేషన్ల సభ్యులు పాల్గొన్నారు.  
   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top