breaking news
Strange behaviour
-
వైరల్ వీడియో: స్కూల్లో విద్యార్థుల వింత ప్రవర్తన
-
విమానంలో స్వీడన్ దేశస్తుడి వింత ప్రవర్తన
శంషాబాద్: గోవా నుంచి హైదరాబాద్ మీదుగా ఢిల్లీ వెళ్తున్న విమానంలో ఓ విదేశీయుడు మతి స్థిమితం కోల్పోయి వింతగా ప్రవర్తించాడు. స్వీడన్‌కు చెందిన అలెగ్జాడ్రా జాక్ ఫ్ల్రీవ్ (35) అనే వ్యక్తి ఢిల్లీ వెళ్లడానికి గోవాలో శుక్రవారం మధ్యాహ్నం ఇండిగో విమానం ఎక్కాడు. అయితే, విమానం ప్రయాణిస్తుండగానే.. అతడు వింతగా ప్రవర్తించాడు. ఒక్కసారిగా సీటులో నుంచి లేచి తాను వేసుకున్న దుస్తులు విప్పేసి అటూఇటూ పరిగెత్తాడు. అప్రమత్తమైన విమాన సిబ్బంది అలెగ్జాడ్రాను అదుపు చేసి తిరిగి దుస్తులు వేసేందుకు ప్రయత్నించారు. కానీ, వారి ప్రయత్నం విఫలమవడంతో విమానం శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకోగానే అతడిని సీఐఎస్ఎఫ్ అధికారులకు అప్పగించారు. వారు అతడిని అదుపులోకి తీసుకొని ఆర్జీఐఏ పోలీసులకు అప్పగించారు. పోలీసులు అలెగ్జాడ్రాను అంబులెన్స్‌లో ఉస్మానియాకు తరలించారు. అతడి శరీరంపై ఎర్రటి మచ్చలు ఉండటంతో డ్రగ్స్ తీసుకున్నట్లుగా అనుమానిస్తున్నారు. -
సీటుకు వాస్తుదోషమట!
సాక్షి, కామారెడ్డి : జిల్లా కేంద్రమైన కామారెడ్డి సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఇప్పుడు వింత పరిస్థితి కనిపిస్తోంది. గతంలో ఇక్కడ పనిచేసిన ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లు గుండెపోటుతో చనిపోయారు. తరువాత వచ్చిన ఇద్దరు అధికారులు అనారోగ్యంతో పాటు ఇతర సమస్యలకు గురయ్యారు. దీంతో ఇప్పుడు పనిచేస్తున్న అధికారి మల్లికార్జున్‌కు ఆ చాంబర్ అంటేనే వణుకు పట్టుకుంది. ఏ అధికారి అయినా తన చాంబర్లో కూర్చుని పనిచేస్తారు. మరీ ముఖ్యంగా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి. అయితే ఆ చాంబర్లో కూర్చుంటే తనకు ఏ ఆపద ముంచుకు వస్తుందోనన్న భయంతో అందులో కూర్చోవడం లేదు. కొత్తగా ఎవరైనా కార్యాలయానికి వెళ్తే.. చాంబర్ ఖాళీగా కనిపిస్తుంది. దీంతో పెద్ద సారు లేడా అని అక్కడ ఉన్న సిబ్బందిని అడుగుతుంటారు.. వారు ‘సార్ లోపల గదిలో కూర్చున్నారు’ అంటూ చూపిస్తారు. కొసమెరుపు ఏంటంటే ఇటీవల బోధన్‌లో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాస్‌రెడ్డి ఆరు నెలల క్రితం వరకు ఇక్కడే పనిచేసి అదే కుర్చీలో కూర్చుని విధులు నిర్వహించారు. అంతా ఓపెన్.. రిజిస్ట్రేషన్ కార్యాలయం అక్రమాలకు ఆలవాలంగా మారింది. జిల్లా కేంద్రమైన కామారెడ్డి పట్టణంతో పాటు పట్టణానికి చుట్టుపక్కల గ్రామాల్లో భూముల క్రయవిక్రయాలు పెద్ద ఎత్తున సాగుతుంటాయి. దశాబ్ద కాలంగా ఈ ప్రాంతంలో దాదాపు రూ. 2 వందల కోట్ల విలువైన భూముల క్రయవిక్రయాలు జరిగాయి. అనేక వెంచర్లు చేశారు. వేలాది ప్లాట్ల అమ్మకాలు సాగాయి. ప్రతి ఫైలు వెనుక వేలాది రూపాయల లంచాలు రిజిస్ట్రేషన్ అధికారులు, సిబ్బంది జేబుల్లోకి వెళ్తాయి. భూ రికార్డుల ప్రక్షాళన జరిగిన సమయంలో రిజిస్ట్రేషన్లకు అనేక కొర్రీలు పెడుతూ ఒక్కో డాక్యుమెంటుకు రూ. 10 వేల నుంచి రూ. 20 వేల దాకా వసూలు చేశారన్న ఆరోపణలున్నాయి. ఇక్కడ పనిచేసిన ప్రతి అధికారి, సిబ్బంది రూ. లక్షల్లో సంపాదించారు. ఓ అధికారి అప్పట్లో రూ. కోట్లల్లో డబ్బు కూడగట్టారన్న ఆరోపణలు ఉన్నాయి. పెద్ద ఎత్తున రియల్ దందా సాగే కామారెడ్డి ప్రాంతంలో రిజిస్ట్రేషన కార్యాలయ సిబ్బందికి ఆదాయం అడ్డగోలుగా ఉంటుందన్న విషయం బహిరంగ రహస్యం. అనేక అక్రమాలకు రిజిస్ట్రేషన్ కార్యాలయం కేంద్ర బిందువుగా నిలి చింది కూడా. రిజిస్ట్రేషన్ అధికారులు, సిబ్బంది అత్యాశతో చేసిన తప్పుడు రిజిస్ట్రేషన్ల మూలంగా ఎంతో మంది అమాయకులు ఇబ్బందులపాలయ్యారు. ఇంకా ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ఎన్నో ప్లాట్లకు డబుల్ రిజిస్ట్రేషన్లు చేసి ఎంతో మందిని ఇబ్బందుల్లోకి నెట్టారు. డబ్బు కోసం ఎలాంటి తప్పుడు పనులైనా చేసే సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయ అధికారులు, సిబ్బంది వాస్తు పేరుతో చాంబర్లో కూర్చోకపోవడంపై విమర్శలు వెల్లువె త్తుతున్నాయి. ఏసీబీ దాడులు జరుగుతాయని, ఎవరైనా తమను ఏసీబీకి పట్టిస్తారన్న భయం కూడా లేకుండా అంతా ఓపెన్‌గా డబ్బులు తీసుకుంటున్న వ్యవహారంపై స్థానికంగా చర్చించుకుంటున్నారు. బోధన్‌లో ఏసీబీకి చిక్కిన సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాస్‌రెడ్డి ఘటనతో అంతటా రిజిస్ట్రేషన్ పాపాల గురించిన చర్చ జరుగుతోంది. -
కల్తీ ‘కల్లో’లం
* వింత ప్రవర్తనతో ఆసుపత్రుల పాలవుతున్న బాధితులు * నిజామాబాద్ జిల్లాలో రోజురోజుకూ పెరుగుతున్న రోగులు * రెండ్రోజుల్లోనే ఆసుపత్రికి 96 మంది.. వివిధ చోట్ల మరో 200 మంది * ఆసుపత్రుల్లో పిచ్చి ప్రవర్తన.. మంచాలకు కట్టేసి చికిత్స * కల్లులో మత్తు మోతాదు తగ్గడమే కారణం సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: కొందరు ఉన్నట్టుండి కింద పడిపోతున్నారు.. ఇంకొందరు అకస్మాత్తుగా పిచ్చిపట్టినట్టుగా మారిపోతున్నారు.. మరికొందరు దొరికిన వారిని దొరికినట్టు కొరుకుతున్నారు! నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో ఈ దృశ్యాలు ఇప్పుడు సర్వసాధారణమయ్యాయి!! ఇన్నాళ్లూ కల్తీ కల్లుకు బానిసలైన వారంతా... ఒక్కసారిగా అది దొరక్కపోవడంతో ఇలా చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. వింత ప్రవర్తన, అనారోగ్యంతో ఆసుపత్రుల పాలవుతున్నారు. రెండ్రోజుల్లోనే నిజామాబాద్ పట్టణంలో బాధితుల సంఖ్య 96కు చేరింది. వీరంతా ప్రభుత్వాసుపత్రిలో చేరగా.. వైద్యులు తాళ్లతో మంచాలకు కట్టేసి వారికి చికిత్సలు చేస్తున్నారు. కల్తీకల్లులో మత్తు పదార్థమైన క్లోరల్ హైడ్రేట్, డైజోఫాంకు ఒక్కసారిగా దూరమవడంతో బాధితులు ఇలా ప్రవర్తిస్తున్నట్టు వైద్యులు చెబుతున్నారు. మొదట ఆదిలాబాద్ జిల్లా నిర్మల్, భైంసా, బాసర, ఆదిలాబాద్‌లో బాధితులు వింతవింతగా ప్రవర్తించారు. ఇప్పుడు నిజామాబాద్ జిల్లా బాన్సువాడ, కామారెడ్డి, బోధన్, ఆర్మూరు, నిజామాబాద్‌లో ఇలాంటి వారు రోజురోజుకూ ఎక్కువైపోతున్నారు. జిల్లాలో ఇదీ పరిస్థితి.. నిజామాబాద్ జిల్లాలో కొన్నేళ్లుగా పార్టీలకు అతీతంగా రాజకీయ ప్రముఖులు కల్తీ కల్లు దందా కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం ఇటీవల గుడుంబా, నాటుసారా, కల్తీకల్లుపై ఉక్కుపాదం మోపింది. ఈ నేపథ్యంలో సీనియర్ ఐపీఎస్ అధికారి అకున్ సబర్వాల్‌ను ఇన్చార్జిగా నియమించింది. ఆయన ఆదేశాల మేరకు గత ఐదారు రోజులుగా కల్తీకల్లు నిరోధానికి ఎక్సైజ్ అధికారులు వరుసగా దాడులు చేస్తున్నారు. ఫలితంగా కల్లులో క్లోరల్ హైడ్రేట్, డైజోఫాంను కల్లు తయారీదారులు వినియోగించడం లేదు. దీంతో అవి ఉన్న కల్లుకు అలవాటుపడిన వారికి మత్తు ఒక్కసారిగా తగ్గడంతో వింతగా ప్రవర్తిస్తున్నారు. మాక్లూర్ మండలం కల్లెడికి చెందిన ఓ వ్యక్తి పిచ్చి ప్రవర్తనతో ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. నిజామాబాద్ మండలంలోని కులాస్పూర్, కులాస్పూర్తాండలో 8 మంది విచిత్ర చేష్టలు చేస్తున్నారు. బోధన్ మండలం ఎడపల్లితోపాటు బాన్సువాడ, ఆర్మూర్, మాక్లూర్, నిజామాబాద్ మండలంలోని కొన్ని గ్రామాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. జిల్లా కేంద్రంలోని దుబ్బ, ఆదర్శనగర్, కోటగల్లి, గౌతంనగర్ ప్రాంతాల్లో సుమారు 30 మందికిపైగా ఆసుపత్రిపాలయ్యారు. మొత్తమ్మీద ప్రభుత్వాసుపత్రిలో 96 మంది బాధితులు చేరగా.. జిల్లావ్యాప్తంగా మరో 200 మంది వివిధ ఆసుపత్రుల్లో చేరారు. వీరిలో 22 మంది మహిళలు కూడా ఉన్నారు. బాధితులు మరింత పెరిగే అవకాశం ఉందని వైద్యులు పేర్కొంటున్నారు. ఇన్నేళ్లుగా మౌనం ఇన్నాళ్లూ ఎక్సైజ్ అధికారుల అండతో కల్లీ కల్లు వ్యాపారం యథేచ్ఛగా సాగింది. కల్తీ కల్లు తాగి మరణించినా, అస్వస్థతకు గురైనా నమూనాలు సేకరించి ప్రయోగశాలకు పంపి చేతులు దులుపుకునేవారు. నిజామాబాద్ ఎక్సైజ్ యూని ట్ పరిధిలో 19 మండలాలు, 166 కల్లు గీత సహకార సంఘాలు, 306 కల్లు గీత కార్మికులు ఉన్నట్లు అధికారిక లెక్కలు చెప్తున్నాయి. కామారెడ్డి పరిధిలో 117 గీత సహకార సంఘాలు, 296 టీఎఫ్టీలు ఉన్నాయి. జిల్లాలో ఎక్కడ చూసినా గీత వృత్తితో సంబంధం లేని వ్యక్తులే ‘కల్లు మాఫియా’గా అవతారమెత్తారు. ఆబ్కారీ శాఖ పట్టించుకోక పోవడంతో డైజోఫాం, క్లోరల్ హైడ్రేడ్, క్లోరోఫాం (మత్తుకోసం), శక్రీన్ (రుచి కోసం), తెల్లపౌడర్, కుంకుడు రసంతో తయారు చేసిన కల్లు విక్రయాలు జోరుగా సాగాయి. మత్తు లేక పిచ్చి ప్రవర్తన నిజామాబాద్‌లోని గౌతంనగర్‌కు చెందిన ఈ మేస్త్రీ పేరు మదన్. రోజూ ఉదయం, సాయంత్రం కల్లు తాగే అలవాటుంది. నాలుగు రోజులుగా కల్లులో మత్తు పదార్థాలు లేకపోవడంతో విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు. కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పిస్తే అక్కడా నిలకడగా ఉండడం లేదు. అరవడం, కాళ్లు, చేతులు వంకర పోవడం, బయటకు పరుగెత్తడం వంటి చేష్టలు చేస్తున్నాడు. దీంతో వైద్యులు మంచానికి కట్టేసి చికిత్స చేస్తున్నారు. మత్తు తగ్గడం వల్లే కల్లుకు బానిస అయిన వారు అందులో మత్తు పదార్థాల మోతాదు తగ్గడంతో ఇలా ప్రవర్తిస్తుంటారు. ఉన్నట్టుండి కల్లు అందుబాటులో లేకపోవడంతో కూడా ఇలా మారుతుంటారు. కల్తీ కల్లు తాగడంతో నరాలు బలహీనపడడం, మెదడు మొద్దుబారడం, ఫిట్స్ రావడం వంటివి జరుగుతాయి. - డాక్టర్ విశాల్, మానసిక వైద్య నిపుణులు