దర్యాప్తు దిశ ఇలా..

Still Investigation Going On priyanka Case - Sakshi

నిందితులు కస్టడీకి వస్తేనే దర్యాప్తు ముందుకు..

తొలుత తొండుపల్లి టోల్‌ప్లాజా సర్వీసు రోడ్డు వద్ద సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్‌

ఆపై కీలక ఆధారాలు, సాక్షుల వాంగ్మూలాల స్వీకరణ 

సాక్షి, హైదరాబాద్‌: దిశ కేసు దర్యాప్తును సైబరాబాద్‌ పోలీసులు సవాల్‌గా తీసుకున్నారు. ఈ కేసులో మరిన్ని వివరాలు రాబట్టేందుకు నిందితులను పది రోజుల కస్టడీకి ఇవ్వాలని షాద్‌నగర్‌ పోలీసులు న్యాయస్థానంలో కస్టడీ పిటిషన్‌ వేశారు. దీనిపై కోర్టు సానుకూలంగా నిర్ణయం తీసుకోగానే నిందితులను పూర్తి స్థాయిలో విచారించనున్నారు. దిశ అత్యాచారానికి గురైన ప్రాంతం తొండుపల్లి టోల్‌ప్లాజా సర్వీసు రోడ్డు నుంచి పెట్రోల్, డీజిల్‌ పోసి మృతదేహాన్ని కాల్చిన చటాన్‌పల్లి అండర్‌పాస్‌ ప్రాంతంలో క్రైమ్‌ సీన్‌ను రీకన్‌స్ట్రక్షన్‌ చేయనున్నారు.

అలాగే మృతదేహాన్ని తరలించిన ప్రాంతం మీదుగా నిందితులతో కలసి ప్రయాణించి పూర్తి వివరాలను రాబట్టనున్నారు. దిశ సెల్‌ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేశాక ఏమైందన్న దానిపై ఇంకా స్పష్టత లేకపోవడంతో అది ఏమైందో విచారించనున్నారు. అరెస్టు చేసి షాద్‌నగర్‌ పోలీసు స్టేషన్‌లో ఉంచినప్పుడు బయట ప్రజా ఆందోళనతో పూర్తిస్థాయిలో వారి నుంచి సమాచారాన్ని పోలీసులు రాబట్టలేకపోయారు. ఇప్పటికే సైబరాబాద్‌ సీపీ వీసీ సజ్జనార్‌ దగ్గరుండి కేసు విచారణపై మార్గదర్శనం చేస్తున్నారు. నిందితులకు శిక్ష పడేలా చేసే ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చవద్దని సిబ్బందికి ఆదేశాలిచ్చారు.

ఇప్పటికే పలువురి విచారణ... 
దిశ మృతదేహం కాలడాన్ని చూసిన ఫరూక్‌నగర్‌కు చెందిన సమల సత్యం, మృతురాలి తండ్రి పొతుల శ్రీధర్‌రెడ్డి, తల్లి విజయమ్మ, సోదరి భవ్యతో పాటు కొత్తూరు శివారులోని ఎస్సార్‌ పెట్రోల్‌ బంక్‌లో పనిచేసే లింగరాం ప్రవీణ్‌ గౌడ్, లారీ యజమాని శ్రీనివాస్‌రెడ్డి, నందిగామలోని ఐవోసీ పెట్రోల్‌ బంక్‌లో పనిచేసే శ్యామ్‌ గౌడ్, మృతురాలి బైక్‌లో గాలి నింపిన క్రేన్‌ వెహికిల్‌ హెల్పర్‌ శంషీర్‌ అలమ్‌ను ఇప్పటికే పోలీసులు విచారించారు. ఆయా ఘటనాస్థలి నుంచి దిశ దుస్తులు, నిందితులు తాగిన మందు బాటిళ్లు, మృతదేహం కాల్చిన ప్రాంతం నుంచి సేకరించిన రిస్ట్‌వాచ్, కొత్తూరులో మృతురాలి బైక్‌ స్వాధీనం చేసుకున్నారు.

అలాగే లారీలో నుంచి సేకరించిన రక్తపు మరకలు, వెంట్రుకలను ఇప్పటికే ఫోరెన్సిక్‌ సిబ్బంది సేకరించి పరీక్షలు చేస్తోంది. అలాగే తొండుపల్లి టోల్‌ప్లాజా సర్వీసు రోడ్డు నుంచి చటాన్‌పల్లి అండర్‌పాస్‌ వరకు మృతదేహాన్ని పెట్టుకొని లారీ వెళ్లిన మార్గంలోని సీసీటీవీ ఫుటేజీ దృశ్యాలు సేకరించే పని ఇప్పటికే పూర్తి కావచ్చింది. సాధ్యమైనంత తొందరగా నిందితుల నుంచి మరిన్ని వివరాలు తెలుసుకొని, పూర్తిస్థాయి ఆధారాలతో చార్జిషీట్‌ రూపొందించి ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టుకు పోలీసులు సమర్పించనున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top