సీటుకు వాస్తుదోషమట!

Strange Situation In Sub Registration Office - Sakshi

సాక్షి, కామారెడ్డి : జిల్లా కేంద్రమైన కామారెడ్డి సబ్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో ఇప్పుడు వింత పరిస్థితి కనిపిస్తోంది. గతంలో ఇక్కడ పనిచేసిన ఇద్దరు సబ్‌ రిజిస్ట్రార్‌లు గుండెపోటుతో చనిపోయారు. తరువాత వచ్చిన ఇద్దరు అధికారులు అనారోగ్యంతో పాటు ఇతర సమస్యలకు గురయ్యారు. దీంతో ఇప్పుడు పనిచేస్తున్న అధికారి మల్లికార్జున్‌కు ఆ చాంబర్‌ అంటేనే వణుకు పట్టుకుంది. ఏ అధికారి అయినా తన చాంబర్‌లో కూర్చుని పనిచేస్తారు.

మరీ ముఖ్యంగా రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి. అయితే ఆ చాంబర్‌లో కూర్చుంటే తనకు ఏ ఆపద ముంచుకు వస్తుందోనన్న భయంతో అందులో కూర్చోవడం లేదు. కొత్తగా ఎవరైనా కార్యాలయానికి వెళ్తే.. చాంబర్‌ ఖాళీగా కనిపిస్తుంది. దీంతో పెద్ద సారు లేడా అని అక్కడ ఉన్న సిబ్బందిని అడుగుతుంటారు.. వారు ‘సార్‌ లోపల గదిలో కూర్చున్నారు’ అంటూ చూపిస్తారు. కొసమెరుపు ఏంటంటే ఇటీవల బోధన్‌లో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సబ్‌ రిజిస్ట్రార్‌ శ్రీనివాస్‌రెడ్డి ఆరు నెలల క్రితం వరకు ఇక్కడే పనిచేసి అదే కుర్చీలో కూర్చుని విధులు నిర్వహించారు.  

అంతా ఓపెన్‌..

రిజిస్ట్రేషన్‌ కార్యాలయం అక్రమాలకు ఆలవాలంగా మారింది. జిల్లా కేంద్రమైన కామారెడ్డి పట్టణంతో పాటు పట్టణానికి చుట్టుపక్కల గ్రామాల్లో భూముల క్రయవిక్రయాలు పెద్ద ఎత్తున సాగుతుంటాయి. దశాబ్ద కాలంగా ఈ ప్రాంతంలో దాదాపు రూ. 2 వందల కోట్ల విలువైన భూముల క్రయవిక్రయాలు జరిగాయి. అనేక వెంచర్లు చేశారు. వేలాది ప్లాట్ల అమ్మకాలు సాగాయి. ప్రతి ఫైలు వెనుక వేలాది రూపాయల లంచాలు రిజిస్ట్రేషన్‌ అధికారులు, సిబ్బంది జేబుల్లోకి వెళ్తాయి.

భూ రికార్డుల ప్రక్షాళన జరిగిన సమయంలో రిజిస్ట్రేషన్లకు అనేక కొర్రీలు పెడుతూ ఒక్కో డాక్యుమెంటుకు రూ. 10 వేల నుంచి రూ. 20 వేల దాకా వసూలు చేశారన్న ఆరోపణలున్నాయి. ఇక్కడ పనిచేసిన ప్రతి అధికారి, సిబ్బంది రూ. లక్షల్లో సంపాదించారు. ఓ అధికారి అప్పట్లో రూ. కోట్లల్లో డబ్బు కూడగట్టారన్న ఆరోపణలు ఉన్నాయి. పెద్ద ఎత్తున రియల్‌ దందా సాగే కామారెడ్డి ప్రాంతంలో రిజిస్ట్రేషన కార్యాలయ సిబ్బందికి ఆదాయం అడ్డగోలుగా ఉంటుందన్న విషయం బహిరంగ రహస్యం.

అనేక అక్రమాలకు రిజిస్ట్రేషన్‌ కార్యాలయం కేంద్ర బిందువుగా నిలి చింది కూడా. రిజిస్ట్రేషన్‌ అధికారులు, సిబ్బంది అత్యాశతో చేసిన తప్పుడు రిజిస్ట్రేషన్ల మూలంగా ఎంతో మంది అమాయకులు ఇబ్బందులపాలయ్యారు. ఇంకా ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ఎన్నో ప్లాట్లకు డబుల్‌ రిజిస్ట్రేషన్లు చేసి ఎంతో మందిని ఇబ్బందుల్లోకి నెట్టారు. డబ్బు కోసం ఎలాంటి తప్పుడు పనులైనా చేసే సబ్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయ అధికారులు, సిబ్బంది వాస్తు పేరుతో చాంబర్‌లో కూర్చోకపోవడంపై విమర్శలు వెల్లువె త్తుతున్నాయి.

ఏసీబీ దాడులు జరుగుతాయని, ఎవరైనా తమను ఏసీబీకి పట్టిస్తారన్న భయం కూడా లేకుండా అంతా ఓపెన్‌గా డబ్బులు తీసుకుంటున్న వ్యవహారంపై స్థానికంగా చర్చించుకుంటున్నారు. బోధన్‌లో ఏసీబీకి చిక్కిన సబ్‌ రిజిస్ట్రార్‌ శ్రీనివాస్‌రెడ్డి ఘటనతో అంతటా రిజిస్ట్రేషన్‌ పాపాల గురించిన చర్చ జరుగుతోంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top