కార్టూనిస్టులకు రాష్ట్రస్థాయి అవార్డులు

State Level Awards for Cartoonists - Sakshi

శంకర్‌ తెలంగాణవాడు కావడం గర్వకారణం: కేటీఆర్‌ 

సాక్షి, హైదరాబాద్‌: ప్రతి ఏడాది వివిధ రంగాల్లోని ప్రముఖులకు ఇచ్చినట్లే కార్టునిస్టులకు కూడా రాష్ట్ర స్థాయిలో అవార్డులిస్తే బాగుంటుందని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె. తారక రామారావు అభిప్రాయపడ్డారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు తక్షణమే సిద్ధం చేసి సీఎం కేసీఆర్‌కు అందించాలని భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌ మామిడి హరికృష్ణను ఆదేశించారు. శనివారం రవీంద్రభారతిలోని ఐసీసీఆర్‌ ఆర్ట్‌ గ్యాలరీలో ఇండియన్‌ ఫైనార్ట్స్‌ ఆధ్వర్యంలో ది ఇంక్డ్‌ ఇమేజ్‌ పేరుతో రెండు దశాబ్దాల రాజకీయ చిత్రాలు, కార్టూన్లు, క్యారికేచర్ల ప్రదర్శనను కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అంతర్జాతీయ స్థాయి కార్టూనిస్టు పామర్తి శంకర్‌ తెలంగాణవాడు అయినందుకు గర్వంగా ఉందన్నారు.

పొలిటికల్‌ కార్టూన్లు కత్తిమీద సాములాంటివని, ఒక కార్టూన్‌కు ప్రభుత్వాలను అతలాకుతలం చేసేంత శక్తి ఉంటుందన్నారు. ఉద్యమ సమయంలో కేసీఆర్‌ తలకట్టులో శంకర్‌ 10 జిల్లాల తెలంగాణ రేఖా చిత్రం గీసి అద్భుతం సృష్టించారని కొనియాడారు. ఒక కార్టూన్‌ వెయ్యి అక్షరాల సమాచారాన్ని తెలియజేస్తుందని ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ చెప్పారు. 2016లో రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా విశిష్ట పురస్కారాన్ని అందజేసి ప్రభుత్వం శంకర్‌ను గౌరవించిందని మామిడి హరికృష్ణ అన్నారు.  తాను గీసిన కార్టూన్లు, క్యారికేచర్లను ప్రదర్శనలో ఉంచానని కార్టూనిస్టు శంకర్‌ తెలిపారు. ఈ ప్రదర్శన ఏర్పాటుకు హరికృష్ణ ప్రోత్సాహంతోపాటు ఆర్థిక సహకారం అందించారన్నారు. ఈ సందర్భంగా ది ఇంక్డ్‌ ఇమేజ్‌పై శంకర్‌ తీసుకువచ్చిన పుస్తకాన్ని కేటీఆర్‌ ఆవిష్కరించారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top