
ఖమ్మం,ఇల్లెందు: ముందస్తు ఎన్నికల ప్రచారం కొనసాగుతున్నా..పోరాటాల పురిటిగడ్డలో మహాకూటమి అభ్యర్థి ఎవరన్నదానిపై ఉత్కంఠ వీడట్లేదు. నెల రోజుల క్రితం టీఆర్‌ఎస్ అభ్యర్థిగా, తాజామాజీ ఎమ్మెల్యే కోరం కనకయ్య పేరును ఆ పార్టీ అధిష్టానం ప్రకటించడంతో ఆయన ఊరూరా తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. గతంలో వరుసగా పాగా వేసిన సీపీఐ (ఎంఎల్)న్యూడెమోక్రసీ నుంచి గుమ్మడి నర్సయ్యను అభ్యర్థిగా కాస్త ఆలస్యంగానే బహుజన లెఫ్ట్‌ఫ్రంట్ (బీఎల్‌ఎఫ్) మద్దతుతో ప్రకటించారు. అయితే..ఎన్డీలో రాయల వర్గం, చంద్రన్న వర్గాల నుంచి వేర్వేరుగా అభ్యర్థులు పోరుసల్పుతున్నారు. చంద్రన్నవర్గం నుంచి యదళ్లపల్లి సత్యం పోటీచేస్తున్నారు.
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రభావమేంటో చూపుతామని ఆ పార్టీ నుంచి మోకాళ్ల నాగస్రవంతి బరిలోకి వస్తున్నారు. తాజాగా బహుజన్‌సమాజ్ పార్టీ (బీఎస్‌పీ) నుంచి కాట్రావత్ మోహన్‌నాయక్ పోటీకి సిద్ధమయ్యారు. అయితే..అందరి దృష్టి మాత్రం కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌తో కూడిన మహాకూటమి నుంచి అభ్యర్థి ఎవరు తెరపైకి వస్తారా..? అని ఎంతో ఉత్కంఠ నెలకొంది. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు మంచి ఓటు బ్యాంకు ఉంది. టీడీపీ, సీపీఐ జత కలుస్తుండడంతో మరింత బలంగా మారే అవకాశముంది. జిల్లాల పునర్విభజన తర్వాత జరుగుతున్న తొలి పోరులో ప్రస్తుతానికైతే..కీలక అభ్యర్థి ప్రకటన కోసం నియోజకవర్గ ఓటర్లు ఆసక్తితో చూస్తున్నారు
కాంగ్రెస్‌లో ఆశావహులు అనేకం
కాంగ్రెస్‌లో మాత్రం ఇల్లెందు టికెట్ మీద కన్నెసిన వారు 30 మంది వరకు ఉన్నారు. వీరిలో నలుగురు..ఇద్దరు ఆదివాసీ నాయకులు, మరో ఇద్దరు బంజారా నాయకులు సీటు తమకే కేటాయించాలని పట్టుబడుతున్నారు. అయితే..ఇద్దరిని ఫైనల్ చేశారని, వీరిలో ఒకరిని ఎంపిక చేస్తారని ప్రచారం సాగుతోంది. ఆ ఇద్దరిలో టికెట్ ఎవరికి దక్కుతుందో అభ్యర్థుల్లో హైరానా మొదలైంది. ఇప్పటికే ఆశావహులు ఇళ్లను వదిలి రాజధాని హైదరాబాద్‌లో మకాం వేసి..తమకు తెలిసిన సీనియర్ నేతలతో పైరవీలు చేయించుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. అవసరమైతే దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లి సైతం దృష్టిలో పడేందుకు తంటాలు పడుతున్నారు.
అసమ్మతి ఉన్నా..ఆగని కోరం
టీఆర్‌ఎస్ అభ్యర్థి, ఇల్లెందు తాజామాజీ కోరం కనకయ్య..నెలరోజులుగా మండలాలు, గ్రామాలను చుట్టివేస్తూ ప్రచారంలో దూసుకెళుతున్నారు. ఇంటింటి ప్రచారానికి శ్రీకారం చుట్టారు. పార్టీ శ్రేణులను ఊర్లలో తిప్పుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. న్యూడెమోక్రసీ కంచుకోటగా ఉన్న గ్రామాలు, గూడేల్లో సైతం తిరుగుతూ..కారు గుర్తుకు ఓటేయాలని కోరుతున్నారు. అయితే..టీఆర్‌ఎస్‌కు అసమ్మతి బెడద కూడా పీడిస్తోంది. ఆ పార్టీ మాజీ నియోజకవర్గ కన్వీనర్ లకావత్ దేవీలాల్‌నాయక్, మాజీ మండల అధ్యక్షుడు అజ్మీరా భావ్‌సింగ్ నాయక్, ఆయా మండలాల మాజీ మండల అధ్యక్షులు అసమ్మతి నేతలుగా మారుతున్నారు. తమకు పార్టీలో గుర్తింపు లేదని అలకపాన్పు ఎక్కారు. అయితే..ఇది ఎలాంటి ప్రభావం చూపనుందో తేలాల్సి ఉంది.
ఎన్డీలో సిద్ధాంత రాద్దాంతం
సీపీఐ (ఎంఎల్)న్యూడెమోక్రసీలో రాయల వర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, ఇటు చంద్రన్న వర్గం నుంచి యదళ్లపల్లి సత్యం పోటీపడుతున్నారు. ఈ దఫా ఈ రెండు గ్రూపుల మధ్య సిద్ధాంత..రాద్దాంతం మొదలైంది. రాయల వర్గం తన అభ్యర్థిని ప్రకటించకముందే చంద్రన్న వర్గానికి మద్దతును కోరి..ఒకే అభ్యర్థిని బరిలోకి దించుదామని కోరింది. ఈ క్రమంలో బీఎల్‌ఎఫ్ ఇల్లెందులో గుమ్మడి నర్సయ్యకు మద్దతు ప్రకటించింది. మరుసటి రోజు రాయల వర్గం సదస్సు ఏర్పాటు చేసుకుని గుమ్మడి పేరును ప్రకటించగా..ప్రతిగా చంద్రన్న వర్గం నుంచి సత్యం పోటీ చేస్తుండడంతో ఓట్లు చీలే అవకాశాలు ఉన్నాయి.
ఉజ్వల గ్యాస్‌పై బీజేపీ ఆశలు
బీజేపీకి పరిమిత సంఖ్యలో ఉన్న కార్యకర్తలు, నాయకులు మండల కేంద్రాలకే పరిమితమయ్యారు. ప్రధాని ఉజ్వల యోజన గ్యాస్ పథకం కింద 20 వేల గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేశామని, బీజేపీ నేతలు అభ్యర్థి మోకాళ్ల నాగ స్రవంతిని రంగంలోకి దింపి ప్రచారానికి సన్నాహాలు చేస్తున్నారు. అమిత్‌షా లాంటి అగ్రనేతను రప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు.
బీఎస్పీ నుంచి ఒకరు..
బీజేపీ టికెట్ అశించి రాకపోవడంతో కాట్రావత్ మోహన్‌నాయక్ బీఎస్‌పీ నుంచి పోటీకి సిద్ధమయ్యారు. ఈయన అభ్యర్థిత్వం ఖరారైతే..ప్రచారం చేసుకోనున్నారు.