లక్కీచాన్స్‌

state government to replace teacher posts - Sakshi

జిల్లాలో 820 ఉపాధ్యాయ ఖాళీలు

పోస్టుల్లో 33 శాతం మహిళలకే

రోస్టర్‌ పాయింట్ల ఆధారంగా కేటాయింపు

జనరల్‌ కేటగిరీలోనూ పోటీపడే అవకాశం

టెట్‌లో అర్హత సాధించిన బీఈడీ, డీఈడీ మహిళా అభ్యర్థులకు టీఆర్‌టీ రూపంలో అదృష్టం వేచిచూస్తోంది. టీచర్‌ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం పచ్చ జెండా ఊపడం.. ఇందులో 33 శాతం రిజర్వేషన్‌ కల్పించడం మహిళలకు వరంగా మారింది. దీనికి తోడు జనరల్‌ కోటాలో వీరు పోటీ పడనుండడంతో వీరికి మరిన్ని సీట్లు పెరిగే ఆస్కారం ఉంది. జిల్లాలో మొత్తం 820 పోస్టులకు గాను సుమారు 270 పోస్టులు మహిళలకు రిజర్వు కానున్నాయి.

ఉద్యోగంపై నమ్మకం ఏర్పడింది టీఆర్టీలో మహిళల కోటా ఎక్కువగా ఉండటంతో ఈ సారి ఉద్యోగం సాధిస్తాననే నమ్మకం ఏర్పడింది. ఇది ఎంతో సంతోషించదగ్గ విషయం. డీఎస్సీ కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న మహిళలకు ఇది సదావకాశం. కోటాను సద్వినియోగం చేసుకుని విజయం సాధించాలి. – మాధవి, వికారాబాద్‌

సాక్షి, వికారాబాద్‌: ఉపాధ్యాయ శిక్షణ పొందిన మహిళా అభ్యర్థులు ఉద్యోగం పొందడానికి మంచి అవకాశం లభించింది. టీచర్‌ పోస్టుల భర్తీకిగాను సుప్రీంకోర్టు ఆదేశాలకనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. గతంలో మాదిరిగా జిల్లా సెలక్షన్‌ కమిటీ (డీఎస్సీ) ఆధ్వర్యంలో కాకుండా పోస్టుల భర్తీని తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌కు అప్పగించింది. డీఎస్సీ బదులు టీఆర్‌టీ (టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌) పేరుతో పోటీ పరీక్ష నిర్వహించనున్నారు. ఇటీవల ప్రకటించిన విధంగా జిల్లాలో 820 పోస్టులు ఉన్నట్లు లెక్కతేల్చారు. వీటిలో 33 శాతం మంది మహిళా అభ్యర్థులకు రిజర్వేషన్‌ కల్పించారు. దీంతో సుమారు వీరికి 270 పోస్టులు ప్రత్యేకంగా దక్కనున్నాయి. తమకు కేటాయించిన పోస్టులతో పాటుగా జనరల్‌ కేటగిరీలోనూ మహిళలు ఉద్యోగాలు పొందే అవకాశాలు మెండుగా ఉన్నాయి. రోస్టర్‌ పాయింట్ల ఆధారంగా మహిళలకు ఎక్కువ శాతం పోస్టులను కేటాయించారు. దీంతో జిల్లాలో ఎక్కువ మంది పంతులమ్మలు దర్శనమివ్వనున్నారు. మహిళలు చదువుకుంటే భవిష్యత్‌లో పుష్కలమైన అవకాశాలు ఉన్నాయనడానికి ఈ ఖాళీలే నిదర్శనమని విద్యావంతులు అభిప్రాయపడుతున్నారు.

టెట్‌లో మహిళల ఉత్తీర్ణతే అధికం..
టెట్‌ (టీచర్స్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌)లో అర్హత సాధించిన వారిలో పురుషులకంటే మహిళలే అధికంగా ఉన్నారు. జిల్లాలో టెట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు సుమారుగా 3,500 వరకు ఉండవచ్చని అంచనా. గత ఆగస్టులో నిర్వహించిన టెట్‌లో అన్ని విభాగాల్లో కలిపి 2,468 మంది అర్హత సాధించారు. పేపర్‌ – 1లో 1,683 మంది అభ్యర్థులు పాస్‌కాగా, పేపర్‌– 2లో సోషల్‌ స్టడీస్‌లో 490 మంది అభ్యర్థులు, గణితం మరియు సైన్స్‌ విభాగాల్లో 295 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. దీంతో టెట్‌లో అర్హత సాధించిన అభ్యర్థుల్లో పురుషులకంటే మహిళలే అధికంగా ఉన్నారు. ఉపాధ్యాయ నియామక పరీక్షల్లో కూడా రిజర్వేషన్, జనరల్‌ కేటగిరీల్లో కలిపి పురుషులకంటే ఎక్కువ మంది మహిళలే ఉద్యోగాలను కైవసం చేసుకునే అవకాశముంది. 

మంచి అవకాశం..
ఐదేళ్ల తర్వాత చేపడుతున్న ఉపాధ్యాయ పోస్టుల నియామకాల్లో మహిళలకు మంచి అవకాశాలున్నాయి. ఎస్‌జీటీ తెలుగు మీడియం పోస్టులు 528 ఉండగా, వాటిలో 346 జనరల్‌ కేటగిరీకి కేటాయించారు. వీటిలో 182 పోస్టులు మహిళలకు రిజర్వుచేశారు. ఎస్‌ఏ (స్కూల్‌ అసిస్టెంట్‌) పోస్టులు జిల్లాలో 135 ఉండగా, వీటిలో జనరల్‌ కేటగిరీకి 63 పోస్టులను రిజర్వు చేశారు. మహిళలకు 72 పోస్టులను కేటాయించారు. దీంతో ఎస్‌ఏ పోస్టుల్లో జనరల్‌ పోస్టులకంటే మహిళలకే 9 పోస్టులను అధికంగా రిజర్వ్‌ చేశారు. భాషా పండితుల పోస్టుల విషయానికొస్తే తెలుగు పండిత్‌ విభాగానికి సంబంధించి 54 ఖాళీలు ఉండగా, వీటిలో 32 జనరల్‌ కేటగిరీకి కేటాయించగా, మహిళలకు 24 పోస్టులను రిజర్వు చేశారు. ఉర్దూ మీడియంలో 30 పోస్టులు ఉండగా, వీటిలో 14 పోస్టులను మహిళలకు కేటాయించారు. ఆంగ్ల మాధ్యమంలో 35 పోస్టులు ఉండగా, జనరల్‌ కేటగిరీకి 19 పోస్టులు, మహిళలకు 16 ఖాళీలను రిజర్వు చేశారు. హిందీ పండిత్‌ ఖాళీలు జిల్లాలో 29 ఉండగా, వీటిలో జనరల్‌ కేటగిరీకి 32 పోస్టులు, మహిళలకు 22 పోస్టులను కేటాయించారు. పీఈటీ పోస్టులు జిల్లాలో మొత్తం 6 ఉండగా, జనరల్‌ కేటగిరీకిలో 2 పోస్టులు, మహిళలకు 4 పోస్టులను రిజర్వు చేశారు. పీఈటీలలో పురుషుల కంటే రెండు పోస్టులు మహిళలకే ఎక్కువగా కేటాయించడం విశేషం.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top