అందరి చిరునవ్వే లక్ష్యంగా అభివృద్ధి

State revenue growth is 29.97 per cent - Sakshi

  సర్వమతాలు సమాహారంగా తెలంగాణ

  ప్రగతిపథంలో రాష్ట్రం క్రిస్మస్‌ వేడుకల్లో సీఎం కేసీఆర్‌  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రజలందరి మొహాల్లో చిరునవ్వు చిందించడమే లక్ష్యంగా అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. దేశంలోనే సర్వమతాలు, వర్గాల సమాహారంగా తెలంగాణ నిలిచిందన్నారు. ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా తెలంగాణ ఆర్థికంగా ప్రగతి సాధిస్తోందని వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో నగరంలోని ఎల్బీ స్టేడియంలో శుక్రవారం రాత్రి క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో సీఎం కేసీఆర్‌ పాల్గొని క్రిస్మస్‌ కేక్‌ కట్‌ చేసి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ భగవంతుడి దయ వల్ల ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం.. నాలుగున్నరేళ్లలో చక్కని శాంతియుత వాతావరణం, అద్భుతమైన మతసామరస్యం, అభివృద్ధిపరంగా దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు.

దేశంలోనే క్రిస్మస్‌ వేడుకలను అధికారికంగా నిర్వహిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. క్రిస్మస్, రంజాన్‌ వేడుకలను రాష్ట్రంలో అధికారికంగా నిర్వహిస్తున్నట్లు గుర్తుచేశారు. త్వరలో క్రైస్తవ ప్రముఖులతో సమావేశం ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామని చెప్పారు. రాజకీయ అడ్డంకులు, కోర్టు పిటిషన్లతో క్రిస్టియన్‌ భవన్‌ నిర్మాణం ఆలస్యమైందని, త్వరలో దానిని పూర్తి చేస్తామని సీఎం స్పష్టం చేశారు. మైనారిటీలకు కేంద్ర ప్రభుత్వం నాలుగు వేల కోట్ల బడ్జెట్‌ కేటాయిస్తే తెలంగాణ ప్రభుత్వం రూ.2 వేల కోట్లు కేటాయించిందని గుర్తు చేశారు. విద్య ద్వారా మంచి ఫలితాలు రాబట్టేందుకే గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశామని, ప్రస్తుతం మైనారిటీ గురుకులాలు గొప్ప ఫలితాలు ఇస్తున్నాయని, పదేళ్ల తర్వాత మరింత అద్భుత ఫలితాలు ఉంటాయని పేర్కొన్నారు. 

రాష్ట్ర రెవెన్యూ వృద్ధి 29.97 శాతం
దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో రెవెన్యూ వృద్ధి 29.97 శాతం ఉందని కేసీఆర్‌ వెల్లడించారు. దేశంలో ఏ రాష్ట్రానికి ఇంత రెవెన్యూ వృద్ధి లేదని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఈ ప్రాంతంలో ఇసుక అమ్మకాల ద్వారా రూ.9.56 కోట్ల ఆదాయం సమకూరితే రాష్ట్రం ఏర్పాటు తర్వాత నాలుగేళ్లలో రూ.2,057 కోట్ల ఆదాయం సాధించగలిగామన్నారు. కఠినమైన క్రమశిక్షణ, అవినీతి రహితంగా, అధికారులు అద్భుతంగా పనిచేస్తేనే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. సుస్థిరమైన బంగారు తెలంగాణ నిర్మాణం కోసం కృషి చేస్తున్నామన్నారు. ప్రజల ఆశీస్సులతో టీఆర్‌ఎస్‌ మరోసారి అధికారంలోకి వచ్చిందన్నారు. వేడుకల్లో శాసనమండలి చైర్మన్‌ స్వామిగౌడ్, హోం మంత్రి మహమూద్‌ అలీ, మాజీ మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఎస్‌.కె.జోషి, మైనారిటీ వ్యవహారాల సలహాదారు ఏకే ఖాన్, పలువురు క్రైస్తవ మతపెద్దలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన క్రైస్తవులను నగదు పురస్కారాలతో సన్మానించారు. అనంతరం క్రైస్తవ సొదరులకు విందు ఇచ్చారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top