పరీక్ష కేంద్రంలోనే తుదిశ్వాస! | Student dead with heart attack in exam hall | Sakshi
Sakshi News home page

పరీక్ష కేంద్రంలోనే తుదిశ్వాస!

Mar 3 2019 3:48 AM | Updated on Mar 3 2019 5:14 AM

Student dead with heart attack in exam hall - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షల్లో విషాదం నెలకొంది. పరీక్ష రాయడానికి వచ్చిన ద్వితీయ సంవత్సరం విద్యార్థి ఒకరు గుండెపోటుతో పరీక్షా కేంద్రంలోనే కుప్పకూలిపోయాడు. చికిత్స కోసం ఆస్పత్రికి తరలించేలోపే ఆ విద్యార్థి మృతి చెందాడు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం కొక్కిరేని గ్రామానికి చెందిన వెంకట్రావు, ఉప్పలమ్మ దంపతుల కుమారుడు గోపిరాజు (18) సికింద్రాబాద్‌ వైఎంసీఏ న్యూ గవర్నమెంట్‌ జూనియర్‌ కాలేజీలో ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ అకౌంట్స్, ట్యాక్సేషన్‌ అండ్‌ ట్యాలీ (వృత్తివిద్య) చదువుతున్నాడు. ఆయనకు ప్యారడైజ్‌లోని శ్రీ చైతన్య జూనియర్‌ కాలేజీలో సెంటర్‌ పడింది. వార్షిక పరీక్షల్లో భాగంగా శనివారం ఇంగ్లీషు పేపర్‌ృ2 పరీక్ష రాసేందుకు ఉదయం 8.15 నిమిషాలకు పరీక్ష కేంద్రానికి చేరుకున్నాడు. అప్పటికే ఛాతిలో నొప్పిగా ఉండటంతో స్నేహితుడితో కలిసి పక్కనే ఉన్న మెడికల్‌షాపుకు వెళ్లి 2 ట్యాబ్లెట్స్‌ కొన్నాడు. వీటిలో ఒకటి వేసుకోగా వేంటనే వాంతి చేసుకోవడంతో కింద పడిపోయింది. ఆ తర్వాత మరో రెండుసార్లు వాంతి చేసుకున్నాడు. 

ఛాతీ నొప్పితో మెట్లు ఎక్కడం వల్లే 
నొప్పి కాస్తంత తక్కువగా ఉందని.. మరో ట్యాబ్లెట్‌ వేసుకుని పరీక్షాకేంద్రం లోపలికి వెళ్లాడు. స్నేహితుడి సాయంతో రెండో అంతస్తులో ఉన్న పరీక్ష గదిలోపలికి చేరుకున్నాడు. అప్పటికే ఆయన ఛాతి నొప్పితో బాధపడుతుండటం, ఆపై మెట్లు ఎక్కి రెండో అంతస్థుకు రావడంతో నొప్పి మరింత ఎక్కువైంది. దీంతో చూస్తుండగానే గోపిరాజు అక్కడే కుప్పకూలిపోయాడు. కాలేజీ సిబ్బంది వెంటనే 108కు సమాచారం ఇచ్చినా.. రావడం ఆలస్యమైంది. దీంతో ఆ భవనం కిందే ఉన్న ప్రయివేటు డయాగ్నోస్టిక్‌కు సంబంధించిన అంబులెన్స్‌లో సమీపంలో ఉన్న సన్‌షైన్‌ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే గోపిరాజు మృతిచెందినట్లు వైద్యులు ప్రకటించారు. రాంగోపాల్‌పేట్‌ పోలీసులు సన్‌షైన్‌కు చేరుకుని మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రి మార్చురికీ తరలించారు. పోస్టుమార్టం తర్వాత మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించడంతో వారు సొంతూరికి తీసుకెళ్లారు. 

ఛాతీ నొప్పిపై అవగాహన లేకే! 
గోపిరాజుకు ఉదయం 8.30గంటల సమయంలోనే చాతినొప్పి వచ్చింది. అయితే స్నేహితులు ఆసుపత్రికి వెళ్దామంటే ట్యాబ్‌లెట్‌ వేసుకుంటే తగ్గిపోతుందంటూ వారించాడు. ఛాతినొప్పిని గుండెపోటుగా గుర్తించలేకపోవడం.. సాధారణ గ్యాస్ట్రిక్‌ సమస్యగా భావించి నిర్లక్ష్యం చేయడం వల్లే మృతిచెందాడని వైద్యులు పేర్కొన్నారు. నొప్పి రాగానే ఆసుపత్రికి చేరుకుని ఉంటే కాపాడే వారమన్నారు. దీంతోపాటు పరీక్షాకేంద్రంలో కుప్పకూలిపోయినప్పుడు సిబ్బంది ఫిట్స్‌ అనుకుని ఆలస్యం చేయడం కూడా ఈ అవాంఛనీయ ఘటనకు కారణం. 108 అంబులెన్సు ఆలస్యంగా రావడం.. రోడ్డు దాటితే సన్‌షైన్‌ ఆసుపత్రి ఉన్నా అంబులెన్సు కోసం వేచి చూడటం ఇవన్నీ కారణాలుగానే భావించాలని వైద్యులు అభిప్రాయపడుతున్నారు.

పేద కుటుంబం.. చదువులో ఆణిముత్యం
ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం, కొక్కిరేని గ్రామానికి చెందిన వెంకట్రావ్, ఉప్పలమ్మ దంపతులు దాదాపు 15 ఏళ్ల క్రితమే నగరానికి వచ్చి ఎల్లారెడ్డిగూడలో స్థిరపడ్డారు. తండ్రి వెంకటరావు అదే ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్‌కు వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. వీరికి ఐదుగురు సంతా నం కాగా వీరిలో ముగ్గురు ఆడపిల్లలు ఇద్దరు అబ్బాయిలు. గోపిరాజు నాలుగో సంతానం. తల్లి ఉప్పలమ్మ గతేడాది నుంచి కిడ్నీ వ్యాధి తో బాధపడుతోంది. ప్రస్తుతం ఆమె డయాలసిస్‌ చేయించుకుంటుంది. మొదటి కుమార్తెకు వివాహం కాగా.. రెండవ కుమార్తె పక్కనున్న ఇళ్లలో పనిచేస్తోంది. మూడో కుమార్తె ఇంటి వద్దే ఉంటోంది. గోపిరాజు తమ్ముడు అదే కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నాడు. పేదరికం కారణంగా ఖర్చుల కోసం గోపిరాజు ఉదయమే లేచి న్యూస్‌పేప  ర్‌ వేస్తూ తండ్రికి చేదోడువాదోడుగా ఉంటున్నాడు. చదువులో కూడా గోపిరాజు ముందంజలో ఉన్నాడు. ఇంటర్‌ మొదటి సంవత్సరం 79% మార్కులు సాధించాడు. గోపిరాజు పడి పోయాడని తెలియగానే వెంటనే తాము ఆస్పత్రికి తీసుకెళతామని చెప్పినా సిబ్బంది ఒప్పుకోలేదని, ఆలస్యం చేశారని ఆయన స్నేహితులు ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement